-పారిశ్రామిక రాయితీల కన్నా పెంచిన విద్యుత్ చార్జీల ద్వారా పీకుడే ఎక్కువ
_ ఎంఎస్ఎంఇ లకు బకాయిలు రూ.1600కోట్లు కాగా.ఇచ్చింది 440కోట్లు
– స్పిన్నింగ్,టెక్సటైల్ మిల్లుల బకాయిలు రూ.2వేలకోట్లు కాగా.ఇచ్చింది 684కోట్లు
– జగన్ ప్రభుత్వ నిర్వాకం కారణంగానే పారిశ్రామికాభివృద్ధి రేటు మైనస్ -3.26 శాతానికి!
ప్రభుత్వ నిధులు వైసిపి నేతలు లూఠీ చేయబట్టే రాయితీలు పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోవడం కారణం
• తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
పారిశ్రామిక ప్రోత్సహకాల విడుదల పేరుతో జగన్ రెడ్డి ప్రభుత్వం మరోమారు చిన్న, మధ్యతరహా పరిశ్రమలను దగా చేసింది. చంద్రబాబు ప్రభుత్వం 2014 జూన్ నుంచి 2019 మార్చి మధ్య 3,675 కోట్ల పారిశ్రామిక రాయితీలు ఇవ్వడమైనది. జగన్ రెడ్డి ఇచ్చే పారిశ్రామిక రాయితీల కన్నా పెంచిన విద్యుత్ చార్జీల ద్వారా లాక్కునేదే ఎక్కువగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రోత్సహకాల కోసం 25వేలమంది ఎంఎస్ఎంఇ లు దరఖాస్తులు చేసుకున్నారు. ఇందుగాను సంబంధించి వారికి 1600 కోట్లరూపాయలు చెల్లించాల్సి ఉండగా రకరకాల కొర్రీలు, వడపోతలు పోసి కేవలం 440 కోట్లరూపాయల మాత్రమే విడుదల చేశారు. అదేవిధంగా టెక్స్ టైల్, స్పిన్సింగ్ మిల్లల బకాయిల విషయంలో కూడా ప్రభుత్వం దగా చేసింది. బకాయిలు మొత్తం విడుదల చేస్తామని చెప్పి 2వేలకోట్ల రూపాయలకు గాను కేవలం రూ.684కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసింది.
గత ప్రభుత్వ బకాయిలు చెల్లించామని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్పుకోవడం ప్రజలను తప్పుదారి పట్టించడమే. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి రాష్ట్రంలో వైఎస్ ప్రభుత్వం పెట్టిన 32వేల కోట్లరూపాయల బకాయిలను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించింది. ప్రస్తుతం జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన 2లక్షల కోట్ల అప్పు మరియు పెండింగ్ లో పెట్టిన లక్షకోట్లకుపైగా బకాయిలను రాబోయే ప్రభుత్వాలే చెల్లించాల్సి ఉంటుంది. అధికారంలో ఎవరున్నప్పటికీ పాతబకాయిలు చెల్లించడమన్నది నిరంతర ప్రక్రియ.
జగన్ రెడ్డి ప్రభుత్వ అరాచకం వల్ల గతంలో ఒప్పందం చేసుకున్న రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. 2020-21గాను ప్రభుత్వం విడుదల చేసిన సోషియో ఎకనమిక్ సర్వే లెక్కల ప్రకారం స్థిరీకరించిన ధరల ఆధారంగా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి రేటు మైనస్ -3.26కు పడిపోయింది. అదేసమయంలో సిఎంఐఇ తాజాగా విడుదలచేసిన నివేదక ప్రకారం రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు తెలంగాణా కంటే 2శాతం అధికంగా ఉంది..ప్రభుత్వం చెబుతున్నట్లుగా పరిశ్రమలు వచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తే పారిశ్రామికాభివృద్ధి రేటు మైనస్ -3.26కి ఎందుకు పడిపోయింది?
వాస్తవగణాంకాలను మరుగునపెట్టి పెద్దఎత్తున పరిశ్రమలు వచ్చాయని చెప్పడం గోబెల్స్ ప్రచారంలో భాగమే. రాష్ట్రవ్యాప్తంగా భారీ, మెగా పరిశ్రమలకు సంబంధించి విద్యుత్ సబ్సిడీ, వాణిజ్యపన్నులు, జిఎస్ టి, బ్యాంకురుణాలపై వడ్డీ రాయితీ తదితర ప్రోత్సాహక బకాయిలు 5వేలకోట్లరూపాయలు ఉండగా, వాటి ప్రస్థావనే తేవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఐటి, ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు 500 కోట్లరూపాయల ప్రోత్సహకాలు బకాయిలు ఉంటే వాటి విషయాన్నే పట్టించకోవడంలేదు. ఇందులో ఫాక్స్ కాన్, కార్బన్, సెల్ కాన్ వంటి సంస్థలు కూడా ఉన్నాయి. ఒక్క ఫాక్స్ కాన్ సంస్థకే 260కోట్లరూపాయలు బకాయిలు చెల్లించాల్సి ఉంది.
కడప జిల్లాలో 13,500కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుచేస్తామని రెండేళ్లుగా చెబుతూ అక్కడి ప్రజలను ఊరిస్తూ వస్తున్నారు. వాస్తవమేమిటంటే 2020-21లో కడప స్టీల్ ప్లాంట్ మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం కేవలం 200కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు అక్కడ ఎటువంటి పనులు మొదలు కాలేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బిసి ఎంఎస్ఎంఇ లకు పరిశ్రమలు స్థాపించిన వెంటనే రాయితీలు ఇవ్వగా, జగన్ రెడ్డి ఆ విధానాన్ని 3ఏళ్ల తర్వాత ఇచ్చే విధంగా మార్పుచేసి వారికి తీవ్ర అన్యాయం చేశాడు.
తెలుగుదేశం హయాంలోనే ఎంఎస్ఎంఈ అభివృద్ధి
ఎంఎస్ఎంఈ రంగ అభివృద్ధికి అంకితమైన విధానాలతో తెలుగుదేశం ప్రభుత్వం ముందుకెళ్లింది. 2014 నుంచి ఐదేళ్లలో మొత్తం 30,349 ఎంఎస్ఎంఈ యూనిట్లు స్థాపించారు. వీటితో రూ. 14,292 కోట్లు పెట్టుబడులు వచ్చి, 3.3 లక్షల మందికి ఉపాధి లభించింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల స్థాపనకు నిర్ణయించగా.. 1,317.97 ఎకరాల్లో రూ. 270.43 కోట్ల ఖర్చుతో 31 పార్కుల ఏర్పాటు జరిగింది. 2014-18 మధ్య కాలంలో రూ. 82,097 కోట్ల మేర రుణాలకు ఎంఎస్ఎంఈ రంగానికి ఇవ్వడమైనది. ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేకంగా కార్పోరేషన్ ఏర్పాటు చేయబడింది. తెలుగుదేశం హయాంలో జూన్ 2014 నుంచి మార్చి 2019 వరకు పారిశ్రామిక రాయితీలు కింద రూ.3,675 కోట్లు విడుదల చేయడం జరిగింది. అందులో లోకల్ ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేసే చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా ఎంఎస్ఎంఈలకు రూ.1,816 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ వివరాలన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో పేజీ నెం.13లో పొందుపర్చడం జరిగింది.
ఓ వైపు పారిశ్రామికవేత్తల నుంచి బలవంతంగా రూ. వేల కోట్లు జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. అందులో ఎంఎస్ఎంఇ లకు కేంద్రప్రభుత్వం ఇచ్చిన రాయితీలను సైతం పేరుమార్చి చెల్లిస్తూ పారిశ్రామిక ఉద్దారకులుగా కలరింగ్ ఇస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పారిశ్రామికాభివృద్ధికి నిర్మాణాత్మకంగా చేపట్టిన చర్యలు కారణంగా 5లక్షల కోట్లరూపాయల విలువైన పరిశ్రమలు ఏర్పాటై 5.13లక్షల కోట్ల మందికి ఉద్యోగాలు లభించాయి. మూడు పారిశ్రామిక సదస్సులను ఏర్పాటు చేయడం ద్వారా 15.43లక్షల కోట్లరూపాయల విలువైన పెట్టుబడులు, 32లక్షల ఉద్యోగాలు కల్పించేవిధంగా ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. గత రెండేళ్లలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న ఎసిబి, పిసిబి, జెసిబి చర్యల కారణంగా 10లక్షల కోట్లరూపాయల విలువైన పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి.