November 16, 2026

మందుల కొను‘గోల్‌మాల్’లో సర్వం మాయ!

  • టీజీఎంఎస్‌ఐడీసీలో వరుస వేట్లు.. అయినా మారని తీరు
  • ఇప్పుడు రూ.100 కోట్ల వెంటిలేటర్ల టెండర్‌పై ఆరోపణలు
  • రెండేళ్లలో రెండుసార్లు రద్దు.. మూడోసారి 869 యంత్రాలకు టెండర్
  • కోర్టుకెక్కిన ఈఎస్‌డబ్ల్యూఎల్ ఆర్డర్.. చివరకు 60:40 పంపకం
  • రూ.3,545 కోట్ల కొనుగోళ్లపై ఆరు నెలలుగా విజిలెన్స్ విచారణ
  • బిల్లు క్లియర్ కావాలంటే ‘పర్సంటేజీ’..
  • రూ.128 కోట్ల బకాయిలు
  • మంత్రి రాజనర్శింహ సంస్కరణలు మాటలకేనా?

(అంజిరెడ్డి)

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు మందులు, వైద్య పరికరాలు కొనుగోలు చేసి సరఫరా చేసే తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్‌ఐడీసీ)లో అక్రమాల పర్వం ఆగడం లేదు. గత నాలుగేళ్లలో జరిగిన సుమారు రూ.3,545 కోట్ల కొనుగోళ్లపై విజిలెన్స్ విచారణ కొనసాగుతుండగానే, గడిచిన మూడు వారాల్లో ఓ జనరల్ మేనేజర్, ఓ ఫార్మసిస్టుపై వేటు పడింది.

అయినా సంస్థ తీరు మారలేదనడానికి తాజాగా వెంటిలేటర్ల టెండర్ వ్యవహారమే నిదర్శనం. ఆసుపత్రుల ఐసీయూల కోసం చేపట్టిన రూ.100 కోట్ల కొనుగోలులో తమకు కావాల్సిన కంపెనీకే ఆర్డర్ దక్కేలా సంస్థలోని ఓ అధికారిణి చక్రం తిప్పుతున్నారని, కమీషన్ ఖరారయ్యే వరకు ఫైలు ముందుకు కదలనివ్వడం లేదని సరఫరాదారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు బిల్లుల చెల్లింపుల్లోనూ పర్సంటేజీల దందా నడుస్తోందన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

రూ.100 కోట్ల వెంటిలేటర్లపై కన్ను

రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల ఐసీయూ విభాగాల కోసం 869 వెంటిలేటర్ల కొనుగోలుకు సంస్థ ఈ ఏడాది ఆగస్టులో టెండర్లు పిలిచింది. ఒక్కో యంత్రం ధర దాదాపు రూ.12 లక్షలు కాగా, మొత్తం ఆర్డర్ విలువ సుమారు రూ.100 కోట్లు. సాంకేతిక బిడ్ల పరిశీలన పూర్తికాక ముందే ఓ కంపెనీతో రూ.కోట్లలో ఒప్పందం కుదిరిందని, అందులో కొంత మొత్తాన్ని ముందస్తుగానే అందుకున్నారని ఫిర్యాదులు అందినట్లు సమాచారం.

ఈ వ్యవహారం రెండేళ్లకు పైగా నానుతోంది. 2024లో తొలిసారి 40 వెంటిలేటర్లకు టెండర్ పిలవగా ఐదు కంపెనీలు పోటీపడ్డాయి. చైనాలో తయారైన యంత్రాలను సరఫరా చేస్తున్నారన్న ఫిర్యాదులతో ఆ టెండర్‌ను రద్దు చేశారు. 2025లో మళ్లీ పిలిచిన టెండర్‌నూ.. బిడ్లలో వచ్చినవి కంప్రెషర్ ఆధారిత యంత్రాలని, టర్బైన్ మోడల్ కావాలని చెబుతూ రద్దు చేశారు.

రెండుసార్లూ అతి తక్కువ ధర కోట్ చేసి ఎల్‌1గా నిలిచిన కంపెనీలు అనర్హతకు గురయ్యాయి. ఇప్పుడు జిల్లాల్లో టిమ్స్ ఆసుపత్రులు అందుబాటులోకి వస్తుండటంతో మూడోసారి ఏకంగా 869 యంత్రాలకు టెండర్ పిలిచారు. సాంకేతిక లోపాలుంటే టెక్నికల్ బిడ్ దశలోనే తిరస్కరించాల్సి ఉండగా, ఫైనాన్షియల్ బిడ్ తెరిచి ధరలు బయటపడ్డాక కూడా అనర్హత వేటు వేస్తున్నారని సరఫరాదారులు చెబుతున్నారు.

కొటేషన్లలో లోపాలుంటే బిడ్డర్లందరికీ ఒకే పత్రం ద్వారా అధికారిక మెయిల్ పంపడం ఆనవాయితీ. కానీ ఇటీవల నచ్చిన కంపెనీలకు విడివిడిగా, డిస్పాచ్ నంబర్లు లేకుండా, అదీ రాత్రి 9.30 తర్వాత మెయిళ్లు పంపినట్లు తెలుస్తోంది. సంస్థ అధికారిక మెయిల్ నిర్వహణను ఓ ప్రైవేటు వ్యక్తికి అప్పగించారన్న ఆరోపణలూ ఉన్నాయి.

మూత్రపిండాల్లో రాళ్లను తొలగించే ఈఎస్‌డబ్ల్యూఎల్ (లిథోట్రిప్సీ) యంత్రాల సరఫరాలోనూ భారీగా డబ్బు చేతులు మారినట్లు సమాచారం. ఎల్‌1గా నిలిచిన కంపెనీని కాదని ఎల్‌2 కంపెనీకి ఆర్డర్ ఇచ్చేందుకు సన్నాహాలు జరగడంతో ఎల్‌1 కంపెనీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. చివరకు రెండు కంపెనీల నుంచీ ముడుపులు అందుకుని ఆర్డర్‌ను 60:40 నిష్పత్తిలో పంచి వివాదాన్ని సద్దుమణిగించినట్లు తెలుస్తోంది.

మూడు వారాల్లో రెండు వేట్లు

టెండర్లలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో సంస్థ జనరల్ మేనేజర్‌ను తక్షణం రిలీవ్ చేస్తూ ఎండీ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ అక్టోబర్ 26న ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు ఆర్డర్ విలువను బట్టి కమీషన్లు వసూలు చేశారని, ఓ పరికరాల టెండర్‌ను ఒకే కంపెనీకి దక్కేలా స్పెసిఫికేషన్లు ఖరారు చేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఒకే పరికరానికి ఇద్దరు విభాగాధిపతులు వేర్వేరు స్పెసిఫికేషన్లతో ఇండెంట్ పెట్టగా ఓ కంపెనీకి అనుకూలమైనవే ఆమోదించడంతో.. “ఆ ఉపకరణం మాకు వద్దు” అంటూ ఓ విభాగాధిపతి ఎండీకి లేఖ రాశారని సమాచారం.

పది రోజులకే నవంబర్ 4న ఔషధ విభాగంలోని ఓ ఫార్మసిస్టును ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయానికి సరెండర్ చేశారు. సంస్థలోని ఇద్దరు కీలక అధికారులకు ఆయన ‘కలెక్షన్ ఏజెంట్’గా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులే ఇందుకు కారణం. జూన్‌లోనూ అక్రమాల ఆరోపణలతో ఓ కీలక అధికారిని బదిలీ చేశారు. డిప్యుటేషన్ గడువు మార్చిలోనే ముగిసినా, పొడిగింపు ఉత్తర్వులు లేకుండా ఆర్థిక విభాగంలో ఓ అధికారి కొనసాగుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.

విజిలెన్స్ నివేదిక ఎప్పుడు?

2022 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు మందులు, వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్ కిట్ల కొనుగోలుకు వెచ్చించిన సుమారు రూ.3,545 కోట్లపై ప్రభుత్వం మే 20న విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అధికారులు సంస్థ నుంచి 11 రకాల కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. రిటుక్సిమాబ్, టిర్జెపటైడ్, రెండు రకాల ఇన్సులిన్, ఫెర్రిక్ కార్బాక్సీమాల్టోజ్ కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

పదేళ్లుగా కొనని రిటుక్సిమాబ్ ఇంజెక్షన్లను 2022–24 మధ్య రూ.3.58 కోట్లతో 5,800 కొనగా, వాడింది సుమారు 2 వేలే. మిగతావి గడువు తీరి వృథా అయ్యాయి. సంస్థ అధికారుల ఒత్తిడితోనే ఇండెంట్లు పెట్టామని కొందరు ఆసుపత్రుల సూపరింటెండెంట్లు సెప్టెంబర్‌లో విజిలెన్స్‌కు చెప్పినట్లు సమాచారం. 2017–18 నుంచి సంస్థ కొన్న మందుల్లో రూ.88.15 కోట్ల విలువైనవి గడువు తీరి పనికిరాకుండా పోయాయి. విచారణ మొదలై ఆరు నెలలు కావస్తున్నా నివేదిక బయటకు రాలేదు. వైద్య కళాశాలలకు కంప్యూటర్లు, ప్రింటర్లను టీఎస్‌టీఎస్ ద్వారా కాకుండా నేరుగా కొనడం, 11 ఎంఆర్‌ఐ యంత్రాల టెండర్ కేటాయింపుపైనా ఆరోపణలు ఉన్నాయి.

బిల్లుకు ‘పర్సంటేజీ’.. ఆగిన సరఫరా

సరఫరాదారులకు బిల్లుల చెల్లింపు సంస్థలో మరో దందాగా మారింది. వెబ్‌సైట్‌లో బిల్లు అప్‌లోడ్‌కు 2 శాతం, క్లియరెన్స్‌కు మరో 2 శాతం.. పై స్థాయి వరకు మొత్తం 6 శాతం ‘రేటు’ ఫిక్స్ అయ్యిందని ఏజెన్సీ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. సీనియారిటీ ప్రకారం కాకుండా దళారుల సిఫారసు చేసిన ఏజెన్సీలకే ముందుగా చెల్లింపులు జరుగుతున్నాయని చెబుతున్నారు.

ఫలితంగా మిగతా సరఫరాదారులకు సంస్థ నుంచే సుమారు రూ.128 కోట్లు రావాల్సి ఉందని ట్విన్ సిటీస్ హాస్పిటల్ సప్లయర్స్ అసోసియేషన్ చెబుతోంది. బకాయిల కారణంగా గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ ఆసుపత్రులకు సిరంజీలు, గ్లోవ్స్, క్యాథెటర్లు, డయాలసిస్ సామగ్రి సరఫరా నిలిచిపోయింది. దీంతో రోగులు బయటి దుకాణాల్లో కొనుక్కోవాల్సి వస్తోంది.

సంస్కరణలు కాగితాలకే

అక్రమాల నేపథ్యంలో జూన్‌లో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సంస్థ ప్రక్షాళనకు ఆదేశాలిచ్చారు. టెండర్ కమిటీలను రెండు నుంచి ఐదుకు పెంచాలని, కొనుగోళ్లపై ప్రతి నెలా సమీక్షించాలని, ఏళ్ల తరబడి పాతుకుపోయిన అధికారులను బదిలీ చేయాలని ఆదేశించారు. అయినా ఆ తర్వాత కూడా వరుస వేట్లు, వెంటిలేటర్ల టెండర్‌పై ఆరోపణలు రావడం సంస్కరణలు ఆచరణలోకి రాలేదనడానికి నిదర్శనం.

సంస్థ వెబ్‌సైట్‌లో టెండర్ల పేజీ ఖాళీగా దర్శనమిస్తుండటం పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. విజిలెన్స్ నివేదికను వెంటనే బయటపెట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, గత కొంతకాలంగా జరిగిన టెండర్లన్నింటిపై లోతైన విచారణ జరపాలని సరఫరాదారులు, వైద్య వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

Total Visitors: 3,451,108