దివిసీమ ఉప్పెన – నా జ్ఞాపకాలు

1977 ప్రకృతి విపత్తు – సేవ, మానవత్వం, పునరావాసానికి ఒక నిదర్శనం
1977 నవంబర్ 19న దివిసీమ ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన పెను ఉప్పెన నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని అనుభవం. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రహదారులు, విద్యుత్, సమాచార వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. తాగునీరు, ఆహారం అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ప్రతి సంవత్సరం నవంబర్ 19వ తేదీ వచ్చిందంటే దివిసీమ ప్రాంత ప్రజల మనసుల్లో తెలియని భయం, ఆవేదన కలుగుతాయి. ఆ తేదీని గుర్తుచేసుకున్నప్పుడల్లా 49 సంవత్సరాల క్రితం జరిగిన ఆ మహా విషాదం వారి కళ్లముందు కదలాడుతుంది. సరిగ్గా 1977 నవంబర్ 19న సంభవించిన దివిసీమ ఉప్పెన వేలాది కుటుంబాల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఎన్నో ప్రాణాలను బలిగొంది. ఆ రోజు మిగిల్చిన గాయాలు, జ్ఞాపకాలు నేటికీ ఆ ప్రాంత ప్రజల హృదయాల్లో చెరిగిపోకుండా ఉన్నాయి.
ఆ సమయంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రాంత ప్రచారక్ శ్రీ సోంపల్లి సోమయ్య గారి సూచనల మేరకు నేను కొంతమంది స్వయంసేవకులం నవంబర్ 21వ తేదీన అవనిగడ్డ ప్రాంతానికి చేరుకుని సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నాం. యువకులమైన మేమంతా ఆ విపత్కర పరిస్థితుల్లో బాధిత ప్రజలకు అండగా నిలవాలని, ఆపదలో ఉన్నవారికి సేవ చేయాలని దృఢంగా సంకల్పించుకున్నాం.అక్కడికి వెళ్లి చూసిన దృశ్యాలు ఇప్పటికీ నా కళ్లముందు కదలాడుతూనే ఉంటాయి.
ఎటుచూసినా జనజీవనం ఛిన్నాభిన్నమైపోయి, ఆ ప్రాంతమంతా ఒక మరుభూమిని తలపించేది. గుర్తుపట్టలేని స్థితిలో ఎక్కడపడితే అక్కడ కుప్పలుగా మృతదేహాలు కనిపించేవి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి బంధువులు సైతం ముందుకు రాలేని అత్యంత హృదయవిదారక పరిస్థితి నెలకొంది.
అలాంటి సమయంలో ఆ మృతదేహాలకు గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సిన బాధ్యతను మేము స్వీకరించాం. ఒక బృందంగా ఏర్పడి, ప్రతి మృతదేహాన్ని వెదురు కర్రలతో కట్టి, నలుగురం కలిసి భుజాలపై మోస్తూ, రామనామ స్మరణ చేస్తూ తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించేవాళ్లం. ఆప్తులెవరో తెలియని అనాథ మృతదేహాలకు కూడా ఆఖరి వీడ్కోలు పలకడం మా బాధ్యతగా భావించాం.
నేను ఖాకీ నిక్కరు, తెల్ల చొక్కా ధరించి, ముఖానికి మాస్కు పెట్టుకుని, తలకు ఒక గుడ్డ కట్టుకుని ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. దాదాపు పది రోజుల పాటు తిండితిప్పలను సైతం లెక్కచేయకుండా, అందుబాటులో ఉన్న పాలు, కొన్ని బిస్కెట్లు తింటూ నిరంతరాయంగా ఈ కార్యక్రమాలను కొనసాగించాం.
మేము నిర్వహించిన ఈ సేవా కార్యక్రమాలను పత్రికలు ప్రత్యేకంగా గుర్తించి ‘శవసేన’ పేరుతో ప్రచురించాయి. ఆ పేరు కేవలం పత్రికలకే పరిమితం కాలేదు. స్థానిక ప్రజలు సైతం మమ్మల్ని ఆప్యాయంగా ‘శవసేన’ అని పిలిచేవారు.
నాటి ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు గారితో మరచిపోలేని సంఘటన
దివిసీమలో జరుగుతున్న సహాయక కార్యక్రమాలను పరిశీలించేందుకు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు గారు కోడూరు ప్రాంతానికి వచ్చారు. ఆ సమయంలో మేము ఖాకీ నిక్కరు, తెల్ల చొక్కా ధరించి అంత్యక్రియల కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాం. మమ్మల్ని చూసిన ముఖ్యమంత్రి గారు, “మీరు పోలీసులా?” అని అడిగారు. కాదని, మేము స్వయంసేవకులమని, బాధితులకు సహాయం చేయడానికి వచ్చామని వివరించాం.
మా సేవా కార్యక్రమాల గురించి తెలుసుకుని ఆయన ఎంతో అభినందించారు. మృతదేహాలను చూసి పోలీసులు, సింగరేణి నుండి వచ్చిన సహాయక సిబ్బందే హడలిపోతుంటే మీరు ఎలా చేయగలుగుతున్నారు ?, మీకు ప్రత్యేకంగా ఏమైనా మత్తు అలవాటు ఉందా అంటూ మమ్మల్ని అడిగారు, దానికి నేను సమాధానమిస్తూ, మాకు ఎలాంటి మత్తు పదార్థాల అలవాటు లేదు. సమాజ సేవ అనే భావనను సంస్థ మాలో నింపింది. ఆ స్ఫూర్తితోనే ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పాను.
ఎంతో సంతోషించిన ఆయన మా సహాయక కార్యక్రమాలకు అవసరమైన కిరోసిన్, ఇతర సామగ్రిని అందించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి గారి నుంచి లభించిన ప్రోత్సాహం మాకు మరింత స్ఫూర్తినిచ్చింది.
అవనిగడ్డ శాసనసభ్యులు, అప్పటి మంత్రి శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారు గ్రామగ్రామాన తిరుగుతూ బాధిత ప్రజలకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించారు. విపత్తు తీవ్రతను స్వయంగా పరిశీలిస్తూ, ప్రజలకు అండగా నిలిచి సహాయక కార్యక్రమాలను సమన్వయం చేశారు. మేము నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి తెలిసిన వారు మమ్మల్ని గాంధీ క్షేత్రానికి ఆహ్వానించి ప్రశంసించారు, అక్కడే ఉన్న మహారాష్ట్రకు చెందిన ప్రముఖ గాంధేయవాది శ్రీ ప్రభాకర్ జీ “RSS అంటే Ready for Selfless Service” అని వ్యాఖ్యానించారు. ఆ మాటలు మాలో ఎంతో ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపాయి.
మూలపాలెం గ్రామం దీన్ దయాల్ పురం గా పునర్నిర్మాణం – నా జీవితంలో ప్రత్యేక అధ్యాయం
దివిసీమలో సహాయక చర్యలతో పాటు బాధితులకు శాశ్వత పునరావాసం కల్పించడం కూడా అత్యంత అవసరమని భావించాం. ఈ క్రమంలో మేము మూలపాలెం అనే గ్రామాన్ని దత్తత తీసుకుని, ఆ గ్రామ పునర్నిర్మాణ బాధ్యతను చేపట్టాము. గ్రామస్థుల సహకారంతో ఇళ్ల నిర్మాణం, పాఠశాల, రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశాం. మత్స్యకారులకు పడవలు, వలలు అందించి వారి జీవనోపాధి తిరిగి ప్రారంభమయ్యేలా సహాయం చేశాం.
మూలపాలెం గ్రామ దీన్ దయాల్ పురం గా పునర్నిర్మాణం పూర్తయిన అనంతరం జరిగిన ప్రారంభోత్సవానికి అప్పటి విదేశాంగ శాఖ మంత్రి, భారత మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజపేయి గారు స్వయంగా విచ్చేయడం మాకు ఎంతో గర్వకారణం. ఈ పునరావాస కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ తుపాను సహాయ కమిటీతో పాటు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి సహాయ సహకారాలు అందాయి.
విజయవాడలోని ఇండియన్ ఎక్స్ప్రెస్ గోదాములో సేకరించిన సహాయ సామగ్రిని క్రమబద్ధీకరించి సుమారు 56 గ్రామాలకు పంపిణీ చేశాం. దాదాపు 400 నుంచి 500 మంది స్వచ్ఛంద సేవకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రామకృష్ణ మిషన్, సత్యసాయి సేవా సంస్థలు, ఆర్యసమాజ్, విశ్వహిందూ పరిషత్, సాల్వేషన్ ఆర్మీ తదితర సంస్థలు కూడా తమ వంతు సహకారం అందించాయి.
దివిసీమ ఉప్పెన నాకు నేర్పిన గొప్ప పాఠం ఒక్కటే – ఆపదలో ఉన్న మనిషికి అండగా నిలబడటమే నిజమైన మానవత్వం. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలకు అతీతంగా బాధితులకు సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఆ రోజుల్లో మాతో కలిసి పనిచేసిన స్వచ్ఛంద సేవకులు, సహకరించిన సంస్థలు, అధికారులు, దాతలు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
దివిసీమ ఉప్పెనలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నా ఘన నివాళులు. ఆ విషాదం మనకు మిగిల్చిన జ్ఞాపకాలు, సేవా స్ఫూర్తి, మానవత్వపు విలువలు ఎప్పటికీ మనకు మార్గదర్శకంగా నిలవాలి.

– బండారు దత్తాత్రేయ
(మాజీ గవర్నర్)
