– స్వామీజీ టీటీడీపై రాజకీయ ఆరోపణలు చేయడం భావ్యం కాదు
– టీటీడీ ఖండన
తిరుమల తిరుపతి దేవస్థానాల మీద శ్రీ పరిపూర్ణానంద స్వామి శుక్రవారం చేసిన ఆరోపణలను టీటీడీ తీవ్రంగా ఖండిస్తోంది. స్వామీజీ కూడా టీటీడీ మీద రాజకీయ ఆరోపణలు చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఆయన పలు అంశాలపై ఆరోపణలు చేశారు. వీటికి సంబంధించిన వాస్తవాలను టీటీడీ తెలియజేస్తోంది.
టీటీడీలో మిరాశీ వ్యవస్థలోని వ్యక్తుల్లో కొందరు వారి ఇష్టపూర్వకంగానే ఉద్యోగులుగా మారారు. టీటీడీ అధికారులు ఎవరూ వారిని తక్కువ భావంతో కానీ, చులకనగా కానీ చూడటం లేదు. టీటీడీకి విరాళాల రూపంలో, ఆర్జిత సేవా టికెట్ల రూపంలో, హుండీ ద్వారా వచ్చే సొమ్ముతో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఇప్పటికిప్పుడు జరుగుతున్నది కాదు.
స్వాతంత్య్రానికి పూర్వమే తిరుమల తిరుపతి దేవస్థానాలు విద్యాసంస్థలు నెలకొల్పి సమాజ సేవకు పూనుకున్న విషయం స్వామీజీ తెలియంది కాదు. ఇదే తరహాలో అనేక ఆస్పత్రులు, వృద్ధాశ్రమం, వేద పాఠశాలలు, వేద విశ్వవిద్యాలయం లాంటి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు టీటీడీ నిర్వహించింది.
ఇదే తరహాలోనే పేద పిల్లల ప్రాణాలు కాపాడటానికి రాష్ట్రంలోనే తొలి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేయాలని నిర్ణయించింది. ఆగమ శాస్త్రం లో ఎక్కడ ఇలాంటి విషయాలు ఉండవనీ, మానవ సేవే మాధవ సేవ అనే ఆర్యోక్తి ని స్వామీజీ ఒక సారి గుర్తు చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశంతో గత రెండున్నరేళ్లుగా టీటీడీ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న గో సంరక్షణ కార్యక్రమాల గురించి శ్రీ పరిపూర్ణానంద స్వామికి తెలియక పోవడం బాధాకరం. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున గుడికో గో మాత కార్యక్రమం టీటీడీ నిర్వహిస్తోంది. ఆలయాలకు గోమాత, దూడ ను ఉచితంగా అందించడంతో పాటు, ప్రతి ఆలయంలో గో పూజను అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. గోమాత ను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని 2021, ఫిబ్రవరి 27వ తేదీన ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం సంఖ్య : 426 మేరకు తీర్మానం చేసింది.
టీటీడీ తిరుపతిలో పెద్ద ఎత్తున జాతీయ గో మహాసమ్మేళనం నిర్వహించిన విషయం స్వామిజీ గుర్తు చేసుకోవాలని టీటీడీ కోరుతోంది. ఈ సమ్మేళనంలో గోవును జాతీయప్రాణిగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మరోసారి తీర్మానం చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని గో శాలలను టీటీడీ గో సంరక్షణ శాలతో అనుసంధానం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టడం జరిగింది.
గో ఆధారిత వ్యవసాయానికి అండగా నిలవడానికి టీటీడీ ఇప్పటికే ముందుకొచ్చింది. ఇటీవల స్వామివారి సేవ కోసం నవనీత సేవను ప్రారంభించి శ్రీవారి సేవకుల ద్వారా ఈ సేవను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాం. అదేవిధంగా, గోసంరక్షణలో భాగంగా గో ఆధారిత ఉత్పత్తుల తయారీని టీటీడీ ఇప్పటికే ప్రారంభించింది.
గో సంరక్షణ అంటే గోవధను అడ్డుకోవడమే అనే విషయం స్వామీజీకి చెప్పాల్సిన అవసరం లేదని టీటీడీ స్పష్టం చేస్తోంది. తిరుమలలో సామాన్యులకు సంతృప్తికరమైన దర్శనం కల్పించడానికి టీటీడీ ఎన్నో చర్యలు తీసుకుంది.
మత మార్పిడులు అడ్డుకట్ట వేయడంలో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, బిసి గ్రామాల్లో టీటీడీ ఇప్పటికే 500 కు పైగా ఆలయాలు నిర్మించింది. మరో 500 ఆలయాల నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వెనుకబడిన ప్రాంతాలలోని ఈ కేటగిరీకి చెందిన పేదలను వారి గ్రామాల నుంచి తిరుమలకు ఉచితంగా తీసుకుని వచ్చి స్వామివారి దర్శనం చేయిస్తున్నాము. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం 10 రోజుల పాటు జరిగే వైకుంఠ ద్వార దర్శనం కూడా చేయించాలని టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానం చేసింది.
టిటిడిలో పింక్ డైమండ్ అనేదే లేదని జస్టిస్ వాద్వా కమిషన్, జస్టిస్ జగన్నాథరావు కమిటీ తమ నివేదికల్లో స్పష్టంగా పేర్కొన్నాయి. 1945లో మైసూర్ మహారాజవారు శ్రీవారికి కానుకగా అందించిన ఆభరణంలోని కెంపు మాత్రమేనని అది పింక్ డైమండ్ కాదని ఇందులో స్పష్టం చేసిన విషయం శ్రీ పరిపూర్ణానంద స్వామి గుర్తించాలి.
వేయి కాళ్ళ మండపం అంశం కోర్టులో ఉంది. కావున ఈ విషయాల్లో టిటిడి న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అందువల్ల ఈ విషయంపై చర్చించడం భావ్యం కాదు. ఈ విషయాలన్నీ శ్రీ పరిపూర్ణానంద స్వామికి కూలంకషంగా తెలిసినప్పటికీ మరేదో ఉద్దేశంతో ఆధారరహిత ఆరోపణలు చేయడం సబబుగా లేదు.