– జాతీయ మానవ హక్కుల కమీషన్ కు, జాతీయ ఎస్సీ కమీషన్ కు లేఖలు రాసిన తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
రాష్ట్రం అక్రమ నిర్బంధాలకు, హౌస్ అరెస్టులకు, తప్పుడు కేసులకు, అర్ధరాత్రి అరెస్టులకు, కస్టోడియల్ వేధింపులకు, చిత్రహింసలకు కేంద్రంగా మారింది. తాజాగా ఉమామహేశ్వరి అనే దళిత మహిళపై చిత్తూరు పట్టణ పోలీసుల కస్టోడియల్ వేధింపులే ఇందుకు నిదర్శనం.
చేయని దొంగతనాన్ని ఆమెపై వేసి రెండు రోజులపాటు స్టేషన్కు పిలిపించి చిత్రహింసలకు గురిచేశారు. ఉమామహేశ్వరి చిత్తూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో ఇంటి పనిమనిషిగా పనిచేస్తున్నారు.
వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో రూ. 2 లక్షలు పోయాయని, చేయని దొంగతనాన్ని అంగీకరించమని దళిత మహిళ ఉమామహేశ్వరిని పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. తర్వాత ఆ డబ్బు వేణుగోపాల్ రెడ్డికి తెలిసిన వారే తీసుకున్నట్లు తెలిసింది. ఆ విషయం తెలిసి కూడా ఉమామహేశ్వరిని పోలీస్ స్టేషన్లో హింసించారు.
పోలీసులు మానవ హక్కుల సూత్రాలను పూర్తిగా విస్మరించారు. అంతేకాదు, అరెస్టులు, కస్టడీయల్ చిత్రహింసలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులను కూడా పూర్తిగా విస్మరించారు. ఈ నేపథ్యంలో ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా.