Suryaa.co.in

Food & Health

ఈ సీజన్లో జ్వరం వస్తే…

అశ్రద్ద చేయవద్దు…
అవగాహన అవసరం…
ఆందోళన అనవసరం…
ప్రజలు ఓవైపు కరోనా , మరోవైపు సీజనల్ వ్యాధులు, దీంతో ఏ జ్వరం ఏమిటో తెలియక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. సీజనల్ వ్యాధులు ,వీటిల్లో డెంగ్యూ జ్వరం ఇపుడు ముఖ్యమైన ప్రాణాంతకమైన వ్యాధి.
సాధారణంగా దీని వ్యాప్తి వర్షాకాలం ముగిసే సమయానికి మొదలవుతుంది. డెంగ్యూ జ్వరం దోమల వల్ల కలిగే వైరల్ వ్యాధి. ఏడిస్ దోమ కాటు ద్వారా డెంగ్యూ వైరస్ మనుషులకు వ్యాపిస్తుంది. ఇది శరీర అవయవాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. డెంగ్యూ బారిన పడిన వారిలో 75 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించవని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) చెబుతోంది. 20 శాతం మందిలో తేలికపాటి లక్షణాలు ఉంటాయి. మిగతా ఐదు శాతం మందిలో తీవ్రమైన లక్షణాలు ఉండవచ్చు. వీరిలో వ్యాధి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.
అయితే ప్రస్తుతం ఏ జ్వరం వచ్చినా డెంగ్యూ అని భయపడాల్సిన పనిలేదు.. డెంగ్యూ కి కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగివుంటుంది. అంతేకాదు చికిత్స లేని ఈ జ్వరానికి నివారణ ఒక్కటే మార్గం.
డెంగ్యూ జ్వరం వచ్చినవారిలో అతి పెద్ద సమస్య…రక్తకణాల సంఖ్య తగ్గడం రక్తకణాలు 80 -70 వేల కంటే తగ్గితే ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోవాలి. రోగికి రక్తకణాల సంఖ్య 30 వేల వరకు ఉన్నా, డెంగ్యూ కాకుంటే ప్రమాదం ఉండదు, చికిత్సతో తిరిగి రెండు మూడు రోజుల్లో సాధారణ స్థితికి వస్తూ వుంటారు అయితే డెంగ్యూ సోకిన వారందరికీ రక్తకణాల సంఖ్య తగ్గుతాయని భయం అవసరం లేదు.
డెంగ్యూ జ్వరం లక్షణాలు
హఠాత్తుగా జ్వర తీవ్రత ఎక్కువ అవుతుంది.
తలనొప్పి ముఖ్యంగా నొసటి మీద నొప్పి అధికంగా ఉంటుంది.
కన్ను కదిలితే నొప్పి అనిపించడం.. కంటి కదలికలు తగ్గుతాయి
కండరాలు, కీళ్ళ నొప్పి అధికమవుతాయి
వాంతులు అవుతున్న ఫీలింగ్
నోరు ఎండిపోయి.. దాహం అధికంగా ఉండడం
ఈ లక్షణాలు కనిపించినవారు వెంటనే, సమీపంలో ఉన్న వైద్యుడిని సంప్రదించి తగిన విధంగా చికిత్స తీసుకోవాలి.
డెంగ్యూ జ్వరం చికిత్స….
డెంగ్యూ జ్వరం వచ్చిన వారిలో, కొంతమందికి మాత్రమే రక్తకణాల సంఖ్య తగ్గుతాయి. కనుక ఈ ప్లేట్‌లెట్ల గురించి అవగాహన పెంచుకోవటం అవసరం. మన రక్తంలో తెల్లరక్తకణాలు, ఎర్రరక్తకణాలతో పాటు ప్లేట్‌లెట్లు కూడా ఉంటాయి. ఇవి రక్తస్రావం జరగకుండా రక్తం గడ్డకట్టటంలో ప్రముఖపాత్ర పోషిస్తాయి. సాధారణంగా మన రక్తంలో ఈ ప్లేట్‌లెట్‌ కణాలు 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకూ ఉంటాయి
వీటి సంఖ్య బాగా పడిపోతే రక్తస్రావం కావటానికి దారితీస్తుంది. అయితే ఒకొక్కసారి బ్లడ్ టెస్ట్ లో, ప్లేట్ లెట్స్ లెక్కల్లో తప్పులు రావచ్చు.. కనుక ఈ పరీక్షను ఒకటికి రెండు సార్లు చేయించుకోవాలి. ముఖ్యంగా చర్మం మీద చిన్న చిన్న చుక్కల్లాంటి రక్తపు మచ్చలు ఉన్నట్టు కనిపించినా , చిన్న దెబ్బకు కూడా చర్మం కందిపోయినా , రక్తస్రావం ఆపకుండా జరుగుతున్నా.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
డెంగ్యూ సోకిన రోగికి విశ్రాంతి అవసరం, జ్వరానికి , నొప్పులకు తగిన మందులను ఇస్తూనే మరేవిధమైన బాక్టీరియల్ ఇంఫెక్షన్‌ రాకుండా యాంటిబయోటిక్ ను ఇస్తారు. అంతేకాదు పౌస్టికాహారము , అన్ని ఆహార పదార్థాలను వేడి చేసి తినవలెను. ఇక ఈ రోగి కారం , పులుపు , మసాలా ఆహారానికి దూరంగా ఉంటే మంచిది.
మూలికా వైద్యం
డెంగ్యూ జ్వరానికి మూలికా వైద్యం కూడా చాలా మంది అనుసరిస్తూ ఉంటారు. ముఖ్యంగా బొప్పాయి ఆకుల రసం, బొప్పాయి కాయ తో పాటు పర్పుల్‌ రంగులో ఉండే చిలగడదుంప ఆకుల కషాయం సమర్థవంతంగా పనిచేస్తుంది. దీనికి పలు శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.
బొప్పాయిరసం : బొప్పాయి కాయ మనిషికి ప్రకృతి అందించిన కానుక. దీని ఆకుల రసం, బొప్పాయి కాయ, బొప్పాయి రసంతో డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చు.
నివారణ మార్గాలు
డెంగ్యూ జ్వరం బారిన పడకుండా కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే..
1. దోమ తెర వాడకం- డెంగీ దోమకాటు వల్ల వ్యాపిస్తుంది. అందువల్ల దోమకాటుకు దూరంగా ఉండాలంటే నిద్రపోయేటప్పుడు దోమ తెరను ఉపయోగించాలి.
2. మస్కిటో రెపెల్లెంట్ లోషన్లు- దోమలు మన దగ్గరికి రాకుండా మస్కిటో రెపెల్లెంట్లు కాపాడుతాయి. పడుకునేముందు దోమలు ఎక్కువగా కుట్టడానికి అవకాశం ఉండే ప్రాంతాల్లో వీటిని రాసుకోవాలి. గాయాలు ఉన్న దగ్గర దీన్ని రాయకూడదు.
3. శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులు- దోమ కాటును నివారించడానికి శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. ఫుల్ హ్యాండ్ షర్టులు, పొడవైన ప్యాంటు ధరించడం మంచిది.
4. పరిసరాల పరిశుభ్రత- నివాస ప్రాంతాల్లో దోమలు ఎక్కువగా వృద్ధి చెందకుండా చూసుకోవాలి. పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండే ప్రదేశాల్లో దోమలు గుడ్లు పెట్టి, వాటి సంతతిని పెంచుకుంటాయి. అందుకే ఇంటి చుట్టూ నీరు, డ్రైనేజీ నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోండి.
5. దోమలను ఇంట్లోకి రానివ్వొద్దు- రోజూ సాయంత్రం, సూర్యాస్తమయానికి ముందు ఇంటి తలుపులు, కిటికీలు మూసివేయాలి. దోమలు సాయంత్రం వేళల్లోనే చురుగ్గా ఉంటాయి. ఆ సమయం నుంచే అవి ఇంట్లోకి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
6. ఖాళీ డబ్బాలు, కుండలు తనిఖీ చేయండి- ఇంటి చుట్టుపక్కల ఉండే ఖాళీ కుండలు, కంటైనర్లు, పాత బకెట్లు, ఇతర డబ్బాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి నీరు నిల్వ ఉండకుండా శుభ్రపరచండి. అలాంటి వాటి కారణంగానే దోమలు సంతతిని పెంచుకుంటాయి.
7. కూలర్లు, చెత్త డబ్బాలను శుభ్రం చేయండి- ఇంట్లో నిత్యం వినియోగించే కూలర్లు, డస్ట్ బిన్‌లు క్రమం తప్పకుండా శుభ్రపరచండి. కీటకాలు, దోమలు ఇలాంటి వాటిల్లో పోగయ్యే అవకాశం ఉంది.
8. ఇతర చిట్కాలు- దోమలను దూరంగా ఉంచేందుకు ఇంట్లో తేలికపాటి కర్పూరాన్ని వెలిగించండి. దీంతో పాటు అందుబాటులో ఉన్న ఇతర ఉత్పత్తులు, మెషిన్లను వాడటం ద్వారా దోమలు ఇంట్లోకి రాకుండా కాపాడుకోవచ్చు.

LEAVE A RESPONSE