“శ్రమె మూలము
మానవ శ్రమె జీవము
సంస్కృతికాధారము
నాగరికత సారము”
ఒకొకసారి నాగరికతకు సంస్కృతికి నడుమ విభజన రేఖలు తెలియనంత సున్నితంగా వుంటాయి. మనం ముందుకు వెడుతున్నామా? వెనుకకు మళ్ళుతున్నామా? అనే సందేహం కూడా కలుగుతుంటుంది.
గత ప్రజాసాహితి (అక్టోబరు 2012) సంచికలో వి. వెంకట్రావు రాసిన అన్నీ నిజాలే’ కథ అద్దెగర్భం చుట్టూ నడుస్తుంది. ఆధునిక విజ్ఞానశాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా, ఒక పేద స్త్రీ, కూలీకి గర్భాన్ని మోయటం, చివరికి కడుపులోని పసిగుడ్డు ఆడపిల్ల అని తెలియగానే ఆమెను పట్టించుకోకపోవటం -నాగరికతకూ సంస్కృతికీ నడుమ అంతరాన్ని సూచిస్తుంది.గర్భస్థ శిశుహత్యలు పూర్వం వినిపించేవికాదు. దళారీ ధనసంస్కృతి యొక్క క్షీణవిలువగా ఇవి తలెత్తి స్త్రీ – పురుష నిష్పత్తిని ప్రమాదకర అంచులదాకా తీసుకువెళ్ళాయి.
కె.వి. రమణారావు రాసిన మా అత్తగారూ – వీరేశలింగం కథలో శ్రమను గౌరవించే ఉన్నత నాగరీకునిగా ప్రవర్తిద్దామని చూసిన పాత్రను, శ్రమను నీచమైనదిగా భావించి అగౌరవపరిచే ఫ్యూడల్ భావజాల సంస్కృతి వెనక్కి లాగి పడుతుంది. ప్రగతిశీల నాగరికతకు, అభివృద్ధనిరోధక సంస్కృతి గుదిబండలాంటిదని రుజువుపరిచే కథ యిది.
“వేలమైళ్ళ దూరంలో మనిషికీ మనిషికీ నడుమ ఇంటర్నెట్ ఒకే గదిలో మనసుకీ మనసుకీ మధ్య వేలమైళ్ళు”అని ఎక్కడో చదివిన గుర్తు. పై కవితాపంక్తిలో మనుషుల్ని దగ్గర చేస్తున్నది నాగరికత అనుకుంటే, దూరంచేస్తున్నది సంస్కృతిగా భావించొచ్చు.
వంద సంవత్సరాల క్రితం విదేశాలకు (సాధారణంగా ఇంగ్లండ్) వెళ్ళి చదువుకోవటానికి ఓడల్లో ప్రయాణం చేయవలసివచ్చేది.అక్కడికి క్షేమంగా చేరినట్టు ఉత్తరం రాస్తే… బయలుదేరిన రెండునెలలకు గానీ అది ఇంటికి చేరేది కాదు. ఇక్కడివారు తెలుసుకునే సమాచారం నెల రోజులు వెనకటిదన్న మాట! ఇప్పుడు ఒక్కరోజు ప్రయాణం చాలు. ఇక సమాచారం రేడియోల్లో రన్నింగ్ కామెంట్రీలాగా వినవచ్చు. మనుషులనూ ఇంటినీ అంతర్జాలం తెరమీద చూస్తూ కూడా మాట్లాడుకోవచ్చు. మన పిల్లల్ని అమెరికా,ఆస్ట్రేలియా లాంటి చోట్ల ఇప్పుడు చంపేస్తున్నట్లుగా అప్పుడు లేదనుకోండి. అయినా ఆనాడున్నంత నిబ్బరంగా ఈనాటి
మనుషులుండగలుగుతున్నారా?
త్రిపురనేని రామస్వామి ఉన్నవ లక్ష్మినారాయణ ఐర్లాండ్ దేశరాజధాని డబ్లిన్లో, (గాంధీ, నెహ్రూ, టంగుటూరి ప్రకాశం లాంటి వారు అనేకమంది ఇంగ్లాండ్ వెళ్ళి) చదువుకున్నారు. ఆనాటికి ఇంగ్లాండ్ దేశం కాలం చెల్లిన భూస్వామ్య సంస్కృతినుండి చాలావరకు బయటపడింది. వైజ్ఞానిక సాంస్కృతిక పునరుజ్జీవనంతో నిండిన అక్కడి ప్రజాస్వామ్య సంస్కృతి మన వారిని ఆకట్టుకుంది.
స్వతంత్ర దేశస్తులకుండే ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం (కెరీర్ సంగతికాదు) మన దేశస్తులకు ఎందుకు లేవా? అని వీరు తలపోశారు.జాతీయ, సాంఘిక సమానత్వ భావాలను వ్యాప్తి చేశారు. మాలపల్లి’ నవలను ఉన్నవ రాసి , భూస్వామ్య వ్యవస్థ,దాని సంస్కృతీ సృష్టించిన కులవ్యత్యాసాలు, జాతీయ స్వాతంత్ర్య సాధనకు అవరోధాలని చెప్పాడు.తాను నాస్తికుడు కాకపోయినా,తక్కెళ్ళ జగ్గడు పాత్ర ద్వారా సోషలిస్టు భావాలనూ, చారిత్రక భౌతికవాదాన్ని 90 ఏళ్ళ క్రితం తెలుగునాట ప్రవేశపెట్టాడు. త్రిపురనేని బ్రాహ్మణేతర ఉద్యమానికీ, హేతువాద భావాలకీ పునాదులు వేసి కులవ్యవస్థను బీటలు వారేట్టు చేశారు. ఇరువురూ తమతమ పద్ధతుల్లో సాంఘిక సంస్కరణలకై కృషిసల్పారు. వారి నడుమ భిన్నాభిప్రాయాలుండినా వ్యక్తిగతంగా మంచి స్నేహితులుగా వుండేవారు.
ఒకప్పుడు ఇంగ్లీషు చదువుల్ని నాస్తిక విద్య అనుకున్నవారున్నారు. (గురజాడకథ – మీపేరేమిటి?) ఇప్పుడు విద్యాలయాలు మెట్టుమెట్టుకీ కులమత తత్త్వాలను బొట్టుబొట్టుగా ఎక్కిస్తున్నాయి.అప్పుడు ఇంగ్లాండ్ దేశంలో చదువుకున్నవారు భారతదేశంలో ఇంగ్లీషు పరిపాలన కూడదనుకున్నారు. ఇపుడు ఇక్కడ మన రాష్ట్రంలో చదువుకున్న వారిలో అత్యధికులు (ఆలోచనల వరకైనా) అమెరికాకు పరుగులు పెడదామనుకుంటున్నారు. భారత ఆర్థిక – రాజకీయ వ్యవస్థ అమెరికా గుప్పెట్లో గిజగిజలాడుతుంటే దాన్ని కళకళలాడటంగా భ్రమ పడుతున్నారు. సామాజిక చింతన తరిగి, వ్యక్తి స్వార్ధమే
పరమార్ధంగా మార్చిన క్షీణ ధనస్వామ్య సంస్కృతి లక్షణమిది.
మా చిన్నప్పుడు చదువుకోవటానికి 7-8 కిలోమీటర్ల దూరం నుండి కూడా పాఠశాలకు వచ్చి తిరిగి నడిచి ఇంటికి వెళ్ళేవాళ్ళు.ఆడపిల్లల చదువు తక్కువ. పరీక్షల్లో ఎవరైనా కాపీ కొడితే, వారిని చిన్నచూపు చూసేవాళ్ళు. సంగం జాగర్లమూడి అనే గ్రామంలో పబ్లిక్ పరీక్షలకు తనిఖీ చేసేవారు (ఇన్విజిలేటర్లు) అవసరం లేదు అని విద్యాశాఖే నిర్ణయించింది. అప్పట్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మద్యనిషేధం వుండేది. అయినా చాటుమాటుగా కొందరు తాగేవారు. తాగినవాళ్ళు నలుగురి మధ్యకు రావటానికి
సిగ్గుపడేవారు. వాళ్ళపట్ల చాలా చిన్నచూపుండేది. ఆ కుటుంబంతో వియ్యమందటానికి జంకేవాళ్ళు. నేడు ప్రజల్ని తాగుబోతులుగా మార్చటం వెనుక కేవలం ఆర్ధిక రాజకీయ ప్రయోజనాలే కాదు, స్వార్ధ సాంస్కృతిక ప్రయోజనాల్ని కూడా పాలకులు ఆశిస్తున్నారు.
గురజాడ రాసిన సంస్కర్తహృదయం కథలో సరళ అనే ఒక వేశ్యను సంస్కరించ బూనుకున్న రసాయనశాస్త్ర అధ్యాపకుడు రంగనాథయ్యర్ తానే సంస్కారహీనంగా ప్రవర్తించి, భంగపడిన వెంటనే, నలుగురులో నవ్వుల పాలుగావటాన్ని భరించలేక తన ఉద్యోగానికి రాజీనామా చేసి, ఆ వూరినే వదిలి వెళ్ళిపోయాడు.
కొడవటిగంటి కుటుంబరావు గారు ఒకచోట రాశారు. 70 సంవత్సరాల క్రితం గుంటూరు పట్టణంలో తన చేయి పట్టుకున్నాడని ఒక హెడ్ కానిస్టేబుల్ పై ఒక యువతి కేసు పెట్టింది. సంఘానికి మొహం చూపలేక కస్టడీలోనే ఆ పోలీసు ఆత్మహత్య చేసుకున్నాడు.
దళితులకు ఇప్పుడున్నంత గౌరవం అప్పుడులేదు. బ్రాహ్మలకు అప్పుడున్నంత అహంకారం యిప్పుడులేదు.ఈ సాంస్కృతిక మార్పు వెనుక ఆర్ధిక, రాజకీయాల మార్పులతో పాటు సామాజిక పోరాటా లున్నాయి. స్వాతంత్ర్యోద్యమం, కమ్యూనిస్టు, దళిత ఉద్యమాల ఫలితం యిది.
కొయ్యబొమ్మ పట్టి కొట్టినా పలుకునా? అని ఎడ్ల బండ్లే రవాణా సాధనాలుగావున్న నాగరికత కాలం నాటి వేమన ;మనిషి చేసిన రాయిరప్పకు మహిమకలదని సాగిమొక్కుతు అని రైలు బండ్ల ప్రారంభ కాలపు నాగరికత స్థాయిలోని వాడైన గురజాడ చెప్పివున్నా,నేడు రోదసిలోకి రాకెట్లను ప్రయోగించే శాస్త్రజ్ఞులే రాతి బొమ్మలచుట్టు రాకెట్ల నమూనాలతో ప్రదక్షిణలు చేస్తుంటే, గురజాడ చెప్పినట్లు వారు చిలక పలుకుల వొట్టి శాస్త్రజ్ఞులే తప్ప మరేమీకాదు.
కొద్ది నెలల క్రితం భద్రాచలం దగ్గర ఏటపాకలో అతిరాత్రం’ అనే యజ్ఞాన్ని నిర్వహించిన కేరళకు చెందిన నంబూద్రి బ్రాహ్మలు, అక్కడినుండి యిక్కడిదాకా పాముకోళ్ళు (చెక్కచెప్పులు) తో నడుస్తూ వచ్చారా? కార్లూ రైళ్ళపై ప్రయాణించారా?కాలం చెల్లిన సంస్కతులను పాటించేవారు కూడా ఆధునిక నాగరికత ప్రసాదించిన ఫలితాలనే వినియోగిస్తారు.సంస్కృతికున్నట్లుగా వెనుకకు పరుగులు తీసే లక్షణం నాగరికతకుండదు.
వేటాడితే తప్ప బతుకులేని ఆదిమకాలం మారి, ఆహారోత్పత్తి దశలోకి నాగరికత అభివృద్ధి చెందిన తర్వాత, వేట అనేది సరదా అయింది. గుర్రాలు ప్రయాణ సాధనాలుగా,రాజ్య విస్తరణ యుద్ధాలకు అవసరమైనవిగా వుండిన రోజులలో అరబ్బు దేశాలనుండి మన దక్షిణ భారతావనికి కూడా వాటిని దిగుమతి చేసుకున్నారు. యంత్ర నాగరికత వచ్చిన తర్వాత గుర్రపుస్వారీ అనేది కలవారి సరదాగానూ, క్రీడాంశంగానూ మిగిలిపోయింది.
నాగరికత అభివృద్ధికీ శాస్త్ర విజ్ఞానాలకూ చాలా దగ్గర సంబంధం వుంది గానీ, సమాజంలోని ఆధిపత్య వర్గాలూ – ప్రస్తుత కాలంలో సామ్రాజ్యవాద శక్తులూ, వారి బహుళజాతి కంపెనీలూ – వైజ్ఞానిక ప్రగతిని తమలాభాల గుప్పెట్లో బంధించి మానవాళి వికాసానికి అడ్డుకట్టలు వేస్తున్నారు. శ్రామికవర్గ రాజ్యాలను రాజకీయంగా కూల్చివేసి, సోషలిస్టు సంస్కృతిని, మానవ సంబంధాలనూ వ్యక్తిగత ఆస్తుల దోపిడీ సంస్కృతిగా దిగజారుస్తున్నారు. జీవన విధ్వంసకర అణ్వాయుధాలపై, గ్రహంతరాళాల పరిశోధనలపై
తక్షణ లాభార్జనకు ఉపయోగపడే విధ్వంసకర ప్రయోగాలపై వెచ్చించే ధనరాశుల్ని,సౌరశక్తిని మానవాళికి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంపై లేదు. అందుకు కారణం వారిదంతా ఆర్థిక లాభాపేక్షపైనా రాజకీయ ఆధిపత్యం పైనా దృష్టి తప్ప, మానవాళి ఉమ్మడి ప్రయోజనాలపై లేకపోవటమే గాని మరొకటికాదు.
ఒకనాడు (18-19 శతాబ్దాలలో) పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి పథాన సాగి మానవ సమాజాన్ని ముందుకు నడిపించగా, అది కాలక్రమంలో గుత్తాధిపత్య వ్యవస్థగా పెరిగి , మట్టికాళ్ళ మహారాక్షసి
అనిపించుకున్న సామ్రాజ్యవాద మయింది. తన స్వార్ధ ప్రయోజనాలకు వలస – అర్థవలసలను వెనుకబడిన దేశాలుగానే వుంచి,వాటిని కాలం చెల్లిన భూస్వామ్యం నుండి బయట పడనివ్వకుండా తమ ప్రత్యక్ష పరోక్ష పరాధీన దేశాలుగానే మిగిల్చింది.
సామ్రాజ్యవాదం ఎదుర్కొంటున్న సంక్షోభాల భారాలనన్నీ తన గుప్పెట్లోని మనలాంటి దేశాలపై రుద్ది, తనకు ఎదురొస్తారనే శక్తులను చీలికలు పీలికలు గావించి సాంస్కృతికమైన క్షీణ పతన విలువలను, భయంకర మూఢవిశ్వాసాలను వ్యాప్తి చేస్తోంది.
దీనర్థం చరిత్రనూ, నాగరికతనూ వెనక్కి తిప్పుతున్నారనా? మళ్ళీ నిజాం నవాబుల,జమీందారుల, అగ్రహారీకుల ఆధిపత్యం తిరగబడుతుందా? ఎంతమాత్రం జరగదు. మళ్ళీ ఒంటెద్దుబళ్ళూ, జట్కాబళ్ళూ రావు.కానీ నిలవనీరు పెరిగిపోయి కుళ్ళి కంపుగొట్టి అంటువ్యాధులు ప్రబలినట్టుగా…సమాజ ప్రగతి స్తంభించి పోయినప్పుడు,మన లాంటి దేశంలో ఒక సమగ్రమైన మౌలిక సామాజిక విప్లవం రానందున, మొత్తంగా మానవ సమాజం తగినంత చలన శీలంగా లేనందున కుక్కమూతిపిందెల సంస్కృతి , నీచ విలువల పతన సంస్కృతి నేడు తాండవిస్తోంది. తరతరాల మౌఢ్యాలూ, భక్తి విశ్వాసాలూ, కుల, మతతత్వాలూ, ఆధునిక వస్తువ్యామోహ,సుఖవాద, ధనాధిక్య ప్రదర్శనల వేలం వెర్రితో జతయి, వికట రూపంలో సాక్షాత్కరిస్తున్నాయి. ఈ క్షీణసంస్కృతి మనపై పెత్తనం చేస్తున్న సామ్రాజ్యవాద శక్తులకూ, భక్తులకే కాదు, వారి అడుగులకు మడుగులొత్తే ‘స్వతంత్ర’ రాజకీయ వ్యవస్థ సృష్టించిన సమస్త
వినాయకగణాలకూ అవసరమే.
బ్రిటీషు పాలకులకు వ్యతిరేకంగా భారతీయులూ, పెట్టుబడిదారీ దోపిడీకి వ్యతిరేకంగా కార్మికులూ, భూస్వామ్య దోపిడీకి పెత్తనాలకు వ్యతిరేకంగా రైతుకూలీలు చేతివృత్తులవారూ అగ్రకుల దురహంకారాలకు వ్యతిరేకంగా దళిత-నిమ్నవర్గాలూ సంఘటితంగా పోరాడిన చారిత్రక కాలాల్లో బీజప్రాయంలోనైనా సాంస్కృతిక వికాసాన్ని మనం గమనించగలిగాం. సూక్ష్మకణంలోని జీవశక్తిని రక్షించుకుని, అభివృద్ధి పరుచుకుంటునట్లు వాటి సారాన్ని ఒడిసిపట్టుకుని రెట్టింపులు చేసుకోవాలి. మరొక తేలిక, విడివిడి పరిష్కార మార్గాలు యిందుకు లేవు.
నాగరికత అంటే మానవ సమాజపు నడక!
సంస్కృతి అంటే మానవ సంబంధాల నడత!!
నడకను వేగవంతం చేసేవి సామాజిక విప్లవాలు.
నడతను సంస్కారవంతం కావించేవి సాంస్కృతిక విప్లవాలు.
ఇవి అనివార్యాలే కాదు, అవిభాజ్యాలు కూడా!
– దివికుమార్