రేవంత్.. ఇది మీ సొంత పార్టీ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మీపై వేసిన ఛార్జ్‌షీట్

- ₹5 లక్షల సిమెంట్ రోడ్డు బిల్లులో 20% కమీషన్లు పోగా, ప్రజలకు దక్కే పని విలువ కేవలం ₹2.5 లక్షలేనా?
- కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన ‘గుడ్ గవర్నెన్స్’ అంటే ఇదేనా?
- ప్రజాపాలన పేరుతో ‘పర్సెంటేజీల పాలన’ సాగిస్తున్నారు
- హోం శాఖ, ఏసీబీ ముఖ్యమంత్రి చేతిలోనే ఉన్నా ఈ అవినీతి ఆరోపణలపై ఎందుకు మౌనం వహిస్తున్నారు?
- సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ సూటి ప్రశ్న
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అవినీతి, కమీషన్ల దందా పెరిగిపోయిందని సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేనే బట్టబయలు చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ శాసనసభ్యుడు జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డా. శ్రవణ్ డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రజలు, మీడియా ప్రతినిధులు, నెటిజన్లను ఉద్దేశించి విడుదల చేసిన వీడియో సందేశంలో డా. శ్రవణ్ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించారు.
సొంత ప్రభుత్వంలోని అవినీతిపై యువ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ధైర్యంగా మాట్లాడారని డా. శ్రవణ్ అభినందించారు. ఈ వ్యాఖ్యల తీవ్రతను వివరిస్తూ ఆయన ఇలా అన్నారు.
“మిస్టర్ రేవంత్ రెడ్డి గారూ… ఇది బీఆర్ఎస్ పార్టీనో, మరే ఇతర ప్రతిపక్ష పార్టీనో మీపై వేసిన ఛార్జ్‌షీట్ కాదు. మీ పార్టీ తరఫున గెలిచిన మీ సొంత ఎమ్మెల్యేనే మీ అవినీతి పాలనపై రిలీజ్ చేసిన ఛార్జ్‌షీట్ ఇది. రాష్ట్రంలో కాంట్రాక్టర్లు పారిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందో, అభివృద్ధి పనులు ఎందుకు ఆగిపోయాయో ఆయన ఆవేదనతో బయటపెట్టారు” అని డా. శ్రవణ్ పేర్కొన్నారు.
కమీషన్ల లెక్క: 50 శాతం ప్రజాధనం వృథా
ఒక సాధారణ ₹5 లక్షల సిమెంట్ రోడ్డు బిల్లు క్లియర్ కావాలంటే ఎం-బుక్ (M-Book) రికార్డింగ్ దశలోనే అధికారులు 10% నుండి 20% వరకు లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చెప్పిన అంశాన్ని డా. శ్రవణ్ విశ్లేషించారు.
20% కమీషన్: అధికారులు, మధ్యవర్తుల వద్దకు వెళ్తున్న వాటా.
30% మార్జిన్: కాంట్రాక్టర్ మనుగడ, లాభం కోసం చూసుకునే వాటా.
ఫలితం: ₹5 లక్షల ప్రజాధనంలో అసలైన నిర్మాణ పని కోసం ఖర్చయ్యేది కేవలం 50% (₹2.5 లక్షలు) మాత్రమేనని, మిగతా సొమ్మంతా కమీషన్ల రూపంలో పోతోందని డా. శ్రవణ్ ఆరోపించారు.
మేనిఫెస్టో హామీలు ఏమయ్యాయి? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మొదటి అంశంగా పొందుపరిచిన ‘సుపరిపాలన ‘, జాతీయ స్థాయి ‘న్యాయపత్ర’లో ఇచ్చిన అవినీతి రహిత పాలన హామీలను గుర్తుచేశారు.
గతంలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో ‘ఆర్ఆర్ ట్యాక్స్’ వసూలు చేస్తున్నారని ఆరోపిస్తే ఏమో అనుకున్నాం. ఇప్పుడు మీ సొంత ఎమ్మెల్యేనే 20% కమీషన్ దందా గురించి మాట్లాడారు. ఇది ప్రజాపాలన కాదు.పర్సెంటేజీల పాలన” అని విమర్శించారు. ఈ విధంగా వసూలవుతున్న సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్తోందో, ఏ రాష్ట్ర ఎన్నికలకు తరలిస్తున్నారో ముఖ్యమంత్రి స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, పారిశ్రామికవేత్తలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ దోపిడీ వైఖరి వల్ల తెలంగాణకు రావాల్సిన కొత్త పెట్టుబడులు ఆగిపోతున్నాయని డా. శ్రవణ్ ఆందోళన వ్యక్తం చేశారు. “రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటేనే పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు. కంపెనీలు రాకపోవడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కూడా దూరమవుతున్నాయి” అని ఆయన అన్నారు.
హోం శాఖతో పాటు అవినీతి నిరోధక శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిధిలోనే ఉన్నప్పటికీ, ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు.
“ప్రజల దృష్టిని మళ్లించే రాజకీయాలు మానుకుని, ముఖ్యమంత్రిగా మీకు పరిపాలనాపరమైన బాధ్యత ఉంటే వెంటనే మీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై స్పందించి విచారణకు ఆదేశించాలి. ఈ కమీషన్ల పాలనకు ముగింపు పలకాలి” అని తెలంగాణ ప్రజల పక్షాన డా. దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.
