సమస్యల వలయంలో ఆర్బీకే సెంటర్లు

అద్ధెభవనాలకు డబ్బులివ్వని సర్కారు
ఖాళీ చేయిస్తున్న భవన యజమానులు
వైసీపీ నేతల ఇళ్లలోనే ఆర్బీకే భవనాలు
అయినా సరే ఖాళీ చేయిస్తున్న వైసీపీ నేతలు
ఉద్యోగుల పాట్లు వర్ణనాతీతం
రాజధాని జిల్లాలో ఇదో దా’రుణం’
( మార్తి సుబ్రహ్మణ్యం)

తమ్ముడు తమ్ముడే. పేకాట పేకాటనే. ఎక్కడయినా బావ గానీ వంగతోటకాడ కాదన్నట్లు… తమ పార్టీ అధికారంలో ఉన్నా సరే.. అద్దెకు ఇచ్చింది తమ భవనాలే అయినా.. అద్దెలివ్వకపోతే ఖాళీ చేసేయమని ప్రభుత్వానికే నిర్మొహమాటంగా చెబుతున్న పరిస్థితి. అద్దెలివ్వకపోతే ఏ పార్టీ అయితే మాకేంటీ అన్నట్లు.. అద్దెలు కట్టని ప్రభుత్వ భవనాలకు తాళం వేసి పోతున్న వైచిత్రి ఇది. అవును మరి ఎవరైనా ఎన్నాళ్లని ఎదురుచూస్తారు? సొంత పార్టీనే కదా.. కొంచెం ఎక్కువ డబ్బులకు అద్దెకిస్తే పార్టీకి చేసిన సేవకు.. ఆ అద్దెలకు ‘లెవలయిపోద్ద’ని వైసీపేయులు ఆర్బీకే సెంటర్లకు తమ సొంత ఇళ్లు అద్దెకిచ్చారు. ఏళ్లూ.. పూళ్లూ అవుతున్నా.. సర్కారు అద్దె చెల్లించదాయె. ఎంత జగనన్న అయినా.. లాభం లేకపోతే ఎంతకాలమని మోస్తామనుకున్నారో ఏమో.. చెప్పా పెట్టకుండా ఆర్బీకే సెంటర్లకు తాళాలు వేశారు. అద్దె చెల్లించకపోతే యజమానులు తాళాలు వేశారు సరే.. మరి అందులో పనిచేసే ఉద్యోగులు ఎక్కడ కూర్చోవాలి? ఇప్పుడదే పెద్ద సమస్య. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బ్రహ్మాండమని ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ఏపీ సీఎం జగన్.. మరి ఇప్పటికయినా ఆర్బీకే సెంటర్లకు ఇవ్వాల్సిన అద్దె బకాయిలు ఇస్తారా.. ఇదే ఇప్పుడు వైసీపేయుల ఆశ.

రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటు ధరలో ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు.. నిర్వహణ లోపాలతో ఇబ్బందులు పడుతున్నాయి.నెలల తరబడి అద్దె చెల్లించకపోవంతో చాలా చోట్ల భవన యజమానులు తాళాలు వేస్తున్నారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 5కోట్ల మేర అద్దె బకాయిలు పేరుకుపోవటంతో.. యజమానులు లబోదిబోమంటున్నారు.బిల్లులు ప్రభుత్వానికి పంపామని, నిధులు వచ్చిన వెంటనే చెల్లిస్తామని సిబ్బంది చెబుతున్నా.. ఎన్నాళ్లు ఇలా అని ప్రశ్నిస్తున్నారు. ఫలితంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న రైతు భరోసా కేంద్రాలు.. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. నిర్వహణ లోపాలు, అద్దె బకాయిలతో చాలా చోట్ల వాటి మనుగడే ప్రశ్నార్థకం అవుతోంది.ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.

ప్రభుత్వ భవనాలు లేకపోవటంతో చాలాచోట్ల అద్దె భవనాల్లోనే ఆర్బీకేలు నడుస్తున్నాయి. 3 జిల్లాల్లో కలిపి 1080 ఆర్బీకేలు ఉండగా.. అందులో 600కు పైగా అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి.గ్రామాల్లో 2వేల5వందల నుంచి 4వేల వరకు ఆర్బీకేలకు అద్దె చెల్లిస్తున్నారు. ప్రారంభంలో బాగానే ఉన్నా.. తర్వాత ఇబ్బందులు తలెత్తాయి.

సుమారు ఏడాదికిపైగా అద్దెను చెల్లించకపోవడంతో.. యజమానులు తాళాలు వేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయమని తక్కువ అద్దెకు ఇస్తే.. బకాయిలు పెడతారా అని ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే కుదరదని తేల్చిచెబుతున్నారు.దీంతో సిబ్బంది గ్రామ సచివాలయంలోనో.. లేకపోతే పక్క గ్రామంలోని ఆర్బీకేల నుంచి పనిచేయాల్సి వస్తోంది.

ఆర్బీకే అద్దె భవనాలకు పల్నాడు జిల్లాలో రూ.2.50 కోట్లు, గుంటూరు జిల్లాలో రూ.1.30 కోట్లు, బాపట్ల జిల్లాలో రూ.1.20కోట్ల అద్దె చెల్లించాల్సి ఉంది. కొన్నిచోట్ల ఆర్బీకేలకు విద్యుత్తు బిల్లులు చెల్లించటం లేదు.నెలవారీగా బిల్లు చెల్లించడానికి సొమ్ము విడుదల చేయకపోవడంతో విద్యుత్తుశాఖ అధికారులు సరఫరా నిలిపివేస్తున్నారు.

ఆర్బీకేలకు తాళాలు వేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సీజన్‌ ప్రారంభం కావడంతో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు దొరక్క.. ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా లోపాలను సరిదిద్ది ఆర్బీకేలను అందుబాటులోకి తీసుకురావాలని.. లేకపోతే ఆర్భాటపు ప్రచారాలైనా మానుకోవాలని రైతులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.

Leave a Reply