-కుప్పంలో తెదేపా వారు మాత్రమే స్థానికేతరులా..! ఇది వైసీపీ కి వర్తించదా..?
– చంద్రబాబు పై ద్వేషంతో ఇన్ని కుట్రలు, కుతంత్రాలా..?
– తీవ్రస్థాయిలో ద్వజమెత్తిన “రెడ్యo”
స్థానికేతరులైన తెదేపా నేతలెవ్వరూ కుప్పం ఎన్నికలు అయ్యేంత వరకు కుప్పంలో కన్పించరాదని ..చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి హుకుం జారీ చేయడం చూస్తే, కుప్పం నియోజకవర్గానికి మాత్రం ప్రత్యేక రాజ్యాంగం,చట్టాలు ఉన్నాయా? అని నిలదీస్తూ కుప్పంలో స్థానికేతరులు ఉండరాదన్న చట్టం, నిబంధనలు వైసీపీకి వర్తించావా?అని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యo వెంకటసుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు.
కడప నగరంలోని జిల్లా తెదేపా కార్యాలయంలో బుధవారం రెడ్యo విలేకరులతో మాట్లాడుతూ….. కుప్పం మున్సిపాలిటీ 14 వ వార్డ్ తెదేపా అభ్యర్థి సంతకం ఫోర్జరీ చేసి వైసీపీ ఏకగ్రీవం చేసుకుంటే, జిల్లా యంత్రాంగం నిసిగ్గుగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా,దీనిని ప్రశ్నించి నిరసన తెలియజేసిన మాజీ మంత్రి అమర్ నాధ్ రెడ్డి, తెదేపా చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు పులిపర్తి నాని తదితరులపై పోలీసులు కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని రెడ్యం విరుచుకుపడ్డారు.
స్థానికేతరులన్న సాకుతో అమర్నాధ్ రెడ్డి,పులిచెర్ల నానిలను అర్ధరాత్రి వాహనాల్లో బలవంతంగా తరలించిన పోలీసులకు వైసీపీ గెలుపు కోసం అధికార దుర్వినియోగం చేస్తున్న వైసీపీ అగ్రనేత లైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తంబళ్లపల్లె, మదనపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, నవాబ్ భాష, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప తదితరులు కనిపించడం లేదా! వారిని ఇక్కడి నుండి ఎందుకు తరలించలేదు, స్థానికేతర సమస్య తెదేపా కేనా..? వైసీపీకి వర్తించదా..?అని రెడ్యం ప్రశ్నల వర్షం కురిపించారు తెదేపా అధినేత చంద్రబాబునాయుడుపై అక్కసుతో ద్వేషంతో ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేయాలా..?అని రెడ్యం మండిపడ్డారు.
కుప్పంలో చంద్రబాబు పర్యటనకు వేలాదిమంది ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడంతో, తెదేపా గెలుపు ఖాయమైంది అన్నారు. దీంతో బెంబేలెత్తిన వైసీపీ ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేసి దొడ్డిదారిన చైర్మన్ గిరి సంపాదించేందుకు, అడ్డదారులు తొక్కుతూ ప్రజాస్వామ్యాన్ని చట్టాల్ని కూనీ చేసేందుకు ప్రయత్నించడం, వైసీపీ మార్క్ నీచ రాజకీయమని రెడ్యం తీవ్రంగా విమర్శించారు.
వైసీపీ నేతలకు, ప్రభుత్వానికి దమ్ము,ధైర్యం ఉంటే ప్రస్తుతం జరగనున్న మున్సిపల్,స్థానిక ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ లకు సంబంధించి స్థానికేతరులు ఎవరు లేకుండా స్థానికులతోనే ఎన్నికలు జరపాలని రెడ్యo సవాల్ విసిరారు. చంద్రబాబు ను ఓడించాలని వైసీపీ అడ్డదారులు తొక్కితే వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయని రెడ్యం తీవ్రంగా హెచ్చరించారు .
ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసాపేట శివ, టిడిపి పెండ్లిమర్రి మండలం అధ్యక్షుడు, చెర్లపల్లి సర్పంచి సంగటి గంగిరెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ నగర అధ్యక్షుడు చిట్వేలి అనిల్ బాబు, పొలతల ఆలయ మాజీ చైర్మన్ వడ్డెమాని విశ్వనాధ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.