Suryaa.co.in

Telangana

మేధావులారా…..మీ మౌనం రాష్ట్రానికి అరిష్టం

-కేసీఆర్ నియంత, అహంకార పూరిత పాలనతో అన్ని వర్గాలు నష్టపోతున్నయ్
-సిద్దిపేట కలెక్టర్ బరితెగించి మాట్లాడుతున్నడు
-ఇకనైనా మేల్కొని మలిదశ ఉద్యమ వీరులను తయారుచేయండి
-కేసీఆర్ గడీల పాలనను బద్దలు కొట్టాలంటే హుజూరాబాద్ లో బీజేపీని గెలిపించండి
– కేసీఆర్ అంటే…కల్వకుంట్ల కమీషన్ల రావు
-హుజూరాబాద్ ‘పుర ప్రముఖుల’ సమావేశంలో మేధావులకు పిలుపునిచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
‘‘మేధావులారా…మీ మౌనం తెలంగాణకు అరిష్టం. కేసీఆర్ నియంత, అహంకారపూరిత, గడీల పాలనతో పేదలతోసహా అన్ని వర్గాలు అనేక ఇబ్బందులు పడుతున్నయ్. సిద్దిపేట కలెక్టర్ వంటి వాళ్లు సుప్రీంకోర్టు తీర్పులను కూడా లెక్కచేయనంటూ బరితెగించి మాట్లాడే స్థాయికి వచ్చారు. మీరు మేధావులు ఇకనైనా మేల్కొనండి. తెలంగాణ ఉద్యమంలో మాదిరిగానే మలిదశ ఉద్యమకారులను తయారు చేయండి. కేసీఆర్ గడీల పాలనను బద్దలు కొట్టి పేదల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించండి. అందులో భాగంగా హుజూరాబాద్ ఎన్నికల్లో రెండ్రోజుల సమయం కేటాయించి బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ గెలుపుకు క్రుషి చేయండి’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
హుజూరాబాద్ లోని మధువని గార్డెన్స్ లో జరిగిన పుర ప్రముఖుల సమావేశంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్, మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్, మాజీ ఎంపీ జితేందర్ ఱెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, గుజ్జుల రామక్రిష్ణారెడ్డి, బీజేపీ ఎస్సీ మెర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు జి.క్రిష్ణారెడ్డి తదితరులు హాజరైన ఈ సమావేశంలో బండి సంజయ్ కుమార్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…
తెలంగాణ ప్రజలకు ప్రేమ తోపాటు ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది. అక్రమాలు జరిగితే ఎదిరించే తత్వముంది. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా తన రచనలతో ఉర్రూతలూగించిన గూడ అంజన్నను చివరి చూపు నోచుకోకుండదా అవమానించిన వ్యక్తి కేసీఆర్. తెలంగాణలో జర్నలిస్టులతోపాటు వివిధ వర్గాలు చేసిస సేవలు మర్చిపోలేం. బయటవాడు మోసం చేస్తే పోలిమేర వరకు తరిమికొట్టాలి. తెలంగాణవాడు మోసం చేస్తే పాతిపెట్టాలన్న కాళోజీ మాటలను స్పూర్తిగా తీసుకుని ఉద్యమించాలి.
తెలంగాణలో మేధావులు మౌనం దాల్చడం అత్యంత దురద్రుష్టం.తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారులంతా ఏమయ్యారు? వాళ్లంతా బయటకొచ్చి కొట్లాడాలి. తెలంగాణ కోసం జీవితాంతం పనిచేసిన ప్రొఫెసర్ జయశంకర్ ను ఘోరంగా అవమానించిన వ్యక్తి కేసీఆర్. బీజేపీ చేపడుతున్న ఉద్యమంలో తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారులంతా భాగస్వాములై నియంత పాలన అంతానికి కలిసి పనిచేయాలి.
కేసీఆర్ అంటే…కల్వకుంట్ల కమీషన్ల రావు. కాళేశ్వరం పేరిట వేల కోట్లు దోచుకుంటున్నడు. పాలమూరు-రంగారెడ్డి ఏమైంది? పెండింగ్ ప్రాజెక్టులన్నీ ఏమైనయ్? తెలంగాణలో మొట్టమొదటి ద్రోహి. తెలంగాణకు 575 టీఎంసీల నీరు రావాలి. సీఎం కేసీఆర్ చేతగానితనంవల్ల, ఏపీ సీఎంతో కుమ్మక్కు కావడంవల్ల తెలంగానకు 299 టీఎంసీల నీరు మాత్రమే వచ్చే ఒప్పందాలపై సంతకం చేసిన తెలంగాణ ద్రోహి. అపెక్స్ సమావేశంలోనూ తెలంగాణకు అన్యాయం జరిగేలా కేసీఆర్ ప్రభుత్వం వాదనలు విన్పించింది.
పొరుగు రాష్ట్రంలో అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్నా పట్టించుకోని వ్యక్తి కేసీఆర్. ఆ అక్రమాలపై స్వయంగా తాను లేఖ రాసిన తరువాతే మేల్కొని హడావుడిగా లేఖ రాసిన ప్రభుత్వం కేసీఆర్ దే.
ఏ రాష్ట్రంలో సీఎం రోజువారీ కార్యక్రమాలపై షెడ్యూల్ విడుదల చేస్తారు. కానీ కేసీఆర్ మాత్రం గత ఏడేళ్లుగా ఏనాడూ షెడ్యూల్ రిలీజ్ చేయలేదు. ఫాంహౌజ్ కే పరిమితమైండు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భ్రుతి ఏమైంది? ఉద్యోగాలివ్వమంటే…ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నడు. ఎన్ని ఉద్యోగాలిచ్చారో కేసీఆర్ స్పష్టం చేయాలి. విద్యా వలంటర్లను తొలగించిండు. 22 వేల మంది స్కావెంజర్లను తొలగించిండు. 104, 108 సిబ్బందికి ఐదారు నెలలుగా జీతాల్లేక రోడ్డునపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఏనాడూ మొదటి తారీఖున జీతాలిచ్చిన పాపానపోలేదు.
కరోనా ఉందని ఉప ఎన్నికలు వాయిదా వేయాలని ఎన్నికల సంఘానికి లేఖ రాసిన ముఖ్యమంత్రి కేసీఆర్……హుజూరాబాద్ లో ఓడిపోతామని తెలిసి ఇక్కడి ప్రజలకు ముఖం చూపలేక తాను సభ పెడతానంటే ఎన్నికల సంఘం ఒప్పుకోవడం లేదంటూ అబద్దాలు చెబుతూ ఈసీపై నిందలేస్తున్నడు. ప్రపంచంలోనే భారత ఎన్నికల సంఘానికి మంచి పేరుంది. కేసీఆర్ కు ముఖం చూపే దమ్ములేక ఈసీపై సిగ్గులేకుండా నిందలేస్తున్నడు.
దుబ్బాక ఎన్నికలప్పుడు సన్న వడ్లు వద్దు అన్నడు…హుజూర్ నగర్ ఎన్నికల్లో దొడ్డు వడ్లు అన్నడు. సాగర్ ఎన్నికల సమయంలో మరోమాట అన్నడు….ఇప్పుడు వరి వేస్తే ఉరే గతి అని అంటున్నడు. అసలు నీకు, బియ్యానికి ఏం సంబంధం? కేసీఆర్ ప్రభుత్వం కేవలం బ్రోకర్ మాత్రమే. ధాన్యమంతా కొనుగోలు చేసేది కేంద్రమే. సుతిలి తాడుసహా అన్ని డబ్బులు కేంద్రానివే.
సిద్దిపేట జిల్లా కలెక్టర్ బరి తెగించి అహంకారంతో మాట్లాడుతుండు. సుప్రీంకోర్టు ఆర్డర్ ను కూడా పట్టించుకోనని…కోర్టులను శాసించే స్థాయిలో కలెక్టర్ మాట్లాడుతుండుంటే పాలన ఎలా ఉందో అర్ధం చేసుకోవాలి? కేసీఆర్ కాళ్లు పట్టుకుని పోస్టింగులు తెచ్చుకుంటున్న అలాంటి అధికారులు ఇష్టారీతిన మాట్లాడుతున్నా మేధావులు మౌనంగా ఉండటం బాధాకరం.
మేధావులు మౌనంగా ఉన్నారు కాబట్టే అహంకారంతో కేసీఆర్ పాలన కొనసాగుతోంది. కలెక్టర్ లాంటి వాళ్లు బరితెగించి మాట్లాడుతున్నరు. పేదలను, రైతులను అణగదొక్కుతున్నరు. ఇవన్నీ భరించలేకనే ఈటల రాజేందర్ ప్రశ్నిస్తే….పార్టీ నుండి బయటకు పంపిండు. అవినీతి ముద్ర వేసి కేసులు పెట్టిండు. ఈ దేశంలో కేసీఆర్ కుటుంబం కంటే అవినీతిపరులెవరూ లేరు.
దయచేసి మేధావి వర్గం మౌనం వీడాలి. మీ మౌనం తెలంగాణకు అరిష్టం. పేదలకు నష్టదాయకం. మేల్కొనకపోతే భావితరాలకు అన్యాయం జరుగుతుంది. ఈ హుజూరాబాద్ ఎన్నికల్లో ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి. కేసీఆర్ పుట్టకముందే కొట్లాడి అనేక త్యాగాలు చేసిన చరిత్ర బీజేపీకి ఉంది. మేధావి వర్గం ఇకనైనా మౌనాన్ని వీడి గతంలో మాదిరగా పోరాట వీరులను తయారు చేసి కేసీఆర్ గడీల పాలనను, అవినీతి పాలనను తరిమితరిమి కొట్టాలి. మేధావులంతా ఈ రెండ్రోజులు సమయం కేటాయించి హుజూరాబాద్ లో బీజేపీని గెలిపించాలని కోరుతున్నా.
ఈటల గెలుపుతో తెలంగాణలో ప్రభుత్వం బీజేపీ హస్తగతం తథ్యం : సీహెచ్ విద్యాసాగర్ రావు
ఈ ఎన్నికల్లో ఆరోపణలు చేస్తున్న టీఆర్ఎస్ నాయకులు ఈటల రాజేందర్ కు ఎందుకు ఓటేయకూడదో చెప్పలేకపోతున్నరు. ఈటల రాజేందర్ గెలిస్తే తెలంగాణలో బీజేపీ హస్తగతం అవడం ఖాయం. ఆ ఆలోచనను నరనరాల్లో జీర్ణించుకుని ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోరాడాలి.
ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాల్సి అవసరం ఉంది. దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలంటే తొలుత తెలంగాణలోనే బీజేపీ సర్కార్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండే. కానీ కుదరలేదు. ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీకి అనుకూల పరిస్థితులున్నయ్.
కేసీఆర్ ఈటల రాజేందర్ ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించారు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే అధికారం ఎవరికీ లేదని రాజ్యాంగంలోనే పొందుపర్చి ఉంది. ఏ మహిళ కూడా తన శీలతకు భంగం కలిగేలా వ్యవహరించదు. ఏ వ్యక్తి కూడా తన గౌరవానికి భంగం కలిగే విధంగా క్రుతజ్ఝత చూపరు.
దేశంలో రాహుల్ గాంధీని చూసి ఎవరైనా కాంగ్రెస్ లో చేరతారా? ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో దేశంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు అద్బుతంగా ఉన్నాయి. దేశంలో అవినీతి రహిత పాలన నడుస్తోంది. మోదీ అవినీతికి దూరంగా ఉన్నారు. మీడియా భూతద్దం పెట్టి వెతికినా అవినీతి కన్పించడం లేదు. దేశంలో ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టే విషయంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అగ్రభాగాన ఉన్నారు.
రాష్ట్రంలో సారా, మందు పంపిణీలో బీజేపీ వాటా లేదు తప్ప తెలంగాణలో జరుగుతున్న అన్ని అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలన్నింటిలోనూ కేంద్రం భాగస్వామ్యం ఉంది. ఈటల రాజేందర్ బీజేపీలోకి వస్తానంటే మనస్పూర్తిగా స్వాగతించాను. రాజేందర్ కమ్యూనిస్టు కదా…ఎందుకు చేర్చుకున్నారని అడుగుతున్నరు? ఏ సిద్ధాంతాలు, ఆలోచనలున్న వాళ్లైనా తెలంగాణలో నియంత పాలనను తరిమికొట్టి బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నందునే బీజేపీలోకి తీర్చుకున్నట్లు చెప్పాను.
బీజేపీ శిల్పి పండిత దీన్ దయాళ్ శర్మ 1958లోనే భారతీయ జనసంఘ్, సీపీఐ కలిసి సంయుక్తంగా ఢిల్లీ కార్పొరేషన్ లో అధికారాన్ని చేపట్టాయనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. బ్రిటీషర్లను ఎదిరించి భారత ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి మొట్టమొదటిసారిగా చాటిచెప్పిన గొప్ప వ్యక్తి రాంజీ గోండు మాత్రమే. అతని చరిత్రను టీఆర్ఎస్ పాలకులు విస్మరించడం బాధాకరం.ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంవల్లే గ్యాస్ ధరలు పెరుగుతున్నాయనే విషయాన్ని ప్రజలు అర్ధం చేసుకోవాలి. తెలంగాణలో ఆత్మగౌరవం, పరమాత్మ గౌరవం(ప్రజలు) కలిసిపోయాయి. హుజూరాబాద్ లో అత్యధిక మెజారిటీతో ఈటల రాజేందర్ గెలవడం ఖాయం
తానీషా పాలనకు చరమగీతం పాడండి : తరుణ్ చుగ్
బంగారు తెలంగాణ కోసం ఎంతోమంది యువత అన్ని వర్గాలు ఉద్యమాలు చేశారు. కేసీఆర్ నియంత పాలనలో, అహంకారంవల్ల బంగారు తెలంగాణ కలగానే మిగిలింది. కేసీఆర్ మంత్రివర్గంలో ఆలీబాబా 40 దొంగలున్నారు. తెలంగాణ కోసం మేం కొట్లాడితే కేసీఆర్ కుటుంబమే రాజ్యమేలుతోందనే భావన ప్రజల్లో ఏర్పడింది. తెలంగాణ మంత్రిమండలి పైన మరో కేబినెట్ ఉంది. దానిపేరు కేసీఆర్ సాయంత్రం నిర్వహించే మంత్రిమండలి. తెలంగాణను లూటీ చేస్తోంది.
హుజూరాబాద్ ఎన్నికలు తానీషా పాలనను తలపిస్తున్న కేసీఆర్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్నవి. నా చెప్పును నిలబెట్టినా గెలుస్తుందనే కేసీఆర్ అహంకారాన్ని హుజూరాబాద్ ఫ్రజలు అణిచివేయాలి. హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్ పాలన నుండి విముక్తి కలిగించేలా తీర్పు ఇవ్వాలి. బీజేపీని గెలిపిస్తే దేశంలో పేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఏర్పాటుకు సుగమం అవుతోంది.

LEAVE A RESPONSE