– సజ్జల సజ్జల రామకృష్ణా రెడ్డి
అమరావతి చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ప్రభుత్వం పిలిచినా ఉద్యోగులు చర్చలకు రాకపోవడం కరెక్ట్ కాదని అన్నారు. ఈ రోజు కూడా పీఆర్సీ సాధన కమిటీ వాళ్ళు చర్చలకు రాలేదని తెలిపారు. తమ పిలుపు మేరకు కొన్ని సంఘాల నాయకులు వచ్చారని, సమస్యలు ప్రస్తావించారని పేర్కొన్నారు. చర్చలకు ఎవరు వచ్చినా మాట్లాడుతామన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో అంతర్భాగమేనని, ఉద్యోగులు, ప్రభుత్వం వేరు కాదని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలి: బొత్స
అమరావతి ఉద్యోగులను చర్చలకు పిలిచినా పీఆర్సీ సాధన కమిటీ వాళ్లు చర్చలకు రాకపోవడం బాధాకరమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉద్యోగులు రాజకీయ ఆలోచన చేస్తున్నారా అని ప్రశ్నించారు. జీతాలు పడితే కదా.. పెరిగేది, తగ్గేది తెలిసేదని, ఎవరికీ కూడా రూపాయి కూడా తగ్గదని మంత్రి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగుల సమస్యల కోసమే కమిటీ వేశామని, ఉద్యోగుల్లో అపోహలు తొలగించేందకు ప్రయత్నాలు
చేస్తున్నామని తెలిపారు. ఉద్యోగులతో చర్చలకు తాము అందుబాటులో ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు. ఘర్షణ వాతావరణం మంచిది కాదని, వాళ్ళు ఎప్పుడు చర్చకు వస్తామంటే అప్పుడే చర్చిస్తామని తెలిపారు.