November 16, 2026

రాహుల్ ఖబర్దార్.. మోదీని విమర్శిస్తే సహించేది లేదు

  • ప్రొగ్రెసివ్ అలయెన్స్ పేరుతో భారత వ్యతిరేకులను తీసుకువచ్చి దేశ ప్రతిష్టను దిగజార్చేలా చేయడం సిగ్గుచేటు
  • రాహుల్ గాంధీకి పార్లమెంటులో మాట్లాడడం చేత కాదు
  • శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, ఫ్రాన్స్ లాగా భారత్ లో కూడా అల్లర్లు జరగాలని రాహుల్ గాంధీ కోరుకుంటున్నారు
  • సోనియా గాంధీ పుస్తకంలో అవాస్తవాలు రాసి దేశప్రజలను పక్కదోవ పట్టించారు
  • రేవంత్ రెడ్డి కి సోయి లేకపోవడం వల్లే హైదరాబాద్ కి తాగునీటి కష్టాలు వచ్చాయి
  • సోనియా, రాహుల్ కి డబ్బులు పంపే దానిపై ఉన్న శ్రద్ధ తెలంగాణ ప్రజలమీద లేదు
  • నీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదు
  • మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్

యాదగిరిగుట్ట: రాష్ట్రంలో ఏ సమస్యొచ్చినా దానిని ఇతరుల మీద నెట్టి, ఎదురుదాడితో డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారే తప్ప, ముఖ్యమంత్రిగా తనకు బాధ్యత ఉందనే సోయి రేవంత్ రెడ్డికి లేదని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యాదగిరిగుట్టలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వపు తీరును తీవ్రంగా ఎండగట్టారు.

ఎల్నినో ముప్పుపై హెచ్చరించినా ప్రభుత్వానికి పట్టలేదు

“రాబోయే కాలంలో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని, కరువు పరిస్థితులు ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడతారని ఏడాది ముందే శాస్త్రవేత్తలు, అంతర్జాతీయ వ్యవస్థలు హెచ్చరించాయి. దీనిపై నేనే స్వయంగా తొలి ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాను. ‘రేవంత్ రెడ్డి గారూ.. మీ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ మీ కాళ్లు మాత్రం తంగేళ్లు దాటడం లేదు. భూమి మీద ఉండి ఆలోచించండి’ అని హితవు పలికారు.

రాబోయే తాగు, సాగునీటి , భూగర్భ జలాలు అడుగంటిపోవడం, కరెంటు సమస్యలపై ముందుగానే ఆలోచించాలని కోరాను. కేసీఆర్ మీద కోపం ఉంటే ఉండొచ్చు, కానీ ఆ కోపంతో తెలంగాణ రైతాంగాన్ని శిక్షించవద్దని కోరినా పట్టించుకోలేదు. ఫలితంగా ఇవాళ హైదరాబాద్ నగరంలోనూ, రాష్ట్రవ్యాప్తంగా తాగునీరు లేక, బోర్లు-బావులు ఎండుకుపోయి హాస్టల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు” అని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు.

వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం

పంటలు ఎండిపోయినప్పటికీ, చేతికి వచ్చిన కాస్త ధాన్యాన్ని అమ్ముకోవడానికి వెళ్తే వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేవని ఈటల మండిపడ్డారు. “కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసినా గన్నీ బస్తాలు లేవు, అమాలీ వ్యవస్థ లేదు, కాంటాలు లేవు, తార్పాలిన్లు లేవు. కనీస ధర్మంగా అఖిలపక్ష సమావేశం పెట్టి రైతాంగ సమస్యలపై చర్చించాల్సిన సంస్కారం కూడా సీఎంకు లేదు. ‘నాకు తెలవదా.. అన్నీ నేనే చేస్తా’ అనే అహంకార ధోరణితో వ్యవహరిస్తూ రైతులను రోడ్డున పడేశారు” అని ధ్వజమెత్తారు.

హైదరాబాద్ సమ్మిట్ పేరుతో దేశ పరువు తీస్తున్న రాహుల్ గాంధీ

నిరుద్యోగులను మోసం చేసి, ప్రైవేట్ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులను పట్టించుకోని ప్రభుత్వం.. ‘ప్రోగ్రెసివ్ అలయన్స్’ పేరుతో హైదరాబాద్‌లో కాంక్లేవ్ నిర్వహించడాన్ని ఈటల తప్పుబట్టారు. “ఈ సమ్మిట్ పరిశ్రమల స్థాపనకో, నిరుద్యోగ సమస్య పరిష్కారానికో కాదు. దేశంలో ప్రజాస్వామ్యం లేదు, మోదీ , సుప్రీంకోర్టు, ఈసీ వంటి వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ప్రపంచ దేశాల ముందు భారత్ ప్రతిష్టను, గౌరవాన్ని మట్టి కలిపేందుకే రాహుల్ గాంధీ ఈ కార్యక్రమం నిర్వహించారు.

100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి అప్పోజిషన్ లీడర్‌గా ఉండి రాహుల్ మాట్లాడుతున్న తీరు చూసి భారత జాతి సిగ్గుతో తలదించుకుంటోంది. పార్లమెంట్‌లో మాట్లాడే సత్తా లేక, వాస్తవాలు ధైర్యంగా చెప్పలేక బయట అబద్ధాలతో అశాంతిని సృష్టించాలనే నీచమైన ఆలోచన చేస్తున్నారు” అని మండిపడ్డారు. శ్రీలంక, నేపాల్, అఫ్గానిస్తాన్ తరహాలో దేశంలో అల్లర్లు జరగాలని కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారని, కానీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలందరూ ప్రధాని మోదీ గారి నాయకత్వంలోనే సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ చరిత్రే స్కాముల మయం

సోనియా గాంధీ పుస్తకావిష్కరణ, కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై స్పందిస్తూ.. “జవహర్ లాల్ నెహ్రూ కాలంలోనే ఎల్ఐసి కుంభకోణం, మిలటరీ జీపుల కొనుగోళ్ల స్కామ్ జరిగాయి. బోఫోర్స్ నుంచి 2G, కోల్ స్కామ్ వరకు.. సొంత మంత్రులే జైలుకు వెళ్లిన చరిత్ర కాంగ్రెస్‌ది. మోదీ 12 ఏళ్ల పాలనలో ఎక్కడా చిన్న మచ్చ కూడా లేకుండా దేశం గర్వపడేలా పాలన సాగుతుంటే, గుడ్డి ద్వేషంతో, అధికారం కోల్పోతామనే డెస్‌పరేషన్‌లో కాంగ్రెస్ నాయకులు పిచ్చి పనులు చేస్తున్నారు” అని విమర్శించారు. దేశంలో ప్రస్తుతం కేవలం నాలుగు రాష్ట్రాలకే (కేరళ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ) కాంగ్రెస్ పరిమితమైందని, కర్ణాటక, తెలంగాణల్లో 30-40% ప్రభుత్వాలు నడుస్తున్నాయని, హిమాచల్ ప్రదేశ్‌లో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.

రేవంత్ రెడ్డికి హెచ్చరిక

“హైదరాబాద్‌కు వచ్చి మోదీ ని, దేశ ప్రతిష్టను భంగపరిచే ప్రయత్నం చేస్తే ఖబర్దార్! రేవంత్ రెడ్డి గారూ.. మీ ప్రభుత్వం గాన్ కేస్ (అవుట్). 2028 ఎన్నికల్లో మీ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. ఉన్నన్ని రోజులు ఇచ్చిన హామీలు ఏంటో, ఏం చేస్తారో చెప్పండి తప్ప ఇట్లాంటి దిగజారుడు రాజకీయాలు చేయవద్దు. బీజేపీ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై కొట్లాడి, తగిన విధంగా బుద్ధి చెప్పే సత్తా భారతీయ జనతా పార్టీకి ఉంది. వెంటనే వాస్తవంలోకి వచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించే మార్గం చూడాలి” అని ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కర్ణాటక రాష్ట్రం సహా ప్రభారి శ్రీ కాసం వెంకటేశ్వర్లు , జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ , మాజీ అధ్యక్షులు పాశం భాస్కర్ , రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రచ్చ శ్రీను , మండల అధ్యక్షులు గుంటిపల్లి సత్యం , బీజేవైయం జిల్లా అధ్యక్షులు కర్రె ప్రవీణ్ కుమార్ , మండల ప్రధాన కార్యదర్శి ప్రసాద్ , మహేష్ , పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Total Visitors: 3,451,186