November 16, 2026

పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రభుత్వ మెడలు వంచి గెలిచారు

  • సీఎం రేవంత్ నిరంకుశత్వం ఓడింది
  • జీవో 97 ద్వారా జరిగిన పోలీసు దాష్టీకాలపై ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి
  • విద్యార్థులు, అధ్యాపకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించాలి
  • విద్యా వ్యవస్థపై అవగాహన ఉన్న పూర్తికాల విద్యాశాఖ మంత్రిని నియమించాలి
  • తెలంగాణకు కావాల్సింది ప్రజాస్వామ్య విలువలున్న విద్యాశాఖ మంత్రి
  • బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ డిమాండ్

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో ఎంఎస్ నెం. 157 (తేదీ 13.11.2026), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెచ్చిన జీవో 97 మొదటి రోజు నుంచే తప్పు అని లిఖితపూర్వకంగా ఒప్పుకున్నట్లేనని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ జీవోను వ్యతిరేకించినందుకు లాఠీదెబ్బలు తిన్న పాలిటెక్నిక్ విద్యార్థులే సరైనవారని నేడు నిరూపితమైందని ఆయన తెలిపారు.

“ఇది ప్రభుత్వం దయ కాదు, విద్యార్థుల విజయం. ప్రభుత్వం మనస్ఫూర్తిగా వినలేదు; వినక తప్పని పరిస్థితి వచ్చింది” అని డా. శ్రవణ్ స్పష్టం చేశారు. సుదీర్ఘంగా పోరాటం చేసిన పాలిటెక్నిక్ విద్యార్థులు, అధ్యాపకులు, తెలంగాణ పాలిటెక్నిక్ జేఏసీ, బీఆర్‌ఎస్‌వీ సహా విద్యార్థి సంఘాలకు ఆయన వందనాలు తెలిపారు.

97 జారీ అయినది 16.06.2026న కాగా, ప్రభుత్వం వెనక్కి తగ్గింది 13.11.2026న. ఈ 150 రోజులూ ఈసెట్ (ECET) లేటరల్ ఎంట్రీ, ఎస్‌బీటీఈటీ (SBTET) సర్టిఫికేషన్, ఫీజులు, స్కాలర్‌షిప్పులపై లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు భయంతో గడిపారు. హైదరాబాద్ నుంచి మహబూబాబాద్, నల్గొండ, మణుగూరు దాకా కాలేజీ ప్రాంగణాల్లో ఆందోళనలు, నిరాహార దీక్షలు, లాఠీచార్జీలు, అరెస్టులు జరిగితేగానీ మొదటి రోజే విద్యార్థులకు తెలిసిన నిజాన్ని ప్రభుత్వం ఒప్పుకోలేదని డా. శ్రవణ్ విమర్శించారు.

ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి తప్పించుకోలేరని పేర్కొంటూ, జీవో 97లోని మూడవ రిఫరెన్స్ ముఖ్యమంత్రి కార్యాలయం నోట్ నెం. 58/PSCM/2026 (తేదీ 05.06.2026) అని, ఆ నోట్ వచ్చిన కేవలం పదకొండు రోజుల్లోనే జీవో వెలువడిందని గుర్తుచేశారు. “జాగ్రత్తగా పరిశీలించి” అని పేర్కొన్న జీవో 97లో చూపించిన కారణం కేవలం “పరిపాలనా అవసరాలు” మాత్రమేనని, నిపుణుల కమిటీ, ఏఐసీటీఈ (AICTE), ఎస్‌బీటీఈటీ, అధ్యాపకులు, విద్యార్థులు ఎవరినీ సంప్రదించలేదని మండిపడ్డారు.

వైఎస్యూ చట్టం 2024, తెలంగాణ విద్యా చట్టం 1982లను తర్వాత సవరించాలని జీవో 97 పేరా 4లోనే రాశారని, ఇది చట్ట పాలన కాదు, జీవోల పాలన అని వ్యాఖ్యానించారు. విద్యాశాఖను రేవంత్ రెడ్డి తన వద్దే ఉంచుకున్నారు కాబట్టి నిందించడానికి మంత్రి లేరని, దాక్కోవడానికి కార్యదర్శి లేరని, ఆ హుకుం సీఎం దే, బాధ్యతా ఆయనదేనని తేల్చిచెప్పారు.
హైలెవెల్ కమిటీ (జీవో ఆర్టీ నెం. 1239, తేదీ 24.08.2026) జీవో 97 వచ్చిన 69 రోజుల తర్వాత, విద్యార్థులు రోడ్డెక్కిన తర్వాతే ఏర్పడిందని డా. శ్రవణ్ అన్నారు. కమిటీకి ఇచ్చిన గడువు 30 రోజులైతే, దిద్దుబాటు వచ్చింది 81 రోజుల తర్వాత అని, ప్రజాస్వామ్యంలో సంప్రదింపులు ఆదేశానికి ముందు జరగాలి కానీ, రేవంత్ రెడ్డి పాలనలో మాత్రం లాఠీల తర్వాత జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు.

విషపు క్లౌజు ఇంకా బతికే ఉంది: “అన్ని పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) ఫ్రేమ్‌వర్క్ పరిధిలోకి తీసుకురావాలి” అనే జీవో 97 క్లౌజు 1(iv)ను తొలగించాలని టీపీ-జేఏసీ ప్రత్యేకంగా డిమాండ్ చేసినా, జీవో 157లో దానిని స్పష్టంగా రద్దు చేయలేదు. ప్రైవేటు, ఎయిడెడ్ విద్యార్థులకు అన్యాయం: కేవలం “ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల”కే రక్షణ కల్పించడంతో ఎయిడెడ్, ప్రైవేటు పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు గాలిలో దీపంలా మారింది.
కీలక అంశాలపై మౌనం: ఎస్‌బీటీఈటీ, టీజీ ఈసెట్ లేటరల్ ఎంట్రీ, ఫీజులు, స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్, పాలిటెక్నిక్ భూములు, ఆస్తుల రక్షణపై ఒక్క మాట కూడా లేదు. ఐటీఐ, ఏటీసీ విద్యార్థులను వదిలేశారు: క్లౌజు 2(iii) ప్రకారం వారు శక్తి శాఖ కిందే ఉంటారు, వారి సిలబస్‌ను వైఎస్యూ నియంత్రిస్తుంది. గొంతు లేనివారిపైకి ప్రయోగాన్ని మళ్లించారు.

అనుమతులపై స్వయంగా ఒప్పుకోలు: తన కోర్సుల విస్తరణకు ఏఐసీటీఈ సహా సంబంధిత సంస్థల అనుమతులు పొందాలని క్లౌజు 2(iv) వైఎస్యూకు ఆదేశిస్తోంది. ఆ అనుమతులే ఇంకా పొందని విశ్వవిద్యాలయానికి జూన్‌లో ఏఐసీటీఈ ఆమోదిత డిప్లొమా కోర్సులను అప్పగించాలనుకోవడం ఆలోచనా రాహిత్యానికి ప్రభుత్వమే ఇచ్చిన సాక్ష్యం.

న్యాయం అడిగిన విద్యార్థులపై లాఠీలు: 10.09.2026న రామంతాపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేశారని, పలువురు గాయపడ్డారని, కాలేజీ గేట్లు మూసివేశారని డా. శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టులో అబ్దుల్లాపూర్‌మెట్‌లో లాఠీచార్జి, బూతులు, కాలికి తగిలిన గాయం గురించి ఒక పాలిటెక్నిక్ విద్యార్థి కెమెరా ముందు కన్నీరు పెట్టుకున్నాడని, నిరాహార దీక్షలో ఉన్న విద్యార్థులను కలవడానికి వెళ్లిన నాయకులను గృహ నిర్బంధం చేశారని గుర్తుచేశారు. జీవో 157 ఈరోజు సరైనదైతే, జీవో 97 నిన్న తప్పేనని, జీవో 97 తప్పైతే దానిని కాపాడడానికి లేచిన ప్రతి లాఠీ తప్పేనని, పెట్టిన ప్రతి కేసూ అన్యాయమేనని స్పష్టం చేశారు.

కేబీఆర్ పార్క్: అదే పద్ధతి, అదే అభాసు: 2024లో సుమారు ₹826 కోట్లతో మంజూరైన కేబీఆర్ పార్క్ చుట్టూ ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాస్‌ల అంచనా ఒక్క నిర్మాణం కూడా నిలబడకుండానే ₹1,090 కోట్లకు ఎగబాకిందని తెలిపారు. ప్రజలు, పర్యావరణవేత్తల నిరసనలను పట్టించుకోకుండా చెట్లు నరికి, గుంతలు తవ్విన తర్వాత అక్టోబర్ 3-4 తేదీల్లో జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ మొత్తం ప్లాన్‌ను రద్దు చేసి, కేఎన్‌ఆర్, మేఘా సంస్థలతో కాంట్రాక్టుల రద్దుకు ఆమోదం తెలిపిందన్నారు. ₹400 కోట్ల “ఆదా” అంటూ జీహెచ్‌ఎంసీ ప్రచారం చేసుకుంటోందని, కానీ వదిలేసిన పనులపై ఇప్పటికే ఎంత ప్రజాధనం ఖర్చయిందో చెప్పడం లేదని—ఆవేశంతో నిర్ణయం, బలవంతంగా అమలు, అభాసుతో వెనక్కి, బిల్లు మాత్రం ప్రజలకని విమర్శించారు.

55 ఏళ్ల వ్యవస్థకు ఒక సమీక్షా సమావేశంలో సమాధి కడుతున్నారని మండిపడుతూ, జీవో 157కి రెండు రోజుల ముందు 11.11.2026న వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రత్యేక ఇంటర్మీడియట్ వ్యవస్థను రద్దు చేసి, 11, 12 తరగతులను పాఠశాలల్లో కలపాలని సీఎం అధికారులకు ఆదేశించారని పేర్కొన్నారు. బిల్లు లేదు, చర్చ లేదు, కేవలం ఒక సమీక్షా సమావేశం మాత్రమేనని; మే 2026లో ఇదే సీఎం ఈ విలీనాన్ని వాయిదా వేసి, సంప్రదింపులు, శాసనసభలో చర్చ తర్వాతే నిర్ణయం అని చెప్పి ఆరు నెలల్లోనే మాట తప్పారని విమర్శించారు.

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా చట్టం 1971ని ఆర్డినెన్స్ ద్వారా సవరించే యోచన ఉందని వార్తలు సూచిస్తున్నాయని, మళ్లీ ముందు ఆదేశం, తర్వాత చట్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, వాటి లెక్చరర్లు, భవనాల గతి ఏమిటని, వచ్చే జూన్ నాటికి 11, 12 తరగతులు నడపడానికి ఎన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ల్యాబ్‌లు, సబ్జెక్ట్ ఉపాధ్యాయులు, స్థలం ఉన్నాయని ప్రశ్నించారు. తెలంగాణ విద్యా కమిషన్ నివేదికను శాసనసభ ముందు ఎందుకు ఉంచలేదని, తెలంగాణ మరో జీవో 97ని భరించలేదని, ఈసారి బలయ్యేది లక్షలాది ఇంటర్మీడియట్ విద్యార్థులని హెచ్చరించారు.

ఈ ప్రభుత్వం తీసుకున్న ప్రతి పెద్ద విద్యా నిర్ణయం సీఎంవో నోట్‌లోనో, సమీక్షా సమావేశంలోనో పుట్టిందని, అధ్యయనం లేకుండానే ప్రకటించారు, పోలీసులతో సమర్థించుకున్నారు, నిలదీస్తే వెనక్కి తగ్గారని డా. శ్రవణ్ అన్నారు. తరగతి గదులు ఆక్రమణలు కావని, విద్యను కూల్చివేతల డ్రైవ్‌లా నడపలేరని పేర్కొన్నారు.

Total Visitors: 3,451,193