-ఉద్యోగుల సమస్య సమసిపోవడాన్ని టీడీపీ, కమ్యూనిస్టులు, ఎల్లో మీడియా జీర్ణించుకోలేకపోతున్నాయి
– సమ్మె విరమించాక మళ్ళీ నీచరాజకీయమా..? ఉద్యోగుల సమస్యను పచ్చ, ఎర్ర అద్దాలు పెట్టుకుని చూడొద్దు
– కమిటీలో అన్నీ అంగీకరించి.. ఇప్పుడు కొన్ని సంఘాలు నిరసనలు చేస్తామంటే అర్థముందా?
-కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న కేరళలో ఇస్తున్న హెచ్ఆర్ఏ 4-6-8శాతాలే, మరి ఉద్యోగుల ప్రయోజనాలు మీకు పట్టవా?
-ఉన్నంతలో బెటర్ గా చేశాం.. చేయాల్సినంత చేయలేకపోయాం అని సీఎంగారే చెప్పారు
-ఈ ప్రభుత్వంలో అమ్ముడుపోయేది ఎవరు..? కొనగలిగేదెవరు…? ఉద్యోగులను బెదిరించిందెవరు.. బెదిరేదెవరు..?
– కనీస పనికి కనీస వేతనం ఇవ్వాలనే అంగన్ వాడీల నుంచి ఆశా వర్కర్లు, ఏఎన్ ఎంలు, హోం గార్డులకు జగన్ గారు జీతాలు పెంచారు.
– ఏపీపై కేసినో సంస్కృతిని రుద్దాలని టీడీపీ తహతహలాడుతోంది
-సంక్షేమ పథకాల అమలులో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం తప్పా, దుబారానా..? ధైర్యముంటే చెప్పండి
-టీడీపీ నాయకుడు వినోద్ జైన్ లైంగిక వేధింపులకు ఓ విద్యార్థి బలి అయితే పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించలేదు?
-ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి మంత్రుల కమిటీ కొనసాగుతుంది
-సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
ఉద్యోగులను ఓన్ చేసుకునే ప్రభుత్వం..
ఉద్యోగుల ఆవేదనను అర్థం చేసుకుని ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేయడం, అలాగే ఉద్యోగులు కూడా తమ ఆవేదనను, అసంతృప్తిని వెలిబుచ్చడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులంతా జేఏసీగా ఏర్పాటై సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలో ఏ ప్రభుత్వ హయాంలో చూసినా దాదాపు నోటీసు ఇచ్చి సమ్మె వరకూ వెళ్లిన తర్వాత కొద్దిరోజులు అది నడవడం, దానివల్ల ప్రజలు, ఉద్యోగులు, ప్రభుత్వం అంతా ఇబ్బంది పడటం చూశాం. ఒక సున్నితమైన అంశాన్ని రాజకీయం చేయడం, సమస్య పక్కకు పోయి దాని నుంచి కోలుకోవడానికి సమయం పట్టడం ఇవన్నీ గతంలో చూశాం. అలాంటిది ఉద్యోగుల ఆవేదనను సకాలంలో అర్థం చేసుకుని, స్పందించి, చర్చలు జరిపి, ఉద్యోగసంఘాల నాయకులు కూడా రాష్ట్ర పరిస్థితులను అర్థం చేసుకుని, ప్రభుత్వం కూడా ఉన్నంతలో మంచి చేస్తూ, ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం అనేది బహుశా చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇది జరగడం వెనుక జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం కూడా “ఉద్యోగులను ఎప్పుడూ గుడ్ స్పిరిట్‌తో ఉంచాలని, వారిని ఓన్ చేసుకుని పనిచేసుకునేలా చూడాలి, కష్టమైనా, ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా అయినంతవరకూ వారిని సంతృప్తి పరచాలని చూడటం, అటు ఉద్యోగుల్లో కూడా రెండున్నరేళ్లుగా ఆర్థిక వ్యవస్థ కుదేలయిపోయిన నేపథ్యంలో ఉన్నంతలో బెటర్‌గా ఇచ్చారని, అలాగే మొండిగా పోకుండా చిన్న చిన్న సవరణలు చేయడానికి కూడా ప్రభుత్వం ఒప్పుకుందని వారు కూడా భావించబట్టే ఇది సాధ్యమైంది”. ఇందులో ప్రభుత్వం, ఉద్యోగులు పట్టుదలలు, పంతాలకు పోలేదు, ఇది ఎవరి గొప్పతనం కానే కాదు. అందరూ ఒకేటీమ్లా కలవడం వల్లే ఇది సాధ్యం అయింది. ఇది ఎవరి విజయం కాదు, మరెవరి ఓటమి కాదు.
ఆదాయం ఉంటే.. మీరు అడక్కముందే ఇచ్చేవారు
– ఫైనల్ నిర్ణయం జరిగిన తర్వాత ఉద్యోగులు ఎవరైనా ఇంకా వస్తే బాగుండేది అనుకోవడంలో తప్పులేదు. పోనీ మేము బ్రహ్మాండంగా చేశామని అంటే, అది అన్యాయం అని మీరు అనవచ్చు. స్వయంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడుతూ ఎలాంటి డాంబికాలు పోకుండా ఉన్న పరిస్థితిని వివరించి, ఆర్థిక పరిస్థితి బాగుంటే ఇంకా చేసి ఉండాల్సింది అని అన్నారు. రాష్ట్రం సొంత ఆదాయం రూ. 85వేల కోట్లు ఉండాల్సిన పరిస్థితి అయితే, కోవిడ్ నేపథ్యంలో రాష్ట్ర సొంత ఆదాయం రూ.62వేల కోట్ల దగ్గరే ఆగిపోయింది. మరోవైపు రాష్ట్రం ఖర్చులకు వస్తే జీతాలు, పేమెంట్లకు సంబంధించి రూ.70వేల కోట్లు దాటిపోయింది. ఇది వాస్తవమైన పరిస్థితి. అందువల్ల ఏమీ చేయలేని నిస్సహాయత. అందువల్ల
తప్పనిసరి అయిన సంక్షేమాన్ని పైసా వృథా కాకుండా డీబీటీ ద్వారా నేరుగా లబ్దిదారులకు అందే ఏర్పాటు చేశాం. ఇది అంతా కలిపి కూడా రూ.40 వేల నుంచి రూ.45వేల కోట్లు అవుతుంది. దుబారా ఎక్కడా లేకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాం. రాష్ట్రానికి రూ.85వేల కోట్ల ఆదాయం వస్తుంటే పరిస్థితి ఇక్కడవరకూ వచ్చేది కాదు. మీరు అడక్క ముందే ఇంకా ఎక్కువ సీఎం గారు ఇచ్చేవారు. దానివల్ల అసలు సమస్యే వచ్చి ఉండేది కాదని ముఖ్యమంత్రిగారు వివరించారు. 27శాతం ఐఆర్ ఇచ్చినప్పుడు కూడా 30శాతం పైన ఇవ్వాలనుకున్నామని, కానీపరిస్థితులు అనుకూలంగా లేవని చెప్పాం. బ్యాలెన్స్ చేయడం అంటే ఉద్యోగుల నోటి దగ్గర నుంచి ఇంకొకళ్లకు పెట్టడం కాదు. వేరేవాళ్లకు ఇస్తూనే ఇటుకూడా వస్తున్నవాటికి తగ్గకుండా పెంచే ప్రయత్నం చేశాం. కాంపోనెంట్, ఐఆర్‌లో ఇబ్బంది ఉందని చెప్పడంతో అవన్ని కరెక్ట్ చేసుకుంటూ వచ్చాం. హెచ్ఆర్ఏ విషయంలోనూ అదే చేశాం.
సమస్య సద్దుమణిగాక నీచ రాజకీయం మొదలైంది
– ఇదంతా అయిన తర్వాత నిన్న, ఇవాళ కొద్ది మంది ఉద్యోగులు, పొలిటికల్ పార్టీలతో అసోసియేట్ అయిన కొంతమంది ఉద్యోగులు, ముఖ్యంగా వామపక్షాలతో అసోసియేట్ అయినవారు … తాము మళ్లీ ఆందోళనబాట పడతామని చెప్పడాన్ని గమనిస్తున్నాం. జేఏసీలో పార్ట్‌గా ఉన్న ఒక సెక్షన్.. టీచర్లను రిప్రజెంట్ చేస్తున్న నాయకులు సమావేశంలో చివరవరకూ ఉండి, సీఎస్ గారు మినిట్స్ లోని అజెండా చదివిన దాకా, ఉండి, ఆ తర్వాత తాము ఒప్పుకోవడం లేదని బయటకు వెళ్ళి మీడియాలో అన్నారట. అది ఎంబ్రాసింగ్ సిచ్యూవేషన్. ప్రభుత్వంతో పాటు జేఏసీకి నాయకత్వం వహించిన నాయకులకు కూడా ఇదే పరిస్థితి ఎదురౌతోంది. ఆ నాయకుల గురించి అవాకులు, చెవాకులు పేలడం. “కొంతమంది అమ్ముడుపోయారని, కొనగలిగారు” అని మాట్లాడటం, అసలు ఆ అవసరం ఎందుకు ఉంటుంది. మా ప్రభుత్వంలో ఆ అవసరం, ఆలోచన ఎందుకు ఉంటుంది. మా ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులు ఇలా ఆందోళన బాట పట్టడం తొలిసారి. పదిరోజులుగా వాళ్లు చేస్తున్న కార్యక్రమాలకు మేము ఏమైనా ఇబ్బందులను గురిచేశామా? అలాగే ఎవరైనా వచ్చి తాము సమ్మెకు వెళ్లేది లేదని చెబితే… మిగతావాళ్లకు నచ్చచెప్పి చర్చలకు రమ్మన్నామే కానీ, మీరు వెళ్లి ఉద్యమాన్ని తప్పుదారి పట్టించండి, చీలికలు తీసుకురండి అని మేం చెప్పలేదు కదా.
ఉద్యోగులు సమ్మెకు వెళ్లకపోవడం ఈ శక్తులకు నచ్చలేదు
– ముఖ్యమంత్రిగారు చెప్పినట్లే.. ఇంకా చేయాలనుకున్నంత చేయలేకపోయాం. ఉద్యోగుల ఎక్స్పట్టేషన్స్ ఎక్కువగా ఉండటం వల్ల… వాటికి అనుగుణంగా రాకపోవడం వల్ల వారికి బాధ కలిగింది. అంతేతప్ప పెరుగుదల లేకుండా కాదు. ఇక్కడ మేము కూడా బ్రహ్మాండంగా చేశామని చెప్పుకోలేదు. నిన్న, ఇవాళ జరుగుతున్నది చూస్తే.. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా.. ఎల్లో మీడియాగా చెప్పుకునే ఈనాడు, ఈటీవీ, ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ5… ఎక్కడెక్కడో ఉన్నవి గుదిగుచ్చి తీసుకువచ్చాయి. తీరా ఇప్పుడు మేము ఒప్పుకోమని ఒక సెక్షన్ ఆఫ్ ఎంప్లాయిస్ అంటున్నారు..? ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే సమ్మెకు నోటీస్ ఇస్తే కార్యాచరణ దశలు వారీగా జరిగి, చివరగా సమ్మె విరమించుకుంటే… అప్పటివరకూ జేఏసీలో భాగస్వామ్యంగా ఉన్న కమిటీ సమ్మె విరమించుకుంటే, వామపక్షాలతో అసోసియేట్ అయినవాళ్లు ఇప్పుడు 27శాతం ఫిట్మెంట్, 12శాతం హెచ్ఆర్ఏ కావాలంటూ దశలవారీగా ఆందోళనలకు దిగుతామని, నల్లబ్యాడ్జీలు పెట్టుకుని నిరసనలు తెలుపుతామంటే దానికి ఏమైనా అర్థం ఉందా? అది సమంజసమేనా? ఎవరు ఏదైనా చేయవచ్చు కాదనడం లేదు? వామపక్ష పార్టీలకు సంబంధించి ఇలాంటివి ఊహించలేదు. ఎందుకంటే ఏ ఉద్యమం చేసినా వారికి ఎంతవరకూ లబ్ది చేకూరుతుందో అంతవరకూ చేయాలి కానీ, తెగేలాగానో, వారి పరిస్థితి ఇంకా దారుణం అయ్యేలాగానో, లేదా ఉలిపిరికట్టెలా ఉంటామంటే ఎలా కుదురుతుంది. అదేమీ పొలిటికల్ పార్టీ కాదు. ఉద్యోగుల సంఘాలు. రాష్ట్రంలో ఎక్కడెక్కడో, ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారంటూ.. ఎల్లో మీడియాలో అన్నీ కలిపి చూపిస్తున్నారు. రాష్ట్రం అంతా అట్టుడికిపోతుందంటూ ఒక ఇంప్రెషన్ ఇచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నాయి. టీడీపీ నుంచి కూడా వాళ్ల క్లైమ్స్ వాళ్లవి వస్తున్నాయి. ఉద్యోగుల సమ్మె జరిగితే నాలుగు పేలాలు ఏరుకోవచ్చు. దాన్ని లాగి రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవచ్చని అనుకున్నాయి. ఎప్పుడైతే సమ్మె విరమణ జరిగిందో వీళ్లకు ఆశాభంగం అయింది. ఉద్యోగులు సమ్మెకు వెళ్లకపోవడం ఈ శక్తులకు నచ్చలేదు.
కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల బడ్జెట్ రూ. 2వేల కోట్లు పెరిగింది
– వాళ్ల కోఆర్డినేషన్ చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. వీరంతా కలిసి ఏం చేయాలనుకుంటున్నారు. మెయిన్ స్ట్రీమ్ సంఘాలన్నీ సమ్మె విరమిస్తే… మిగిలిన రెండు, మూడు సంఘాలు కలిసి ఏం చేయాలనుకుంటున్నాయి. దీన్ని ఎక్కడవరకూ తీసుకువెళదాం అనుకుంటున్నారు. దాంతోపాటు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ను కలుపుకుని వెళతాం అంటున్నారు. మేము ముందు నుంచి చెబుతున్నాం. ఉన్న బడ్జెట్‌కు అనుగుణంగానే ఏ నిర్ణయం అయినా ఉంటుందని. అతి తక్కువ జీతాలు ఉన్నవారికి వారి జీవన ప్రమాణ స్థాయిని పెంచాలనుకునేలా ఆలోచన చేసింది, ఆ విధంగా నిర్ణయం తీసుకుంది జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వం మాత్రమే. గతంలో ఎవరూ ఈవిధంగా ఆలోచించలేదు.
– కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల విషయానికి వస్తే.. అంతకు ముందు 3లక్షల పదివేలమంది ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు బడ్జెట్ సంవత్సరానికి రూ.1198 కోట్లు ఉంటే.. అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అది రూ.3,187 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు రెండువేల కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నాం. అంగన్ వాడీ వర్కర్ల జీతాలు అంతకు ముందు రూ.7వేలు ఉంటే, ఇప్పుడు రూ.11,500. మినీ అంగన్వాడీ వాళ్లకు రూ.4500 ఉంటే రూ.7000, హెల్పర్లకు రూ.4,500 ఉంటే ఏడువేలు చేశాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇరవై రోజుల్లోనే వీరి జీతాలు పెంచింది. పబ్లిక్ హెల్త్ వర్కర్స్కు 2వేలు నుంచి 10వేలకు, పబ్లిక్ హెల్త్ వర్కర్స్ (ఈఎల్బీ) 12వేలు ఉంటే 18వేలుకు, శానిటేషన్ కంటింజెంట్‌కు 8వేలు ఉంటే 16వేలు, ఆశా వర్కర్స్కు రూ3వేలు నుంచి, 10వేలకు, ఏఎన్ఎంలకు 10వేలు ఉంటే రూ.28వేలు ఇలా వరుసగా ప్రతిదీ హోంగార్డ్స్ రూ.18వేల నుంచి రూ.21,300కి, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు 400నుంచి రూ.4వేలుకు పెంచాం. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఎంత చేయగలిగితే అంత చేశాం.
– ఇది కాకుండా ఆర్టీసీ ఉద్యోగుల విషయానికి వస్తే.. గతంలో ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేషన్ ఉంటే, ఆ ఉద్యోగులను ప్రభుత్వంలో కలపడం జరిగింది. కోవిడ్ వల్ల ఆక్యుపెన్సీ తగ్గిపోయి ఆదాయం తగ్గిపోవడంతో రూ. 2200 కోట్లు నష్టాల్లో ఉంది. రెండేళ్లలో ఆర్టీసీకి రూ.6500 కోట్లు హ్యూమన్ రిసోర్స్ మీద ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ పీఆర్సీ అమలు చేయడం వల్ల ఆర్టీసీకి మూడు, నాలుగు వందల కోట్లు అదనం అవుతుంది. అలాగే విలేజ్, వార్డు సెక్రటేరియట్ ఉద్యోగులకు సంబంధించి లక్షా 20వేల మందిని తీసుకుంటే వాళ్ల జీతాల బడ్జెట్ రూ.1800 కోట్లు ఉంటే ఇప్పుడు మరో రూ.700కోట్లు పెరుగుతుంది.
– అంటే మాప్రభుత్వం రాగానే రెండున్నరేళ్లలో కనీస పనికి కనీస వేతనం ఇవ్వాలనే విధానాన్ని మొదలుపెట్టి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒక కార్పొరేషన్ తీసుకువచ్చి వాటి ద్వారా జీతాలు చెల్లిస్తున్నాం. ఇది రాజకీయం కోసం చేసింది కాదు. మాకు అధికారం ఇచ్చినందుకు ప్రభుత్వంలో భాగస్వామ్యులైన అందరినీ, కచ్చితంగా బాగా చూసుకోవాలనేలా జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వం మంచి చేస్తోంది. దానిలో భాగంగానే జగన్ గారు నిన్న ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన మాటలే అందుకు ఉదాహరణగా తీసుకోవాలి. ఉన్న పరిస్థితులను వివరించి, అర్థం చేసుకోవాలని వినమ్రంగా అడిగారు.
కేరళలో హెచ్ఆర్ఏ ఎంతశాతం ఉంది?
– కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి మినిమమ్ టైమ్ స్కేల్ ఇంప్లిమెంట్ చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని ఇప్పుడు కొంతమందిని కలుపుకుని డిమాండ్ చేస్తున్నారు. మళ్ళీ ఉద్యమం చేస్తామని చెప్పడం అంటే అర్థం లేనిదే. దీనికి రాజకీయ పరమైన విధానం లేదు. మీరు అధికారంలో ఉన్న కేరళలో హెచ్ఆర్ఏ ఎంతశాతం ఉందని వామపక్ష పార్టీల వారిని అడుగుతున్నాం. కేరళలో ఇస్తోన్న హెచ్ఆర్ఏ కేవలం 4-6-8శాతాలే. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉద్యోగులకు హెచ్ఆర్ఏ ఎక్కువ ఇస్తున్నాయి. అన్ని ఇవ్వడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను కూడా అర్థం చేసుకోవాలి. మీరు రూలింగ్‌లో ఉన్న రాష్ట్రాల్లో ఇవి అప్లయ్ కావా? ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెస్పాన్స్‌బులిటీ వేరుగా ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డీల్ చేయాల్సింది వేరేగా ఉంటుంది. అయినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఉద్యోగులకు సంబంధించినవి కానీ, అసాధ్యమైనవి కానీ చెప్పి ఎవరినీ ఎప్పుడూ రెచ్చగొట్టలేదు. అధికారంలోకి వచ్చాక చేయగలిగినవి చేస్తూ వస్తున్నాం. చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాం. ప్రజలు అయినా, ఉద్యోగులు అయినా వారి ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రిగారు పనిచేస్తున్నారు.
పచ్చ, ఎర్ర అద్దాలు పెట్టుకుని చూడొద్దు
– ఇన్ని చేసుకుంటూ వచ్చాక.. ఓపెన్ మైండ్‌తోనే మా ప్రభుత్వాన్ని చూడమని చెబుతున్నాం. పచ్చ, ఎర్ర అద్దాలు పెట్టుకుని కాదు.. ప్లెయిన్‌గా, పారదర్శకంగా చూడమని చెబుతున్నాం. ముఖ్యమంత్రిగారు చాలా బ్రహ్మాండంగా చేశాం, పండుగ చేసుకోమని చెబితే మీరు విమర్శించాలి. పరిస్థితి బాగోలేదు.. ఇంకా బాగా చేయాలనుకున్నాం. కానీ చేయలేకపోయామని సీఎం గారు చెప్పారు. ఇక టీడీపీకి దాని అజెండా దానికి ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. మీకు కూడా అదే అజెండా ఉందా? విమర్శించాల్సిన చోట విమర్శిస్తే బాగుంటుంది. కమ్యూనిస్టుల అజెండా ఏంటో, ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. టీడీపీతో కలిసి ప్రతిదానికి అడ్డం వస్తారు. జగన్ మోహన్ రెడ్డిగారు రెండున్నరేళ్లలో లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను నేరుగా వారి ఖాతాల్లోకి వేస్తుంటే వాటిని ప్రశంసించడం మీకు చేతకాదు. ఎడ్యుకేషన్ సిస్టమ్‌కి వస్తే ఉపాధ్యాయులు అంటే చెట్టుకింద కూర్చునేవాళ్లు కాదని, వాళ్లు పూర్తి సెల్ప్ రెస్పెక్ట్‌తో వారికి అవసరం అయిన వాతావరణం క్రియేట్ చేయడానికి రూ.16వేల కోట్లు ఖర్చుపెట్టి నాడు-నేడు ద్వారా విద్యావ్యవస్థలో మార్పు తేవడం టీచర్లు ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేలా చేస్తుంటే మీకు కనిపించదా.. అని అడుగుతున్నాం. ఇవన్నీ ఈ రాజకీయ పార్టీలు అభినందించాల్సిన విషయమే కదా? దాని ద్వారా బెనిఫిట్ పొందుతున్న పేద పిల్లలు భవిష్యత్‌లో మంచిగా సెటిల్ అయితే దాన్ని అభినందించకపోయినా పర్లేదుకానీ, దానిపై నెగిటివ్ ప్రచారం అనేది వామపక్ష పార్టీలు చేయకూడదు కదా? టీడీపీకి ఎప్పుడూ జగన్‌గారిని అధికారంలో నుంచి దించేసి తాము గద్దెనెక్కాలనే దుగ్ధ తప్ప మరొకటి ఉండదు.
– కమ్యూనిస్టులు, మీరు ఏ సెక్షన్స్‌కు రిప్రజెంట్ చేస్తామని చెబుతారో… ప్రభుత్వం వారికి అనేకమైన ప్రయోజనాలు కలిగేలా లబ్ది చేకూర్చుతుంటే ప్రభుత్వంపై దాడి చేసి ఎవరి అజెండాను పూర్తి చేయాలనుకుంటున్నారో వామపక్ష పార్టీలు తమకు తాము ప్రశ్నించుకుంటే మంచిది.
– సద్దుమణిగిన సమస్యను మేము క్లయిమ్ చేసుకోవడం లేదు. చేయాల్సింది ఉంది కానీ మేము చేయలేకపోతున్నమనే చెబుతున్నాం. దాని గురించి చేసి ఉంటే బాగుండేది అని అనుకోవడం తప్పు కాదు. దాని గురించి మళ్లీ మొదలుపెట్టి ఉద్యమం చేస్తామనే సంఘాలకు మద్దతు ఇవ్వడం అంటే లేని సమస్యను మళ్లీ క్రియేట్ చేయడమే. ఇది నీచ రాజకీయమే.
టీడీపీ నీచ రాజకీయం
– మొన్న పదిరోజుల పాటు జరిగింది ఉద్యోగుల ఆందోళన, ఆవేదన. అందులో పొలిటికల్ ఫోర్సెస్ దూరాలని చూశాయి. ఉన్నాయి కూడా. ఉద్యోగులకు సంబంధించిన వాళ్లు హర్ట్ అయ్యారు. దాన్ని ఎక్స్‌ప్రెస్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఏదైతే మొదలైందో అది పూర్తిగా ఫక్తు రాజకీయం. అన్యాయమైన, నీచమైన రాజకీయం. ఒక్క ఏడాదిలోనే, లక్షా 20వేల ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చిన దాఖలాలు దేశంలోనే ఎక్కడా లేవనే చెప్పాలి. ఆ ఘనత జగన్ మోహన్ రెడ్డిగారిదే. ఉపాధ్యాయలకు పదోన్నతులు వల్ల 30 వేల మందికి లబ్ధి చేకూరుతుంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయానికి వస్తే టైమ్ బౌండ్లో అది పూర్తవుతుంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మంచి చేస్తుంటే, వారిని కూడా రెచ్చగొట్టి రోడ్ల మీదకు ఈడ్చటం తప్పు కదా? ఆ మాట అంటే బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారని అంటున్నారు. మీ టార్గెట్ ఏంటి అనేది తెలియడం లేదు. పాజిటివ్ వేలో వెళుతున్నవారిని ఏదోరకంగా బ్యాడ్‌లైట్ లో చూపాలనే ప్రయత్నం మళ్లీ ఊపందుకుంది.
– మీరు చేసే రాజకీయాల వల్ల ఏమి ప్రయోజనం ఉంటుందో అర్థం కావడం లేదు. అల్టిమేట్‌గా టీడీపీకి ఉపయోగపడే రాజకీయం వామపక్షాలు కూడా చేస్తున్నాయి. ఇప్పటికైనా ముసుగులు వదిలేసి చేయి చేయి కలపాలి. లేకుండా చేస్తే అది పొరపాటు అని గ్రహించాలి. ఇప్పటికీ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కమిటీ సభ్యులను ఎప్పుడైనా కలవవచ్చు అని ముఖ్యమంత్రి గారు చెప్పారు.
-అమరావతి రాజధాని భూములను.. చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా అమ్మాలనే చూసింది. మేం అవసరం కోసం వినియోగిస్తూ, వచ్చిన ఆ నిధులతో అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ఏది మేలు అనేది వాళ్లే ఆలోచించుకోవాలి.
– ఉద్యోగులను ఎందుకు బెదిరిస్తాం. మాకెందుకు అంత అవసరం. బెదిరించింది ఎవరు? బెదిరేవాళ్లు ఎవరు? అని అడుగుతున్నాం. అవన్నీ గతంలో టీడీపీ వాళ్ల లక్షణాలే. ఏ రకంగా ఉద్యోగులను చీల్చారో, ముఖ్యమంత్రిస్థాయిలో ఉన్న వ్యక్తి ఉద్యోగులను ఏవిధంగా బెదిరించారో అందరికి తెలిసిందే. తనకు అనుకూలంగా ఉన్నవాళ్లతో రాజకీయాలు చేయించడమే చంద్రబాబు నైజం. మేము పారదర్శకంగా ఉన్నాం కాబట్టే మా మాటలను నమ్ముతున్నారు. వేరే అజెండాలు పెట్టుకున్నవారే మా మీద, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.
– ఎక్కడ ఆర్థిక క్రమశిక్షణ తప్పామో చెప్పాలి. ఖర్చు పెట్టవద్దంటే ఎలా? బీజేపీ వాళ్ళు కూడా నాలుగు రాళ్లు వేసి పోతున్నారు. సంక్షేమ పథకాలపై ఖర్చుపెట్టడం తప్పు అని ధైర్యం ఉంటే చెప్పమనండి.
– గుడివాడలో జరిగిన సంక్రాంతి కార్యక్రమాలను టీడీపీ వాళ్లు పార్లమెంట్ వరకూ తీసుకువెళ్లడం హాస్యాస్పదం. కేసినోను రాష్ట్రంపై రుద్దాలన్నదే టీడీపీ ప్రయత్నం.
వినోద్ జైన్ లైంగిక వేధింపులపై పవన్ ఎందుకు స్పందించలేదు
– ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో ఆధిపత్య ధోరణితో వ్యవహరించిందంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేయడం చూస్తే.. ఆయనకు ఆ పదం బాగుందని వాడాడేమో. ఆ పెద్దమనిషి, కనీసం విజయవాడలో జరిగిన టీడీపీ నాయకుడు వినోద్ జైన్ లైంగిక వేధింపుల విషయంలో స్పందించను కూడా స్పందించలేదు. ఉద్యోగుల సమస్య పరిష్కారం కాగానే ఆధిపత్య ధోరణి అంటూ మాట్లాడటమా? అంటే వాళ్లు లోపల దాచిపెట్టుకోకుండా సమ్మె జరగనందుకు బాధతోనో, దుగ్ధతోనో లేక, టీడీపీకి ఏమైనా పనికి వస్తుందనుకుంటే, అది జరగలేదనే ఆక్రోశంతో మాట్లాడే మాటలే వారి నోటి నుంచే టక్కున వచ్చేస్తున్నాయి. వీళ్ళ రాజకీయాన్ని జనం గమనిస్తున్నారన్న స్పృహ కూడా వీరికి ఉండటం లేదు. ఇప్పుడు రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని సృష్టించి, దానిని ఒకరి తర్వాత ఒకరు మాట్లాడి.. చివరికి అది నిజమని ప్రజలను నమ్మించేందుకు… ఈ శక్తులన్నీ కలిసి ఒక క్యాంపెయిన్‌లా రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నాయి.