రాజస్థాన్ రైల్వే పట్టాలపై పేలుడు వెనుక పాకిస్థాన్ కుట్ర

- ప్రయాణికుల రైలునే పేల్చేయాలన్న దుర్మార్గపు పన్నాగం
భారతదేశంలో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ మరోసారి తన పాత కుట్రలకు తెరతీసిందా? రాజస్థాన్‌లో వెలుగుచూసిన రైల్వే పేలుడు ఘటన ఇప్పుడు దేశ భద్రతా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లా రామ్సింగ్పూర్ పరిధిలో, 50 జీబీ గ్రామం సమీపంలో నవంబర్ 3వ తేదీ రాత్రి సుమారు 9:45 గంటల సమయంలో అనూప్‌గఢ్–సూరత్‌గఢ్ రైల్వే మార్గంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి రైల్వే పట్టాల కింద ఉన్న రెండు సిమెంట్ స్లీపర్లు దెబ్బతిన్నాయి. పట్టాలకు నష్టం వాటిల్లింది. సుమారు రెండున్నర అడుగుల లోతైన గుంత ఏర్పడింది.
అయితే అసలు భయంకరమైన విషయం ఏమిటంటే.. ఆ మార్గంలో ప్రయాణికుల రైలు పేలుడు జరగడానికి సుమారు 75 నిమిషాల ముందే వెళ్లిపోయింది. అంటే ఆ పేలుడు కాస్త ముందుగా జరిగి ఉంటే ఎంతటి ఘోర ప్రమాదం జరిగేదో ఊహించుకోవడానికే భయమేస్తుంది!
అసలు ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరు?
రాజస్థాన్ ఏటీఎస్, శ్రీగంగానగర్ పోలీసులు, పంజాబ్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు.
వారి వివరాలు: మహాక్దీప్ కౌర్ (21) • దవీందర్ సింగ్ (22). వీరిద్దరూ పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందినవారు.
వీరికి సహకరించారనే అనుమానంతో మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు నిందితులకు ఆశ్రయం కల్పించగా, మరొకరు మోటార్‌సైకిల్ ఏర్పాటు చేసినట్లు, ఇంకొకరు పేలుడు జరగాల్సిన ప్రాంతానికి తీసుకెళ్లి రైల్వే ట్రాక్‌ను చూపించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు వార్తా కథనాలు చెబుతున్నాయి.
పాకిస్థాన్ నుంచి ఆదేశాలు.. ‘షా’ అనే హ్యాండ్లర్!
ఈ కేసులో అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం పాకిస్థాన్ సంబంధాలు.
పాకిస్థాన్‌కు చెందిన ‘షా’ అనే హ్యాండ్లర్ ఆదేశాల మేరకు ఈ పేలుడు కుట్రకు ప్రణాళిక రూపొందించినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. మరికొన్ని కథనాల్లో ‘చాచా’ అనే మరో పాకిస్థాన్ హ్యాండ్లర్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది.
మహాక్దీప్ కౌర్‌ను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుని, ప్రేమ పేరుతో వలలో వేసి, డబ్బుల ఆశ చూపించి ఈ కుట్రలోకి దించినట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ ఆపరేషన్ కోసం ఆమె బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పేలుడు కోసం రూ.30 వేల మొత్తాన్ని అందించినట్లు దర్యాప్తు కథనాలు వెల్లడిస్తున్నాయి.
కుట్ర అమలు చేయడానికి ముందే పలుమార్లు రెక్కీ!
ఇది ఏదో హఠాత్తుగా చేసిన పని కాదనే అనుమానాలకు కూడా ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్టోబర్ 6న తొలిసారి రాజస్థాన్‌కు వచ్చి ప్రాంతాన్ని పరిశీలించినట్లు, అక్టోబర్ 12, 13 తేదీల్లో మరోసారి వచ్చి పేలుడు పదార్థాలను అమర్చేందుకు ప్రయత్నించినట్లు కొన్ని దర్యాప్తు కథనాలు వెల్లడించాయి.
ఆ ప్రయత్నాలు విఫలమైన తర్వాత నవంబర్ 3న మరోసారి వచ్చి రైల్వే ట్రాక్‌పై ఐఈడీ పేలుడు పదార్థాన్ని అమర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరికి పాకిస్థాన్ నుంచి డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలు, ఆయుధాలు సరఫరా అయ్యాయా? పేలుడు పదార్థాలను వేర్వేరు ప్రాంతాల్లో అందించారా? అనే కోణాల్లోనూ దర్యాప్తు సాగుతోంది.
పోలీసుల స్వాధీనంలో కీలక ఆధారాలు
నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులు: రెండు తుపాకులు. • 46 తూటాలు. • రూ.30,000 నగదు.
వీటితో పాటు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా పరిచయాలు, బ్యాంకు లావాదేవీలు, పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తులతో జరిగిన సంభాషణలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ కుట్రలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి? పాకిస్థాన్‌లో కూర్చుని ఆదేశాలు ఇస్తున్న అసలు సూత్రధారులు ఎవరు? ఈ నెట్‌వర్క్‌కు దేశంలో ఇంకెక్కడైనా సంబంధాలున్నాయా? అన్న కోణాల్లో భద్రతా సంస్థలు విచారణ జరుపుతున్నాయి.
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒక్కటే!
సరిహద్దుల్లో భారత సైన్యాన్ని ఎదుర్కోలేకపోతే, దేశంలో అమాయక ప్రజల ప్రాణాలను బలితీసుకోవాలనే కుట్రలు చేయడం పిరికిపందల చర్య కాక మరేమిటి?
రైళ్లలో ప్రయాణించే సామాన్య ప్రజలు, పిల్లలు, వృద్ధులు, కుటుంబాలు.. వీళ్లందరి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే ఇలాంటి కుట్రలు దేశ భద్రతకు తీవ్రమైన ముప్పు.
మన భద్రతా సంస్థలు అప్రమత్తంగా ఉండాలి. ఈ కుట్రలో కేవలం పట్టుబడిన వ్యక్తుల దగ్గరే దర్యాప్తు ఆగిపోకూడదు. తెరవెనుక ఉండి ఆదేశాలిస్తున్న హ్యాండ్లర్లు, నిధులు సమకూరుస్తున్న వ్యక్తులు, పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్న నెట్వర్క్.. ప్రతి ఒక్కరినీ గుర్తించి చట్టం ముందు నిలబెట్టాలి.
భారతదేశం సహనాన్ని బలహీనతగా భావిస్తే పొరపాటే! మన దేశ ప్రజల భద్రత విషయంలో రాజీ లేదు. భారతీయుల ప్రాణాలతో చెలగాటమాడే కుట్రదారులకు చట్టం తన పని తాను చేయాలి.
దేశం ముందు.. దేశ భద్రత ముందు.. మిగతావన్నీ తర్వాతే!
- రూపన్ గుడి రాఘవేంద్ర ప్రసాద్
