– కోటిపల్లి – నరసాపురం రైల్వే పనులకు పూర్తిస్థాయి నిధులు కేటాయించాలని వినతిపత్రం అం దజేత
– జియం హరీష్ బాలయోగి
కోనసీమ రైల్వే పనుల జాప్యం పై ఆ శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్ళానని అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచ్చార్జ్ జియం హరీష్ బాలయోగి తెలిపారు.ఢిల్లీలోని రైల్వే శాఖా మంత్రి వైష్ణవ్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి కోటిపల్లి – నరసాపురం రైల్వే పనులకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలని వినతిపత్రాన్ని అందజేశానని హరీష్ అన్నారు.కోనసీమ ప్రజల చిరకాల కోరిక అయిన కోనసీమకు రైల్వే లైను తీసుకురావడం కోసం నాన్నగారు దివంగత జియంసి బాలయోగి ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు.
ఆ కృషి ఫలితంగా కోటిపల్లి వరకూ రైల్వే లైను ఏర్పడి కోనసీమ ప్రజల ఆకాంక్షకు బీజం పడిందని కానీ ఆయన అకాల మరణంతో కోనసీమ రైల్వే ప్రాజెక్టు మరుగున పడిందని అన్నారు.అనంతరం ఈ ప్రాజెక్టు పై పూర్తిస్థాయిలో దృష్టి సారించకపోవడం,నిధుల కేటాయించకపోవడం వల్ల రైల్వే పనులపై తీవ్ర జాప్యం జరిగిందని హరీష్ అన్నారు.2014 నుండి 2019 మద్యలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుపై కొంత దృష్టి సారించి నిధులు సాధించడంతో కొంతమేర పనులు జరిగాయని హరీష్ అన్నారు.
అనంతరం వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ ప్రాజెక్టు పనులు మరింత మరుగున పడ్డాయని కేంద్రం నుండి నిధులు సాధించడంలోను,పనులు వేగవంతం చేయడంలోను ప్రజా ప్రతినిధులు విఫలమయ్యారని హరీష్ బాలయోగి అన్నారు.ఈ ప్రాజెక్టు పూర్తయితే కోనసీమ ప్రజల ప్రయాణ వ్యయం తగ్గడమే కాకుండా తీర ప్రాంతాలు అధికంగా వుండటం మత్స్య వ్యాపార అభివృద్ధి చెందుతుందని తద్వారా అనేక మందికి ఉపాధి దొరుకుతుందని కావునా కోనసీమ ప్రజల చిరకాల కోరిక నెరవేర్చడం కోసం కోటిపల్లి – నరసాపురం రైల్వే పనులకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయించి,భూసేకరణ పనులు పూర్తి చేసి ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ ను కోరానని హరీష్ బాలయోగి తెలిపారు.