– వెంటనే వెనక్కి తీసుకోవాలి
– ఎంపీ వద్దిరాజు
ఢిల్లీ: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపణలు నిరాధారమైనవని, వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. .మంత్రులు తుమ్మల, అడ్లూరి లక్ష్మణ్, లోకసభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిలు.. బీఆర్ఎస్, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అర్థంపర్థం లేనివని ఆయన కొట్టిపారేశారు.
ఎంపీ రవిచంద్ర ఢిల్లీలో సోమవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ రావు ఢిల్లీ పర్యటనను ఉద్దేశించి కాంగ్రెస్ నాయకులు ఇష్టారీతిగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించారు. .మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడి జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరుతుండడాన్ని తామంతా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని ఎంపీ రవిచంద్ర చెప్పారు.
చాలా రోజుల తర్వాత కేసీఆర్ సభ పెడుతుండడంతో కాంగ్రెస్ నాయకులు దిక్కుతోచని స్థితిలో భీతిల్లిపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరడం వెనుక ఉద్దేశమేమిటో విజ్ఞులైన తెలంగాణ ప్రజలకు బాగా తెలుసునని ఎంపీ వద్దిరాజు వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్,10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపునకు సంబంధించిన కేసుల గురించి సీనియర్ న్యాయవాదులు శేషాద్రి నాయుడు,సుందరంలను కలిసి మాట్లాడడానికి తాను,మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ రావడం జరిగిందన్నారు. .హరీష్ రావు రైతన్నలకు రైతుభరోసా విడుదలలో చోటుచేసుకుంటున్న మరింత జాప్యం, మొక్కజొన్న పంటను కొనుగోలు చేయకపోవడం, ప్రభుత్వం సరిపడు యూరియా సరాఫరాలో విఫలమవ్వడాన్ని ఎత్తిచూపితే, మంత్రి తుమ్మల సరైన సమాధానం చెప్పకుండా ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడడం విచారకరమని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు..
బీఆర్ఎస్ రాజకీయ పునర్జన్మ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయి మంత్రి మాట్లాడారని, బీఆర్ఎస్, కేటీఆర్,హరీష్ రావులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎంపీ రవిచంద్ర డిమాండ్ చేశారు.కాంగ్రెస్ నాయకుల మాదిరిగా డబుల్ గేమ్ ఆడడం,మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడం తమకు రాదని, ప్రభుత్వం తీసుకువచ్చిన డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తూనే కేంద్ర మంత్రి ఇంట్లో జరిగిన విందుకు హాజరు కావడాన్ని ఎంపీ వద్దిరాజు ప్రశ్నించారు.