November 18, 2026

మనం కష్టపడకపోతే రేపు హైదరాబాదూ పోతుంది

  • సత్తా చాటుకునే సమయం వచ్చింది
  • సమరోత్సాహంతో పనిచేయండి
  • ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచితీరాల్సిందే
  • జనంలోకి వెళ్లి పనిచేయండి
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు పిలుపు

హైదరాబాద్‌: మనం కష్టపడకపోతే రేపు హైదరాబాద్ మనది కాకుండా పోతుందని, హైదరాబాద్ మేయర్ పీఠంతో పాటు తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావాలనే సంకల్పంతో పార్టీ ముందుకు సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ పార్టీ డబ్బుతో, మాయమాటలతో, ప్రలోభాలతో కుమ్మక్కై బీజేపీ గెలవాల్సిన సీట్లను దక్కించుకుందని, ఇప్పుడు మన సత్తా చాటాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 20 శాతం కమిషన్లకు పాల్పడితే, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం 30 నుండి 40 శాతం కమిషన్ల ప్రభుత్వంగా మారిందని తీవ్రంగా విమర్శించారు. ప్రజలను మోసం చేయడం, దగా చేయడమే ఈ రెండు పార్టీల నైజమని మండిపడ్డారు.

బర్కత్‌పురా బీజేపీ సిటీ ఆఫీసులో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి ఆశిష్ షెలార్, రాష్ట్ర బీజేపీ సహ ఇన్‌చార్జి అభయ్ పాటిల్, రాజ్యసభ సభ్యులు డా.కె.లక్ష్మణ్ పాల్గొన్నారు.

భేటీకి 300 మంది డివిజన్ అధ్యక్షులు, 9 మంది జిల్లా బీజేపీ అధ్యక్షులు, జిల్లా ఇన్‌చార్జిలు, జిల్లా పదాధికారులు హాజరయ్యారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడం, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, తెలంగాణలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన భవిష్యత్ ప్రణాళికలపై ఈ సమావేశంలో నేతలు వివరంగా చర్చించారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో, గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలకు తీవ్ర అన్యాయం చేశాయని రాంచందర్ రావు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కృష్ణా జలాల వాటాలో తెలంగాణకు 512 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 299 టీఎంసీల నీరు మాత్రమే సరిపోతుందని సంతకం చేసి తెలంగాణకు తీరని ద్రోహం చేసిందని గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయిందని, ప్రజలంతా బీజేపీ వైపే ఆశగా చూస్తున్నారని పేర్కొన్నారు.

రానున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల (మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ) ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి అనే మూడు కార్పొరేషన్లుగా విభజించిందని, రానున్న ఎన్నికల్లో ఈ మూడు కార్పొరేషన్లలోనూ బీజేపీ మేయర్ పీఠాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా డివిజన్ ఇన్‌చార్జిలు, కార్యకర్తలు క్రమశిక్షణతో పనిచేయాలని ఆదేశించారు.

హైదరాబాద్ ప్రజలు బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని, అయితే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటరు నమోదు ప్రక్రియపై దృష్టి సారించాలని సూచించారు. ఎన్నికల సమయం ఆసన్నమైందని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, భవిష్యత్ ప్రయాణానికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నామని తెలిపారు. ఈ రోడ్ మ్యాప్‌లో భాగంగా విస్తృత స్థాయిలో ఉద్యమాలు, పోరాటలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు.

ఇటీవల హైదరాబాద్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్వహించిన మహా పాదయాత్ర దిగ్విజయమైందని, ఈ యాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలపడం దేశవ్యాప్తంగా ప్రధాన చర్చకు దారితీసిందని రాంచందర్ రావు గారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు స్వయంగా అమిత్ షా గారే అభినందనలు తెలిపారని పేర్కొంటూ, ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఆయన శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.

ఇదే స్ఫూర్తితో క్షేత్రస్థాయిలో పనిచేసి రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఏర్పడేది కచ్చితంగా బీజేపీ ప్రభుత్వమేనని రాంచందర్ రావు పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.

Total Visitors: 3,472,738