25 పార్కులు.. 25 రంగాలు.. లక్షల ఉద్యోగాల లక్ష్యం

కామధేనువును తెచ్చినా “గడ్డి ఎక్కడ, నీరు ఎక్కడ?” అని అడిగే రోజులివి. “అది మా ప్రాంతంలో పేడ వేయదు కదా” అనే ప్రశ్నలూ వినిపిస్తాయి. ప్రతి గొప్ప ప్రయత్నానికీ ప్రశ్నలు పుడతాయి, అది సహజం. అందుకే లెక్కలతో, గుండె నిండా నమ్మకంతో సమాధానం చెబుదాం.
ఒక్క క్షణం ఆలోచించండి.
బస్టాండ్‌లో అమ్మ కళ్లలో నీళ్లు. చేతిలో డబ్బా, భుజంపై బ్యాగ్. “జాగ్రత్తగా ఉండరా, పండక్కి వచ్చేయి” అనే మాట. ఎన్నో తరాల ఆంధ్ర కుటుంబాల కథ ఇదే.
ఒక్క కామధేనువు కాదు, ఇరవై ఐదు!
ఇప్పుడు ఆ దృశ్యాన్ని మార్చే ప్లాన్ ఒకటి మన ముందుకు వచ్చింది. 25 పార్కులు. 25 రంగాలు. లక్షల ఉద్యోగాల లక్ష్యం.
ఇతర రాష్ట్రాలు ఇలా చేస్తున్నాయా?
కొన్ని చేస్తున్నాయి, ఇది దేశమంతా నడుస్తున్న దారి. కానీ ఒకే ప్యాకేజీలో 25 పార్కులు, ప్రతి పార్కుకు ఒక్కో రంగం, క్వాంటం, స్పేస్, ఏఐ డేటా సెంటర్ లాంటి భవిష్యత్తు రంగాలతో ఉన్న ప్లాన్ నాకు తెలిసినంత వరకు ఎక్కడా కనిపించలేదు.
దశాబ్దాలుగా కృషి చేస్తున్న తమిళనాడు ఈ మార్గం పనిచేస్తుందని నిరూపించింది. సిప్కాట్ 54 పార్కులతో, సుమారు 50,060 ఎకరాల్లో విస్తరించి, 3,596 యూనిట్లు, రూ.2.47 లక్షల కోట్ల పెట్టుబడి, 9.6 లక్షల ఉద్యోగాలు తెచ్చింది.
ఉత్తరప్రదేశ్ కూడా కదులుతోంది. 350 ఎకరాల మెడికల్ డివైస్ పార్క్ (రూ.5,250 కోట్లు, 20,000కు పైగా ఉద్యోగాలు), బొమ్మల పార్క్, ఫిల్మ్ సిటీ, లెదర్ పార్క్ ప్లాన్ చేసింది.
మరి ఏపీ?
ఆ దారిలో 25 రంగాల విస్తృతితో పరుగెత్తడానికి సిద్ధమవుతోంది!
లెక్కలు వింటే గూస్బంప్స్!
బ్రోషర్లోని పార్కుల వారీ లక్ష్యాలన్నీ కలిపితే:
భూమి: సుమారు 24,900 ఎకరాలు
పెట్టుబడి: సుమారు రూ.3.93 లక్షల కోట్లు
ఉద్యోగాలు: సుమారు 4.48 లక్షలు
ఎంఓయూలు: 613, విలువ రూ.13.25 లక్షల కోట్లు (ఇది పెట్టుబడి ఉద్దేశాల లెక్క, పార్కుల లెక్కకు వేరు)
భవిష్యత్తు ఇక్కడే మొదలవుతుంది.
ఏఐ డేటా సెంటర్ పార్క్: రూ.2.15 లక్షల కోట్లు, మొత్తం పెట్టుబడిలో 55% వాటా. ఇది సాకారమైతే ప్రపంచం ఏఐ గురించి మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరు కూడా వినిపిస్తుంది. ఇది కేవలం ఒక పార్క్ కాదు, డీప్ టెక్ యుగంలోకి మన రాష్ట్రం వేసే తొలి అడుగు.
ఎకరా నేలలో వందలాది కలలు.
ఎకరాకు ఉద్యోగాలు, రాష్ట్ర భవిష్యత్ ఆదాయం చూడండి:
ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లో 125 మంది
స్పోర్ట్స్ పార్క్‌లో 100 మంది
కొరియన్ పార్క్‌లో 93 మంది
ఒక్క ఎకరా నేల వందమంది యువత భవిష్యత్తుకు వేదిక అవుతుందంటే ఎంత గొప్పగా ఉంది!
బొమ్మల పార్క్‌లో 65% ఉద్యోగాలు మహిళలకే అని చెప్పారు. టెక్స్టైల్, ఎలక్ట్రానిక్స్, స్పోర్ట్స్ పార్కుల్లో కూడా అమ్మాయిలకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని బ్రోషర్ చెబుతోంది. ఇంటి దగ్గరే సొంత సంపాదనతో నిలబడే ఆడపిల్లల తరం, ఊహించుకుంటేనే గర్వంగా ఉంది కదా!
ఆలోచన వెనుక దూరదృష్టి
ఈ ప్లాన్ ఉద్యోగాల గురించే కాదు. రాష్ట్ర సంక్షేమానికి భవిష్యత్తులో కావాల్సిన ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందన్న ఆలోచన కూడా ఇందులో కనిపిస్తుంది. 2047 నాటికి రాష్ట్రం ఎలా ఉండాలో ఒక లక్ష్యం పెట్టుకుని చేస్తున్న కృషి ఈ ప్లానింగ్ వెనుక ఉంది. పరిశ్రమలు వస్తే ఆదాయం, ఆదాయం వస్తే సంక్షేమం, సంక్షేమం వస్తే ప్రతి కుటుంబంలో వెలుగు.
ప్రతి ప్రాంతానికి ఒక్కో కిరీటం
ఉత్తరాంధ్ర: ఫార్మా, స్టీల్, ఏఐ డేటా సెంటర్, అరుదైన ఖనిజాలు
గోదావరి, కోస్తా ఆంధ్ర: ఆయిల్ అండ్ గ్యాస్, క్వాంటం, టెక్స్టైల్, రాజధాని
రాయలసీమ: డ్రోన్ సిటీ, రోబోటిక్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, హార్టికల్చర్ హబ్
సెమీకండక్టర్, స్పేస్ సిటీ, కొరియన్ పార్క్, ఫర్నిచర్, స్పోర్ట్స్ ఇలా అక్కడి వనరులకు తగ్గట్లుగా చేసిన ఆలోచన కనిపిస్తోంది. కర్నూలు ఆకాశంలో డ్రోన్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో రోబోలు, తిరుపతి దగ్గర రాకెట్లు, అనకాపల్లిలో ఏఐ సర్వర్లు. ఇవన్నీ మన నేలపైనే!
జెన్ జీ, ఇది మీ కథ
ఏపీలో మూడింట రెండొంతుల మంది పని చేయగల వయసులో ఉన్నారు. ఇది రాష్ట్రానికి అతి పెద్ద బలం, ఆ బలం మీరే.
ఇప్పుడే మొదలుపెట్టండి
సీఎన్సీ, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఆటోమేషన్
ఏఐ , రోబోటిక్స్, డ్రోన్ పైలట్
క్వాలిటీ కంట్రోల్, వెల్డింగ్, ఎలక్ట్రానిక్స్ అసెంబ్లీ
ఇంటర్న్‌షిప్‌ల కోసం వెతకనక్కర్లేదు
హారిజాంటల్, వర్టికల్ ఎకోసిస్టమ్‌లో… వాటికి తగ్గట్లుగా కాలేజీ నుండే బయటి వరకు స్కిల్స్ నేర్పించడానికి ప్రభుత్వం, ఆయా పరిశ్రమలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకోండి.
ఈ పార్కులు తలుపు తెరిచే రోజున, మనం స్కిల్స్‌తో సిద్ధంగా ముందు వరుసలో ఉందాం.
ఆ రోజు వస్తుంది.
ఊహించండి. సంక్రాంతి పండగ. ఊరి కూడలిలో ఈసారి మీరు బస్సు దిగి వెళ్లిపోవడానికి కాదు. మీ షిఫ్ట్ ముగించుకుని, సాయంత్రం ఇంటికి నడిచి వస్తున్నారు. ప్రపంచ స్థాయి పరిశ్రమలో పనిచేస్తూ, మీ ఊరి గాలి పీలుస్తూ.
ఉద్యోగం కోసం ఊరు వదిలి వెళ్లే తరం నుంచి, ఊరిలోనే ప్రపంచాన్ని నిర్మించే తరంగా మారే అవకాశం ఇప్పుడు మన ముందుంది.
ప్రయాణం మొదలైంది. ఈసారి ఏ గంజాయి బ్యాచ్ కూడా ఆపలేదు. డ్రోన్లతో, ఫేస్ రికగ్నిషన్‌తో రప్పా రప్పా బ్యాచ్‌లను ఏరి కౌన్సిలింగ్ చేసి మరీ మారుద్దాం.
“చూజ్ స్పీడ్. చూజ్ ఏపీ!” అనే పిలుపు ఇన్వెస్టర్లకు. ఎవడో క్రిమినల్ విధ్వంసం కోసం వస్తే పిరికితనంతో భయపడకుండా… “సీ ఏపీ, లివ్ ఇన్ ఏపీ, డోంట్ లీవ్ అవర్ ఏపీ” అనేది మనకు మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్.
