Home » గోడగూచీ కథ

గోడగూచీ కథ

పూర్వం ఒక ఊళ్ళో శివదేవుడు అనే గృహస్తుడుండేవాడు అతడు మహా శివ భక్తుడు.రోజు తమ ఊళ్లో ఉన్న శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు.ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి పట్టుకెళ్లేవాడు. శివుడికి వాటిని నైవేద్యంగా అరగింపు చేసేవాడు. అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై పాలను ఇంటికి తీసుకెళ్లేవాడు.ఇలా పరమనిష్ఠతో ప్రతిదినం కుంచెడుపాలను శివుడికి అరగింపు చేసేవాడు.స్వామిని అర్చించేవాడు.
ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్లాల్సిన పని పడింది.దాంతో తాను నిష్ఠగా చేసే శివ పూజ ..శివుడికి పాలని నివేదించే పని ఎలాగా, అని ఆలోచించాడు .ఇంట్లో అందరికన్నా చిన్నదైనా కూతురిని దగ్గరికి పిలిచాడు. పాపా!మేము ఊరికి వెళ్తున్నం.ఊరు నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు .ఇంకో ముఖ్యమైన పని అదేంటంటే మనం రోజూ శివాలయంలో శివునికి పాలను అరగింపు చేసేవాళ్ళం.ఆ పని కూడా నువ్వు చేయాలి అని జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి గోవుపాలను కుంచెడు కొలిచి పాత్రలో పోసుకొని గుడికివెళ్లాలి, అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి.వెళ్తావు కదూ! ఇది మన నియమము తల్లీ!వ్యర్థం కానివ్వకు. ఆటలని, పాటలని అటు ఇటు పరిగెత్తకుండా సావాసకత్తెలతో ఊరంత తిరగకుండా ఇంటిపట్టునే వుండి చెప్పిన పని చేయమ్మ!మరచిపోవు కదూ!మా బంగారంకదూ!అని గడ్డం పట్టుకొని బతిమిలాడి మరీ చెప్పాడు.అలా గుడికి వెళ్ళే పని పాపకు అప్పగించాడు శివదేవుడు.
పాప సరేనంది. శివదేవుడు భార్యతో కలిసి పొరుగూరు వెళ్ళాడు.మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానదులు ముగించుకొని మంచి గోవు పాలను మరగకాచి.చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేతపట్టుకొని తను కట్టుకున్న పలుచని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది.
గర్భాలయంలో కొలువై ఉన్న శివ లింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి .రెండు చేతులెత్తి స్వామికి మొక్కింది.పాల వైపు చేతులు చూపిస్తూ “శివయ్య”!ఇవిగో పాలు నీకోసమే తెచ్చాను ఆరగించవయ్యా!అని శివుడికేసి చూసి చెప్పింది.
ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది. గిన్నెలో ఉన్న పాలవైపు విచిత్రంగా చూసింది. శివయ్య పాలు తాగలేదా!నీకోసమే తెచ్చాను తాగటానికి ఏమిటి ఇబ్బంది?
పాలు అలాగే ఉన్నాయి తాగవా!తాగు తాగు అంటూ శివుడికేసి చూసి పురామయించింది. ఊహు శివుడు తాగలేదు….
చిన్నపిల్ల కదా!ఆ పాపకు చింతమొదలైంది. అమ్మానాన్నలు చెప్పి వెల్లారు వాళ్ళు చెప్పినట్లు నేను చేసాను ఎక్కడ ఏం లోపం జరిగిందో.శివుడేమో ఈ రోజు పాలు త్రాగడం లేదు…? దాంతో పాపకి భయం పట్టుకుంది.శివుడు పాలు త్రాగకపోతే అమ్మానాన్న లతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా! శివుడి వైపు దీనంగా చూస్తూ పాలెందుకు తాగలేదు తాగవయ్య!లింగమూర్తి!అని ప్రాధేయపడింది. పాలు సరిగ్గా కాచలేదా!రుచిగా లేవా…? సద్దిపాలు అనుకున్నవా?పొద్దెక్కిందన లేక పొగ వాసన వస్తుందా.నీళ్లు కలిపానన…?ఆవుపాలు కాదనా…?
పోనీ ఆకలిగా లేదా…?మొగం మొత్తింద?కుంచెడు లేవని?నేనేమైన వీటి మీద మనస్సు పెట్టుకున్నాననా?ఏ చిన్నపిల్ల తెస్తే నేను తాగాలా అని కోపంగా వుందా? ఎందుకు తాగవయ్య…?
అంటూ నిలదీయటం మొదలెట్టింది, పరమశివా..!పసిపాపను చేసి ఏమిటి ఈ సతాయింపు. ఆకలిగా లేదా పోనీ అదైన నోరు తెరచి చెప్పాలి కదా!పోతేపోని ఒక్క గుటక అన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా. అంటూ పాప పరమశివుడిని బ్రతిమాలుతోంది.నువ్వు పాలు త్రాగలేదంటే మా అమ్మానాన్నలు నన్ను కొడతారు అలా కొట్టిస్తావా? నామీద ప్రేమతోనైన త్రాగవా? నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఇలా సాధిస్తున్నావు. ఇవి కాక ఇంకా ఏమైనాకావాల…?అడుగు నిమిషంలో తీసుకొస్తా కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపించకు లింగమూర్తి!మఠంలో పాయసం తింటావా ?విరభద్రుడి జాతరకు నిన్ను పంపిస్తాగా. మా నాయన కదూ!మా శివయ్య కదూ!తాగవయ్య అంటూ అన్నం తినకుండా మారాం చేసే వాళ్ళ తమ్ముడిని వాళ్ళమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ బ్రతిమాలుతోంది. ఏడుస్తోంది.
ఆ పరమేశ్వరుడు పాప అమాయకత్వానికి నవ్వుకున్నాడు కానీ పలకలేదు .ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ వున్నాడు .ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా..? అయిన పరిక్షిస్తూ వున్నాడు పాప కిందపడి అల్లరిచేస్తూ ,గిలాగిలా కొట్టుకోసాగింది.ఈ శివుడు పాలు త్రాగమంటే బెల్లం కొట్టిన రాయిలా వున్నాడు…? నాన్నగారు వస్తే నన్ను కోపగిస్తారు అని ఏడవ సాగింది.స్వామి వైపు చూస్తూ మా వాళ్ళు నన్ను చంపేస్తారు నువ్వు ఈ పాలు తాగలేదంటే నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు, నాన్నగారు పదేపదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం ఖాయం, అంతకంటే ఇక్కడ నీ ముందే చావడం మేలు అని తలను శివలింగానికేసి బాదుకుంది.
సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆగకుండా పాపను పట్టుకొని ఆపాడు.ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడ్డాడు. గిన్నెను తీసుకొని పాలాన్ని తాగేశాడు. పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది. శివుడు ప్రత్యేక్షమయ్యాడు కానీ ఆ రూపం అరుదైనది అని పాపకు తెలీదు.ఆయన దేవుడని పిలిస్తే పలుకుతాడు పెట్టినవన్నీ తింటాడు మన మాట వింటాడు, అంటూ ఆనందించింది పాప. పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త నాలుగైదు రోజులయింది, పాప రోజు తానే పాలు తేవడం శివుడికి నివేదించడం అది శివుడికి నచ్చింది ఇలా ప్రతి రోజు పాలు తేవడం శివుడు త్రాగడం జరిగి పోతున్నాయి.
ఒకరోజు ఊరెళ్లిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో పాప పాలను శివుడికి అరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది.అమ్మానాన్నలని చూసి ఎగిరిగంతేసింది. ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాలగిన్నెను చూసాడు.పాత్రలో పాలు లేవు ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడిగాడు.పాప గుడిలో శివుడు పాలు త్రాగిన వ్యవహారం అంత చెప్పింది.శివదేవుడు పాప మాటలు నమ్మలేదు. శివుడు పాలు త్రాగడమేంది…? నువ్వు ఏదో అబద్దం చెప్పుతున్నావ్. శివుడి పేరు చెప్పి నువ్వే త్రాగేశావా లేదానిజం చెప్పు! శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ…అంటూ ఆగ్రహంతో కూతురును అనరాని మాటలన్నాడు.పాప ఎంతచెప్పినా పాప మాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్లారు. రోజుటిలాగే పాప పాలను శివుని ముందు ఉంచింది.లింగమూర్తి అరగించవయ్యా అని పిలిచింది. స్వామి పలకలేదు, అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వచ్చింది.
ఓసి!రోజు పాలు త్రాగే శివుడు ఇవాళ త్రాగలేదే…?చూడను కూడా లేదు…? కన్నతండ్రినే అబద్దపు మాటలతో మోసం చేస్తావా, ఎన్ని కథలు చెప్పి మోసం చేసావే పాపిష్ఠిదాన… ఎంత శివ ద్రోహం చేసావే, శివుడికి తెచ్చిన పాలను నీపొట్టలో పోసుకున్నావా, ఉండు నీ పని చెప్పుతా ఎంత నాటకం ఆడావే నిన్ను వూరికే వదిలి పెట్టను నీ పొట్ట చీలుస్తా ! అంటూ ఆక్రోశంతో పాప మీదకు ఉరికాడు ఆ తండ్రి. పాప భయంతో వణకిపోయింది. ఎటు వెళ్లాలో తేలిక గట్టిగా ఏడుస్తూ హా!లింగ!హా!లింగ! అంటూ లింగస్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది.ఇదిగో నేనున్నాను అంటూ భయపడకు అత్యంత దయతో మహాలింగ మూర్తి పాప మీద వాత్సల్యంతో తన వక్షస్థలాన్ని తెరిచాడు పాప అందులోకి చొరబడింది.
తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకున్నాడు.ఎక్కడికి పోతావే అంటూ ఇవతలకి లాగబోయాడు అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది.వెంటనే ఆ దివ్యలింగం ఆ పాప మాయమైపోయింది. ఎంతో నిశ్చలమైనది ఆ పాప భక్తి అమాయకత్వం.అదే శివుడికి ఇష్టమైనది అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చారు. తనలో ఐక్యముచేసుకున్నాడు.దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది.ఆనాటి నుండి ఆ పాప “గోడగూచి” అనే పేరుతో స్తుతించబడింది.

Leave a Reply