November 14, 2026

వైఎస్ పోయిన రెండురోజులకే సీఎం పదవి అడిగాడు

  • బాబాయ్ రాజకీయాలు చేస్తారు.. నువ్వు వ్యాపారంలో ఉండమని సలహా ఇచ్చా
  • సీఎం సంగతి తర్వాత చూద్దామని చెప్పా
  • జగన్ కంపెనీలపై విచారణ చేయిస్తానని వైఎస్‌కు చెప్పా
  • జగన్ తన మాట వినడం లేదని వైఎస్ చెప్పారు
  • జగన్‌ను కలసినప్పుడు ఆయన పద్ధతి నాకు నచ్చలేదు
  • అందుకే అలాంటి వ్యక్తికి సీఎం ఇవ్వకూడదనుకున్నా
  • వైఎస్‌ఆర్‌ నమ్మకం, జగన్‌ వైఖరి
  • సోనియా గాంధీ పుస్తకంలోని సంచలన అంశాలు

( కృష్ణ బి బి)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ, కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనూ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి (వైఎస్‌ఆర్) ప్రస్థానం అత్యంత ప్రాముఖ్యమైనది. కాంగ్రెస్ అధిష్టానానికి, ముఖ్యంగా సోనియా గాంధీకి వైఎస్‌ఆర్ అత్యంత నమ్మకస్తుడైన నాయకుడిగా పేరుగాంచారు. తాజాగా సోనియా గాంధీ రాసిన పుస్తకంలో వైఎస్‌ఆర్‌తో తనకున్న అనుబంధం, ఆయన మరణం తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు మరియు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గురించి పలు ఆసక్తికరమైన, సంచలనాత్మక అంశాలను పంచుకున్నారు.

వైఎస్‌ఆర్‌పై పూర్తి నమ్మకం – స్వేచ్ఛాయుత నిర్ణయాలు

సోనియా గాంధీ తన పుస్తకంలో వైఎస్‌ఆర్‌ను స్మరించుకుంటూ, ఆయన తనకు ఎంతో నమ్మకమైన నాయకుడని పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ చూపించిన ఆ నిబద్ధత, నమ్మకంతోనే రాష్ట్రంలో పాలనాపరమైన మరియు పార్టీపరమైన నిర్ణయాలు స్వేచ్ఛగా తీసుకోవడానికి ఆయనకు పూర్తి వెసులుబాటు కల్పించామని తెలిపారు. ఇచ్చిన స్వేచ్ఛను, నమ్మకాన్ని వైఎస్‌ఆర్ చివరివరకు నిలబెట్టుకున్నారని ఆవిడ కొనియాడారు. వైఎస్‌ఆర్ అకాల మరణం కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా తమ కుటుంబ తీవ్ర బాధకు గురిచేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

మరణాంతరం పరామర్శ – ఓదార్పు వేళ జగన్ వ్యాఖ్యలు

వైఎస్‌ఆర్ మరణించిన తర్వాత పరామర్శించేందుకు వైఎస్ కుటుంబం వద్దకు వెళ్లిన సందర్భాన్ని సోనియా గాంధీ గుర్తు చేసుకున్నారు. అక్కడ విజయమ్మ, షర్మిల తీవ్ర దుఃఖంలో ఉండటం చూసి తనకు ఎంతో బాధ కలిగిందని తెలిపారు. అయితే, అదే సమయంలో జగన్ తో ఓదార్పుగా మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ “తర్వాత జరగాల్సింది చూద్దాం” అని అన్నారని, ఆ సమయంలో ఆయన వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం తనకు అర్థం కాలేదని సోనియా గాంధీ రాసుకొచ్చారు.

సిఎం పీఠం కోసం కబురు – ఢిల్లీ భేటీ

వైఎస్‌ఆర్ మరణించిన కేవలం రెండు రోజుల వ్యవధిలోనే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి సందేశం పంపారని పుస్తకంలో పేర్కొన్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు తనకే మద్దతు ఇస్తున్నారని, అందువల్ల తనే ముఖ్యమంత్రిని కావాలని కోరుకుంటున్నట్లు జగన్ కబురు పంపినప్పటికీ, తాను అప్పుడు ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదని సోనియా స్పష్టం చేశారు. ఆ తర్వాత జగన్ తన కుటుంబసమేతంగా వచ్చి కలిసినప్పుడు, ఆయనకు ముఖ్యమంత్రి పదవి కావాలని అడిగారు. బాబాయి రాజకీయాలు చేసుకుంటారని, నువ్వు వ్యాపార వ్యవహారాలను చూసుకోవాలని కొద్ది రోజుల తర్వాత ముఖ్యమంత్రి పదవి గురించి చూద్దామని తాను సలహా ఇచ్చినట్లు తెలిపారు.

జగన్ ప్రవర్తనపై విమర్శలు – సీఎం నిర్ణయంపై తిరస్కరణ

జగన్మోహన్ రెడ్డి వైఖరి, ప్రవర్తన, అతని కంపెనీలు ఆర్థిక లావాదేవీలు సరిగ్గా లేవని, సీనియర్ నాయకులకు చాలా అవమానాలు చేశాడు అని అంతకుముందే చాలామంది తనకు చెప్పారని, అయితే నేరుగా కలిసినప్పుడు ఆయన మాట్లాడే విధానం, ప్రవర్తన ద్వారా అది స్పష్టమైందని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. జగన్ మాట్లాడే రీతి అంతా ఒక రకంగా అనిపించిందని, అలాంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించడం ఏమాత్రం సరికాదని తాను స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు సోనియా గాంధీ తన పుస్తకంలో సుదీర్ఘంగా వివరించారు.

వైఎస్‌ఆర్‌కే హెచ్చరికలు – అక్రమార్జనపై ఆందోళన

వైఎస్‌ఆర్ జీవించి ఉన్న కాలంలోనే, 2009 ఎన్నికల కంటే ముందే జగన్ ఆస్తులు, అక్రమార్జన వ్యవహారాలపై వైఎస్‌ఆర్‌ను హెచ్చరించినట్లు, విచారణకు ఆదేశాలు ఇస్తాము అని వైఎస్ఆర్ కు తెలిపినట్లు సోనియా గాంధీ వెల్లడించారు. దీనిపై వైఎస్‌ఆర్ స్పందిస్తూ.. జగన్ తన మాట వినడం లేదని, అయినప్పటికీ ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయని, జగన్ ను తన మార్గంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తానని 2009 ఎన్నికల ముందే తనతో వైయస్సార్ చెప్పారని సోనియా గాంధీ తన పుస్తకంలో పేర్కొన్నారు.

Total Visitors: 3,425,495