November 14, 2026

ఒప్పందాలపై కొలమానంతో కొత్త స్వీయ ఒరవడి

భారతదేశంలో పెట్టుబడుల సదస్సులు నిర్వహించడం, లక్షల కోట్ల రూపాయల అవగాహన ఒప్పందాల (ఎంఓయూ)పై సంతకాలు చేయడం దశాబ్దాలుగా చూస్తున్నదే. అయితే, సదస్సుల వేదికలపై మెరిసే అంకెలకు, వాస్తవంగా నేలపై ఏర్పడే పరిశ్రమలకు మధ్య ఉండే అంతరం ఎప్పుడూ చర్చనీయాంశమే.

ఉత్తరప్రదేశ్ ‘నివేశ్ సారథి’, తమిళనాడు ‘గైడెన్స్ బ్యూరో’, గుజరాత్ ‘ఇండెక్స్‌బీ’ వంటి వ్యవస్థల ద్వారా ఆయా రాష్ట్రాలు పెట్టుబడుల పర్యవేక్షణకు కృషి చేస్తున్నప్పటికీ—ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన విధానాలు పారిశ్రామిక పాలనలో ఒక సరికొత్త ఒరవడికి నాంది పలుకుతున్నాయి.

విశాఖపట్నంలో ముగిసిన సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన మూడు కీలక ప్రకటనలు పారిశ్రామికవేత్తల ఆలోచనా ధోరణిని మార్చేవిగా ఉన్నాయి.

మొదటిది—కుదుర్చుకున్న ప్రతి ఎంఓయూ అమలు తీరుపై ఏటా ఆడిట్ రిపోర్ట్ విడుదల చేయడం. ఇది కేవలం గణాంకాల ప్రకటన కాదు; ప్రభుత్వానికి తానే విధించుకున్న స్వీయ జవాబుదారీతనం. భూములు తీసుకుని పరిశ్రమలు పెట్టకపోతే వెనక్కి తీసుకుంటామన్న హెచ్చరిక, అదే సమయంలో అనుమతుల కోసం ‘సెల్ఫ్ సర్టిఫికేషన్’, రియల్ టైమ్ పర్యవేక్షణ విధానాలు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నుంచి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ వైపు అడుగులు వేయిస్తున్నాయి.

రెండోది—ఎస్క్రో ఖాతా ఏర్పాటు. పరిశ్రమలు స్థాపించిన తర్వాత ప్రభుత్వం ప్రకటించిన రాయితీల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి దేశవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలను వేధిస్తున్న ప్రధాన సమస్య. రాయితీల చెల్లింపులను ఆటో-పైలట్ మోడ్‌లో ఎస్క్రో ఖాతాకు అనుసంధానించడం వల్ల, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు ఆర్థిక భరోసా లభిస్తుంది.

మూడోది, అత్యంత కీలకమైనది—ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ (పెట్టుబడుల రక్షణ చట్టం). ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారిపోతాయన్న అభద్రతా భావం పెట్టుబడిదారులను వెనక్కి లాగుతుంటుంది. పెట్టుబడులకు చట్టబద్ధమైన రక్షణ కల్పించడం ద్వారా “విశ్వసనీయత అనేది మాటల్లో కాదు, వ్యవస్థల్లో ఉంటుంది” అని ఏపీ స్పష్టమైన సంకేతం పంపింది.

2024 జూన్ నుంచి ఇప్పటివరకు వచ్చిన రూ.32.49 లక్షల కోట్ల ప్రతిపాదనలు, వాటిలో ఇప్పటికే రూ.7.30 లక్షల కోట్ల ప్రాజెక్టులు నిర్మాణ దశకు చేరుకోవడం, కియా వంటి దిగ్గజ సంస్థలు విస్తరణకు ముందుకు రావడం సానుకూల పరిణామాలు.

అయితే, ప్రకటించిన ఈ ఆడిట్ వ్యవస్థ, యుద్ధప్రాతిపదిక పర్యవేక్షణ క్షేత్రస్థాయి అధికారుల స్థాయిలోనూ అదే వేగంతో పనిచేసినప్పుడే—అమరావతి క్వాంటం హబ్ అయినా, విశాఖ ఏఐ నగరమైనా, రాయలసీమ తయారీ రంగమైనా—ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖచిత్రాన్ని శాశ్వతంగా మార్చగలవు. ఆ దిశగా కదనోత్సాహంతో మొదలైన ఈ కొలమానాలు దేశానికి కూడా బెంచ్ మార్క్ అవ్వాలని ఆశిద్దాం.

Total Visitors: 3,425,492