November 14, 2026

పంచాయతీ పోరు – ప్రజాభిప్రాయానికి నిలువుటద్దం

(ఇంద్రాణి)

ఆంధ్రప్రదేశ్‌లో అసలైన పండుగ వచ్చేసింది: పంచాయతీ ఎన్నికల పండుగ. ఎన్నికలు అంటే పంచాయతీ ఎన్నికల తర్వాతే ఏదైనా. పార్టీల బలం, బలహీనతలు మరియు పార్టీల సర్దుబాట్ల బండారం బయటపడాలంటే పంచాయతీ ఎన్నికలే గీటురాయి. 2021 లో జరిగినట్లుగా కాకుండా నిజాయతీగా ఎన్నికలు జరిగితే మాత్రం, ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం తెలిసే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులు తెలుస్తాయి.

ఇప్పటివరకు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో సంక్షేమ పథకాలు పెద్ద విషయం కాదు. మౌలిక వసతులు, ఉపాధి కల్పన, కొద్దిగా పరిశ్రమల స్థాపన లాంటివి ప్రధాన అంశాలుగా నడిచే ఎన్నికలు అవి. అక్కడ చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్ సరిపోతుంది. కానీ ఇక్కడ అదొక్కటే సరిపోదు. అభ్యర్థిత్వానికి కూడా కొంత ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థి ఇంట్లో ఎప్పుడో పదేళ్ల క్రితం జరిగిన శుభకార్యానికి పిలిచిన పిలుపులు కూడా ఒక అంశంగా పనిచేస్తాయి. పట్టింపులు, పట్టుదలలు గట్టిగా తమ ప్రభావాన్ని చూపిస్తాయి.

ప్రభుత్వం ఈ ఎన్నికలను నిక్కచ్చిగా జరిపితేనే మంచిది. ఎటువంటి అనుమానాలకు తావీయకుండా జరిపితేనే పొరపాట్లను సరిచేసుకోగలుగుతుంది. మొన్నటివరకు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు విపక్షం ఆరోపించినంత ఏకపక్షంగా జరగలేదు. అదే సమయంలో ప్రభుత్వం చెప్పినంత నిక్కచ్చిగానూ జరగలేదు అనేది వాస్తవం. కొన్ని ప్రాంతాలలో అధికార పార్టీ తన అధికారాన్ని వినియోగించిందనేది ఒప్పుకుని తీరాలి.

అందుకని పంచాయతీ ఎన్నికలను చంద్రబాబు నాయుడు తన సహజ శైలిలో జరిపితేనే, ఆకాశం అంచుల్లో విహరించడం కాకుండా భూమ్మీద ఉన్న అసలు కథ ఎలా ఉందో అర్థమవుతుంది. అలా అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా కొద్దిగా అయినా అధికారాన్ని ఉపయోగిస్తే.. తటస్థ ఓటర్లతో పాటు పార్టీ సానుభూతిపరులు నిజమైన విజయాలను కూడా, లోపాయికారిగా సాధించిన విజయాలుగా అనుమానపడే అవకాశం ఉంటుంది.

అధికారంలోకి వచ్చి సగం కాలం గడిచిన సమయంలో.. ప్రభుత్వ పనితీరును బేరీజు వేసుకోవడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే కూటమి పార్టీలకు మంచిది. మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు నాయుడు సంతృప్తిని వ్యక్తపరుస్తూనే సరిచేసుకోవలసిన అంశాలను ప్రస్తావించారు. అందులో వెంటనే దిద్దుబాటు చేసుకోగలిగే అంశాలు కొన్ని ఉంటే, మరికొన్ని అంశాలు సమయం తీసుకునేవి.

కొద్దో గొప్పో అనుమానాల మధ్య జరిగిన మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ సాధించిన సీట్లను పరిగణనలోకి తీసుకున్నా మరీ తక్కువ వచ్చినట్లు కాదు. అలాగే వైసీపీ సాధించిన ఓట్ల శాతాన్ని చూస్తే గట్టి పోటీ ఇచ్చినట్లుగానే భావించాలి. స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ, శాసనసభకు కూడా రాకుండానే గణనీయమైన ఓట్లను సాధించింది. చావో రేవో అని పోరాడింది. కూటమి పార్టీల స్నేహబంధం పటిష్టంగా ఉన్నప్పుడే అంత గట్టి పోటీ ఇచ్చింది వైసీపీ. రేపు పంచాయతీ ఎన్నికలలో అనేక అంశాలు పనిచేస్తాయి కాబట్టి మరింత గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది.

పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాల కోసం చాణక్య సంస్థ వారు చేసిన సర్వేలో వెల్లడించిన ఒక విషయం ఏమిటంటే, సంక్షేమ పథకాల అమలు తీరు కూటమి హయాంలో కంటే వైసీపీ హయాంలో బాగుంది అనేది ప్రజల భావన. అందులో కొంత వాస్తవం లేకపోలేదు. భారత రాజకీయాలలో పార్టీల అధ్యక్షులకు, వారి పార్టీ సభ్యులకు మధ్య ఎప్పుడూ ఒక పొర అడ్డుగా ఉంటుంది. క్రింది స్థాయిలో వాస్తవ పరిస్థితి గురించి మొహమాటం లేని చర్చ, వారి మధ్య జరిగే అవకాశం తక్కువ. అందువల్ల ఒక శాసనసభ్యుడు కూడా గ్రౌండ్ రియాలిటీని ముఖ్యమంత్రికి చెప్పలేరు.

ప్రస్తుతం టీడీపీ మండల స్థాయి నాయకులు గ్రామ కమిటీల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటుంటే, గ్రామ కమిటీలు సాధారణ సభ్యుల నుండి వ్యతిరేకతను తట్టుకోలేకపోతున్నాయి. వీరందరికీ కనిపించేది వారి శాసనసభ్యుల నిస్సహాయత. నాలుగు నెలల క్రితం పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు పెడతారు అని ఓ శాసనసభ్యుడిని అడిగితే, పెన్షన్లపై సమీక్ష జరిపి అందరికీ సక్రమంగా అందిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పారు.

అరవై సంవత్సరాలు వచ్చిన అర్హులందరికీ పెన్షన్లు రావటం లేదు. ఇక దివ్యాంగులకు ఇస్తానన్న పదిహేను వేలు రావటం గగన కుసుమం అయిపోయింది. ప్రస్తుతం ఆరు వేలు తీసుకుంటున్న వారు అర్హులైనప్పటికీ వారికి పదిహేను వేలు రావటం లేదు. ఇక వారికి వంద శాతం అంగవైకల్యపు సర్టిఫికెట్ తీసుకోవటం చాలా కష్టం అనే కంటే పరపతి లేకపోతే అసాధ్యం అనే చెప్పాలి.

అంతో ఇంతో అమలవుతున్న వృద్ధాప్యపు పెన్షన్, దివ్యాంగుల పెన్షన్ల విషయంలోనే ప్రజల అసంతృప్తిని ఎదుర్కొంటుంటే అసలు మొదలే కానీ నిరుద్యోగ భృతి హామీ కి కూడా సమాధానం చెప్పవలసి ఉంటుంది. ప్రజల నుండి ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కొలేక మండల స్థాయి నాయకులు కార్యకర్తలకు దొరకకుండా తిరిగే పరిస్థితి ఉంది. సంక్షేమ పథకాలు ఎవరికీ రావటం లేదని చెప్పడం లేదు కానీ, కొందరికి రాకపోవడం వాస్తవం.

టీడీపీ హయాంలో ఎప్పుడూ శాసనసభ్యుల మాట అధికారులు వినరు. అందువల్ల దివ్యాంగుల విషయంలో శాసనసభ్యులు కూడా చేతులెత్తేయడం మినహా ఏమీ చేయలేకపోతున్నారు. ఎంత ఇచ్చాము, ఎంత మందికి ఇచ్చాము అనేదానికంటే.. ఎంతమందికి ఇవ్వలేదు అనేది కూడా సమీక్ష చేసుకుంటేనే ఈ విషయం అర్థమవుతుంది. వంద మందికి ఇచ్చినా ఒక్కరికి ఇవ్వని విషయమే పంచాయతీ ఎన్నికలలో పెద్ద అంశం అవుతుంది.

మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి సఖ్యత నిలబడింది. సర్పంచ్ ఎన్నికలలో సఖ్యతను నిలబెట్టడం చంద్రబాబు నాయుడికి కత్తి మీద సాము వంటిదే. పంచాయతీలలో టీడీపీ బలం వేరు, జనసేన బలం వేరు. జనసేన ఇంకా బలమైన కార్యకర్తల వ్యవస్థ నిర్మాణంలో వెనుకబడి ఉన్నది. బీజేపీకి పట్టణాలలో ఉన్న మాత్రం బలం కూడా పల్లెల్లో లేదు. కానీ సీట్ల సర్దుబాట్లలో బీజేపీ సర్దుబాటు ధోరణిని అవలంబించదు. అక్కడ కూడా లెక్క తప్పే అవకాశం ఉంటుంది.

జగన్ మళ్లీ వస్తాడేమో అనే భయం చూపిస్తూ టీడీపీ అధిష్టానం, తన కార్యకర్తల మీద మోపుతున్న భారం వాళ్లను అలసటకు గురిచేస్తోంది. ఉన్న పరిస్థితుల్లో సర్దుబాట్లు తప్పనిసరి అని తెలిసినా, సర్దుబాటు పిడుగు తమపైన పడకుండా ఉంటే బాగుండు అని టీడీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు.

“పార్టీ గీసిన గీత దాటితే వేటు తప్పదు” అని చంద్రబాబు అంటున్నారు. భయంతో కార్యకర్తలు కట్టడి అవుతారు కానీ, సానుభూతిపరుల ఆలోచన ఎలా ఉంటుందో చూడాలి. ఏదైనా పంచాయతీ ఎన్నికలలో ఎవరికి ఎన్ని అనే విషయం కాకుండా, కూటమి అభ్యర్థుల గెలుపు ప్రధానం అనే కాన్సెప్ట్‌తో ముందుకు వెళ్లకపోతే వైసీపీ కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది!

Total Visitors: 3,425,486