November 18, 2026

“మేఘా” ఇంజినీరింగ్‌ విలువ రూ.లక్ష కోట్లు!

  • అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి 700 మిలియన్‌ డాలర్ల నిధుల సమీకరణ
  • డీకే, హెచ్‌హెచ్‌, వర్డే పార్ట్‌నర్స్‌ భాగస్వామ్యం.. ఈపీటీఎల్‌ విలువ రూ.14 వేల కోట్లు

హైదరాబాద్‌: దేశీయ మౌలిక సదుపాయాల రంగంలో కీలక సంస్థగా ఎదిగిన మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) గ్రూప్‌ విలువ సుమారు రూ.లక్ష కోట్లకు చేరింది. అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన మూడు పెట్టుబడి సంస్థలు డీకే, హెచ్‌హెచ్‌, వర్డే పార్ట్‌నర్స్‌ (Värde Partners) సంస్థాగత పెట్టుబడి లావాదేవీలో భాగస్వాములయ్యాయి.
ఈ ఒప్పందం ద్వారా సుమారు 700 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.5,800 కోట్ల) నిధుల సమీకరణకు మార్గం సుగమమైంది. గ్రూపునకు చెందిన రహదారి ప్రాజెక్టుల ఆస్తుల నగదీకరణ ప్రతిపాదనతో పాటు నిర్మాణాత్మక ఈక్విటీ పెట్టుబడుల విధానంలో ఈ లావాదేవీ జరిగినట్లు అభివృద్ధితో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి.

అంతర్జాతీయ సంస్థల విశ్వాసం

భారత్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రానున్న దశాబ్దంలో భారీ అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ పెట్టుబడిదారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విస్తృతమైన వ్యాపార కార్యకలాపాలు, భారీ ప్రాజెక్టులను నిర్ణీత ప్రమాణాలతో పూర్తి చేయగల సామర్థ్యం ఉన్న ఎంఈఐఎల్‌ గ్రూప్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. నీటిపారుదల, రవాణా, ఇంధనం, చమురు-వాయువు, తయారీ, విద్యుత్‌ వాహనాలు వంటి విభిన్న రంగాల్లో గ్రూపు కార్యకలాపాలు పెట్టుబడిదారుల విశ్వాసానికి కారణమయ్యాయి.

ఈపీటీఎల్‌ విలువ రూ.14 వేల కోట్లు

ఎంఈఐఎల్‌ ప్రధాన సంస్థ విలువను సుమారు రూ.లక్ష కోట్లుగా అంచనా వేయగా.. గ్రూపునకు చెందిన ఇంధన పరివర్తన వ్యాపార సంస్థ ఈపీటీఎల్‌ (EPTL) విలువను ప్రస్తుత దశలో సుమారు రూ.14 వేల కోట్లుగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ అంచనాలు సంస్థల కార్యకలాపాల విస్తృతి, భవిష్యత్తులో పునరుత్పాదక ఇంధనం, విద్యుత్‌ నిల్వ, ఇతర ఇంధన రంగాల్లో ఉన్న అవకాశాలను ప్రతిబింబిస్తున్నాయి.

‘‘భారత్‌ దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక ప్రగతిలో భాగస్వాములయ్యే అవకాశంగా అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఎంఈఐఎల్‌ గ్రూపును చూస్తున్నారు. సంస్థ దార్శనికత, విభిన్న వ్యాపార విభాగాలు, నిరూపితమైన ప్రాజెక్టుల అమలు సామర్థ్యంపై వారికి విశ్వాసం ఉంది’’ అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.

మూడు దశాబ్దాల ప్రస్థానం.. 20కి పైగా దేశాల్లో ప్రాజెక్టులు

గత మూడు దశాబ్దాలుగా ఎంఈఐఎల్‌ దేశీయ మౌలిక సదుపాయాల రంగంలో తన కార్యకలాపాలను విస్తరించుకుంటూ వచ్చింది. ప్రస్తుతం 20కి పైగా దేశాల్లో ప్రాజెక్టులను చేపడుతోంది. నీటిపారుదల, రహదారులు, రవాణా, విద్యుత్‌, చమురు-వాయువు, పారిశ్రామిక తయారీ, స్వచ్ఛ ఇంధనం వంటి రంగాల్లో సంస్థకు వ్యాపార కార్యకలాపాలున్నాయి.

దేశంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జోజిలా సొరంగ మార్గం, ముంబయి కోస్టల్‌ రోడ్‌, థానే-బోరివలి జంట సొరంగ మార్గం, పోలవరం ప్రాజెక్టు, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వంటి భారీ ప్రాజెక్టుల్లో సంస్థ భాగస్వామిగా ఉంది. గ్రూపునకు చెందిన రహదారి ప్రాజెక్టుల విస్తీర్ణం సుమారు 1,975 కిలోమీటర్లు.

ఇంధన రంగంలో భారీ విస్తరణ

ఇంధన రంగంలోనూ ఎంఈఐఎల్‌ తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. హైడ్రోకార్బన్లు, విద్యుదుత్పత్తి, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్‌ నిల్వ ప్రాజెక్టుల్లో సంస్థకు అనుభవం ఉంది. మొత్తం 9,110 మెగావాట్లకు పైగా సామర్థ్యంతో పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుత్‌ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. మరోవైపు సుమారు 3,000 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్‌ ప్రాజెక్టులను అమలు చేస్తోంది.

దేశ అణుశక్తి కార్యక్రమంలోనూ సంస్థ అడుగుపెట్టింది. కర్ణాటకలోని కైగా వద్ద 700 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు అణు విద్యుత్‌ రియాక్టర్ల నిర్మాణంలో భాగస్వామ్యమైంది. అంతర్జాతీయంగా మంగోలియాలో నిర్మిస్తున్న తొలి గ్రీన్‌ఫీల్డ్‌ చమురు శుద్ధి కర్మాగారంలోనూ కీలక ప్యాకేజీలను చేపట్టింది.

విద్యుత్‌ వాహనాల నుంచి గ్యాస్‌ పంపిణీ వరకు

సాంప్రదాయ మౌలిక సదుపాయాలతో పాటు నూతన రంగాల్లోనూ గ్రూపు వ్యాపారాలను విస్తరిస్తోంది. ఒలెక్ట్రా, ఈవీ ట్రాన్స్‌ సంస్థలు విద్యుత్‌ బస్సులు, ప్రజా రవాణా రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. డ్రిల్‌మెక్‌ సంస్థ డ్రిల్లింగ్‌ సాంకేతికత, ఐకామ్‌ తయారీ, టెలికమ్యూనికేషన్లు, వ్యూహాత్మక మౌలిక సదుపాయాల రంగాల్లో సేవలందిస్తున్నాయి. మేఘా గ్యాస్‌ పలు రాష్ట్రాల్లో నగర గ్యాస్‌ పంపిణీ నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది.

వైద్య ఆరోగ్య సేవలు, నైపుణ్యాభివృద్ధి, సామాజిక అభివృద్ధి కార్యక్రమాల్లోనూ గ్రూపు తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది.
భారత మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులకు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఎంఈఐఎల్‌కు లభించిన ఈ పెట్టుబడులు, సంస్థకు లభించిన రూ.లక్ష కోట్ల విలువ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Total Visitors: 3,472,860