Suryaa.co.in

Editorial

సీపీఎస్, పీఆర్‌సీ.. సీరియళ్లూ సిగ్గుపడుతున్నాయ్..నత్తలూ నవ్వుతున్నాయ్!

– టీవీ సీరియళ్ల జీడిపాకంలా కొన‘సాగుతున్న’ చర్చలు
– ఉద్యోగులు తలుపులేసుకుని ఏడుస్తున్నారట
( మార్తి సుబ్రహ్మణ్యం)

అనగనగా సుబ్బారావు. పెద్ద పహిల్వాన్. అతగాడిని చూస్తే ఎమ్మెల్యే నుంచి సీఎం వరకూ వణుకే. అందరినీ రెచ్చగొట్టి తమ పదవులకు ఎక్కడ ఎసరుతెస్తాడోనన్నది వారి భయం. అంతలావు ఎన్టీఓడికే చెమటలు పట్టించినోళ్లు. మనమెంత అని సుబ్బారావుతో సర్దుకుపోయి, చెప్పింది వినేవాళ్లు. అదీగాక సుబ్బారావు వెనుక లక్షలమంది అనుచరులున్నాయె. కానీ తర్వాత ఎవరిమాటా వినని జగమొండి సీఎంగా వచ్చాడు. సొంత వారినే లెక్కచేయడని తెలిసినా.. తన మాట జవదాటని, తాను అందరికీ చెప్పి

రెండుచేతులతో ఓట్లేయించి గెలిపించినవాడు కాబట్టి తాను చెప్పింది వింటాడని పాపం సుబ్బారావు అనుకున్నాడు. కానీ మూడేళ్లలో అసలు తన వైపు చూడటం గానీ, తాను వెళితే పలకరించకపోవడం గానీ చేయకపోవడంతో సుబ్బారావు ఖంగుతిన్నాడు. ఈలోగా అందరికీ సుబ్బారావు సంగతి తెలిసిపోయింది. అది పులి కాదు పిల్లి అని!

‘ఏప్రిల్ 1 విడుదల’ సినిమాలో బట్టలసత్తి చెప్పినట్లు.. సుబ్బారావుకు ఉన్న కండలన్నీ ఒరిజినల్ కాదని, చంకలో సెగ్గడ్డలు రావడంతో అవి అంతలావయ్యాయని జనాలకు తెలిసిపోయింది. అటు తన సంగతి జనాలకు తెలిసిపోయిందన్న సంగతి, మన సుబ్బారావు వస్తాదుకూ తెలిసిపోయింది. జనం కూడా చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి మాదిరిగా, ‘నువ్వు ఉరిమి చూసినా ఒకటే నేను ఊరక చూసినా ఒకటే’నని సుబ్బారావును లైటు తీసుకుంటున్నారు. అయినా సరే.. నేను లేస్తే మనిషిని కాదని రోడ్డు మీద నిలబడి బిల్డప్పులు ఇవ్వాల్సిన పరిస్థితి. అటు సుబ్బారావు చెప్పినట్లు వినే అనుచరులు మాత్రం, సుబ్బారావు మాట వినడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని కుమిలిపోతూ, నోట్లో గుడ్డలు కుక్కుకుని తలుపులేసుకుని ఏడుస్తున్నారట. మా ఏడుపేదో మేం ఏడుస్తుంటే, మధ్యలో ఈ సోషల్‌మీడియా సెటైర్లేందని తెగ ఉడుక్కుంటున్నారట. ఎందుకంటే సర్కారు- ఉద్యోగ నేతల చర్చల మధ్య, ‘రజనీకాంత్

సినిమా బిట్లు’ వేసి మరీ సోషల్‌మీడియా నవ్వులు పూయిస్తోంది మరి!

సీన్ కట్ చేస్తే ఏపీ ఉద్యోగ సంఘ నేతలు- సర్కారు పెద్దలకూ సీపీఎస్-పీఆర్సీ మధ్య చర్చలు.. కావ్యాంజలి, ఎన్నెన్నో జన్మలబంధం, అభిషేకం, అత్తారింటికి దారేదీ, గృహలక్ష్మి, కార్తీకదీపం వంటి తెలుగు టీవీ సీరియళ్లు కూడా సిగ్గుపడేలా యమా సీరియస్‌గా, మధ్య మధ్యలో కామెడీ సీన్లతో

విజయవంతంగా కొన‘సాగుతున్నాయి’. ఎలాంటి స్క్రిప్టు లేకుండా, ఒక సీరియల్‌ను ఇంతకాలం ఆవిధంగా లాగించవచ్చన్నది టీవీ సీరియల్ నిర్మాతలకూ తెలిసింది. అటు ‘అంత స్పీడుగా జరుగుతున్న చర్చలు’ చూసి, నత్తలు కూడా నవ్వుకుంటున్నాయట. రెగ్యులర్‌గా సర్కారు సలహాదారు సజ్జలన్న, సీఎస్ శర్మన్న, ఐఏఎస్ రావతన్న, మధ్యలో అప్పుడప్పుడు ఆర్ధికమంత్రి బుగ్గన్న రాజేంద్రనాధ్‌రెడ్డన్న, అప్పులు తెచ్చే సత్యనారాయణన్న ఉద్యోగ సంఘాలతో చర్చలు కొన‘సాగిస్తున్నారు’. సరే పేరుకు ఆర్ధికమంత్రి ఉన్నా, పెత్తనమంతా సజ్జలన్నదే కాబట్టి.. ఆర్ధికమంత్రి చర్చలకు పిలిస్తే ఉ.స.నా (ఉద్యోగ సంఘ నాయకులు)లు లైటు తీసుకుంటున్నారట.

తమ సమస్యలపై ఎక్కడ మీటింగు పెట్టినా సజ్జలన్న ‘మధ్యలో ఫోన్ చేసి’, యోగక్షేమాలు అడుగుతున్నారు కాబట్టి.. ఎలాగూ ముఖ్యమంత్రి జగనన్నను దర్శించుకుని తరించే భాగ్యం లేదు కాబట్టి..
sajjala-employes ఆర్ధికమంత్రి, సీఎస్‌కు పెద్దగా పవరు లేదు కాబట్టి.. సజ్జలన్నే ఇప్పుడు ఉ.స.నాకు ముఖ్యమంత్రి కింద్ర లెక్క. ఆయనతో మాట్లాడితే, జగనన్నను దర్శించుకున్నట్లే లెక్క. కాబట్టి ఆయన కాకితో కబురంపినా రెక్కలు కట్టుకుని వాలాల్సిందే.

ఆవిధంగా ముందుకువెళుతున్న ఉ.స.నాలు అలా చర్చలకు వెళ్లడం.. టీ బిస్కెట్లు తిని సాయంత్రానికికల్లా బయటకు రావడం.. ఏమీ సాధించకుండానే చేతులూపుకుంటూ బయటకువచ్చే తమ
employes నాయకులను చూసి, ఉద్యోగులు హీరో రాజేంద్ర ప్రసాద్ మాదిరిగా పళ్లు పటపటా కొరకడం.. దానితో ఉ.స.నాలు ఫేసు మార్చి ‘ఇక వీళ్లతో చర్చలుండవ్. సీఎం పిలిస్తేనే చర్చలకు వెళతాం. ఉద్యోగులంటే సర్కారుకు తమాషా అయిపోయింది.జగనన్న సీఎం కావాలని రెండుచేతులతో ఓట్లేసి, ఓట్లేయిస్తే మాకు మాబాగా బుద్ధి చెప్పా’రంటూ మీడియా ముందు గర్జించి, నుదురుమీద పడ్డ జుట్టును బాషాలో రజనీకాంత్ మాదిరిగా వెనక్కి సవరించుకుని వెళ్లడం రొటీన్‌గా మారింది.

ఈ రొటీన్ సీన్లు చూసి విసిగిపోయిన మీడియా ప్రతినిధులు కూడా ఉ.స.నాలు ప్రెస్‌మీట్లకు పిలిస్తే, ‘విషయం లేని వారి దగ్గర వివరం’ ఉండదన్న ముందుచూపుతో వెళ్లడం మానేశారట. అంత పొడిచే విషయం ఉంటేనే చెప్పండి వస్తాం. లేకపోతే ప్రెస్‌నోట్ పంపించమని లైటు తీసుకుంటున్నారట. అటు ఉద్యోగులు కూడా ‘ఆయనే ఉంటే మంగలెందుకున్నట్లు’ తమ నాయకుల శక్తి తెలిసి ఖాతరు చేయడం మానేశారట.

అయినా.. ఆశకూ హద్దు ఉండద్దూ?! ముఖ్యమంత్రి జగనన్నను కలవాలనుకోవడం ఆశ కదూ? ఆశ మంచిచే అత్యాశే పనికిరాదు. పెద్ద పెద్ద మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకే దిక్కు లేదు. జగనన్నది అదానీ, నత్వానీ స్థాయి. అయినా జగనన్న ఏమైనా చంద్రన్ననా ఏంటి? ఇంటి అల్లుళ్ల మాదిరిగా ఎప్పుడటంటే అప్పుడు పిలిచి పెద్దపీట వేయడానికి! అసలు అప్పటికీ ఉ.స.నాలకు సజ్జలన్నే ఎక్కువ. అప్పటికీ ఎన్నికల ముందు సీపీఎస్ గురించి తెలియక హామీ ఇచ్చామని సజ్జలన్న నిజాయితీగానే చెప్పినా, ఇంకా సీపీఎస్ గురించి అడిగితే ఎట్లా?

సమయానికి జీతాలిస్తున్నాం. సంతోషించమని అప్పటికీ బుగ్గనన్న చెప్పినా, ఆయన కవి హృదయాన్ని అర్ధం చేసుకోకుండా.. మాకు ఇంత కావాలి. అంతకావాలని సర్కారు గొంతుపై కత్తి పెడితే ఎలా? గొంతుపై కత్తి పెడితే బెదిరిపోవడానికి అక్కడ ఉంది బాబన్న కాదు, జగనన్న. ఆ విషయం దృష్టిలో ఉంచుకుని చర్చలు జరిపితే అందరి ఆరోగ్యాలకూ మంచిది.

బుగ్గనన్న చెప్పినట్లు ఇప్పటి పరిస్థితిలో జీతాలిచ్చుడే ఎక్కువ కాబట్టి, ఉద్యోగులు తలా ఇంత చందాలేసుకుని, వారానికోసారి అన్ని గుళ్లలో ‘జగన్నామస్మరణ’ చేసి, వందేసి కొబ్బరికాయలు కొట్టాలి. అప్పుడు జగనన్న కరుణించి పదో, పరకో పీఆర్సీ ఇస్తే ఉద్యోగుల జన్మ ధన్యమయినట్లే. ఒక్కమాటలో చెప్పాలంటే.. జగనన్న విసిరింది తీసుకుని, నవరంధ్రాలూ మూసుకోవడమే. అంతకుమించిన దారిలేదు. కొంచెం… వాడండి బ్రొ!

LEAVE A RESPONSE