November 16, 2026

హరీశ్ రావు అవినీతి ఆరోపణలపై నిగ్గు తేల్చాల్సిందే

  • ప్రజాక్షేత్రంతో పాటు చట్టపరంగా, న్యాయపరంగానూ పోరాడుతాం:
  • కరువు పరిస్థితులపై ప్రధాని వద్ద సీఎం ప్రస్తావించకపోవడం అన్యాయం
  • త్వరలో భైరవ వాహనంలో రాష్ట్రవ్యాప్త యాత్ర
  • తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

నిజామాబాద్: మాజీ మంత్రి హరీశ్ రావుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేల్చాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రజాక్షేత్రంలో పోరాటం చేయడంతో పాటు చట్టపరంగా, న్యాయపరంగా అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో పోరాడతామని స్పష్టం చేశారు.

సోమవారం నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన కవిత, హరీశ్ రావు అవినీతికి సంబంధించి తమ వద్ద ఉన్న ఆధారాలను సీబీసీఐడీ, కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు పంపిస్తామని తెలిపారు. తప్పు చేసిన వారెవరైనా శిక్ష పడాలన్నదే తమ విధానమని పేర్కొన్నారు.

ప్రధానిని కలిసి కరువుపై మాట్లాడకపోవడం ఏమిటి?

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కవిత విమర్శించారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో కరువు పరిస్థితులు, రైతుల సమస్యలు, పంటల పరిస్థితిపై ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు.

రైతుల ఇబ్బందులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి కేంద్ర సాయం కోరాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న బీసీ బిల్లు అంశాన్ని కూడా ప్రధాని వద్ద ప్రస్తావించకపోవడం అన్యాయమని విమర్శించారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి కాంట్రాక్టులు, కమీషన్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో కరువు మండలాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులు పంటలు వేయవద్దని సూచించిన ప్రభుత్వం, పంటలు సాగు చేయని రైతులకు ఎలాంటి పరిహారం అందిస్తుందో స్పష్టం చేయాలని కోరారు. రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

భైరవ వాహనంలో రాష్ట్రవ్యాప్త యాత్ర

తమ పార్టీ ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందించడంతో పాటు అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తోందని కవిత తెలిపారు. పాంచజన్య సంకల్పంలో భాగంగా త్వరలోనే భైరవ వాహనంలో రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.

నిరుద్యోగులను మోసం చేసి, ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించని కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, బీజేపీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా కాలం గడుపుతున్నాయని విమర్శించారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు తమ పార్టీ కృషి చేస్తోందని, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయంపై అభ్యంతరం

ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని కవిత అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై మంగళవారం తమ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Total Visitors: 3,451,103