Suryaa.co.in

Andhra Pradesh

తెలంగాణలో పెట్రోల్ ధరలపై ఎందుకు ధర్నా చేయలేదు?

– టీడీపీకి ఎమ్మెల్యే వంశీ ప్రశ్న
మోడీని,అమిత్ షాలను చూస్తే చంద్రబాబుకు భయం అని ఎమ్మెల్యే వల్లభనేని వంశీఎద్దేవా చేసారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది కేంద్ర ప్రభుత్వమేనని ఎమ్మెల్యే వంశీ ఆరోపించారు. గన్నవరంలోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వంశీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రూ.50 ఉన్న ధరను రూ.70కి ప్రస్తుతం రూ.100కి చేసిన ఘనత బీజేపీదేనన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రోడ్ల కోసం తెచ్చిన డబ్బులను పసుపు కుంకుమ కింద వాడిన ఘనుడు చంద్రబాబు అని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ నాయకులు గానీ కార్యకర్తలు గాని చంద్రబాబు చెప్పే విషయాలను గమనించాలన్నారు. కొన్ని కుల పత్రికలను అడ్డం పెట్టుకొని ముందుకు వెళ్తున్న వ్యక్తి చంద్రబాబు అని ఆయన ఆరోపించారు. చివరి దశలో ఉండి కూడా బాధ్యత లేని రాజకీయాలు చేస్తున్న వ్యక్తి చంద్రబాబు అని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ ఉప ఎన్నికల్లో మీరు ఎందుకు పోటీ చేయలేదని ఆయన ప్రశ్నించారు. టీడీపీనీ అంతర్జాతీయ పార్టీ, జాతీయ పార్టీ అని చంద్రబాబునాయుడు చెప్పి ఇతర దేశాల్లో కూడా కమిటీలు వేశారన్నారు. చంద్రబాబు నాయుడుకి దమ్ముంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్, పెట్రోల్ ధరపై మోడీ,అమిత్ షాలకు వ్యతిరేకంగా నిరసన తెలపాలని ఆయన సవాల్ విసిరారు. అప్పుడు చంద్రబాబునాయుడు ధైర్యవంతుడు అని తాను కూడా ఒప్పుకుంటానన్నారు. తెలుగుదేశం పార్టీ గొప్ప పార్టీ అని, దానిలో బాబు,కొడుకులు చేరి పార్టీని పతనం చేశారన్నారు. బద్వేల్‌లో పోటీ చేస్తే చంద్రబాబుకు డిపాజిట్లు దక్కలేదన్నారు. తెలంగాణలో పెట్రోల్, డీజిల్‌పై ఎందుకు నిరసన తెలపలేదని ఎమ్మెల్యే వంశీ ప్రశ్నించారు.

LEAVE A RESPONSE