– సీఎం యోగీ మ్యాజిక్
ఉత్తరాది రాష్ట్రాల ఫలితాలను సంబంధించి వస్తున్న ట్రెండ్స్ చూస్తే బీజేపీ కంఫర్టబుల్ పొజిషన్ లో ఉందని అర్ధమవుతోంది. అయిదు రాష్ట్రాల ఎన్నికలు అని చెబుతున్నా ఇందులో గుండెకాయ లాంటిది యూపీ. ఉత్తరప్రదేశ్ లో ఎవరు గెలిస్తే వారే బహు మొనగాడు. ఆ విధంగా చూస్తే బీజేపీకి సీట్లు కొన్ని తగ్గినా విజేత ఆ పార్టీయే అన్నది అర్ధమవుతోంది. మరో వైపు చూస్తే జబ్బ చరచి బరిలోకి దూకిన ఎస్పీ సీట్లను పెంచుకున్నా సీఎం సీట్లో కూర్చునే చాన్స్ అయితే లేదని తెలుస్తోంది.
మొత్తంగా చూస్తే యూపీ సీఎం యోగీ మ్యాజిక్ చాలా బాగానే పనిచేసింది అని చెప్పాలి. ఇక మోడీ ఇమేజ్
కూడా చెక్కుచెదరలేదని అర్ధమవుతోంది. ఇక యూపీలో ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీ మళ్లీ గెలవడం అంటే అది కాంగ్రెస్ జమానాతోనే ముగిసిపోయింది.
1987 దాకా అక్కడ కాంగ్రెస్ దే రాజ్యం. ఆ పార్టీయే వరసబెట్టి గెలుస్తూ వచ్చేది. అలాంటిది బీజేపీ ఇపుడు 35 ఏళ్ల నాటి రికార్డుని బద్ధల కొట్టబోతోంది అని తెలుస్తోంది. అయిదేళ్ల యోగీ పాలనకు మంచి మార్కులే పడ్డాయని అంటున్నారు.
ఓబీసీ వర్గాలతో పాటు హిందూత్వ కార్డు కూడా బలంగా పనిచేసినట్లుగా అర్ధమవుతోంది. అదే విధంగా బీఎస్పీ సీన్ సితార్ కావడంతో ఆ పార్టీకి ఉన్న ఇరవై శాతం ఓటు బ్యాంక్ ని ఎస్పీ బీజేపీ పంచుకున్నాయని అర్ధమవుతోంది.
దాంతో బీజేపీకి యూపీ లో 44 దాకా ఓట్ల శాతం పెరిగింది అంటున్నారు. గతంతో పోలిస్తే ఇది అయిదు శాతం ఎక్కువ. ఇక ఎస్పీకి కూడా బీఎస్పీ ఓట్లు కలవడం వల్ల 35 శాతానికి ఆ పార్టీ షేర్ పెరిగింది అన్న అంచనాలు ఉన్నాయి.
ఏది ఏమైనా ఎస్పీ అఖిలేష్ వంద సీట్ల మార్కుని దాటించడం ద్వారా విపక్ష పాత్రను పెంచారని తెలుస్తోంది. అదే సమయంలో వరసగా రెండవసారి గెలవడం అది కూడా యూపీ లాంటి పెద్ద స్టేట్ లో అన్నది మాటలు కాదుబీజేపీ ఆ ఫీట్ ని సాధించడం ద్వారా దేశంలోని అన్ని విపక్ష పార్టీలను ఖంగు తినిపించింది.
జాతీయ స్థాయిలో బీజేపీని నిలువరించాలని చేస్తున్న ప్రయత్నాలకు ఒక్క యూపీ చాలు సరైన జవాబు అని కమలనాధులు అంటున్నారు. మరో వైపు చూస్తే మిగిలిన చోట్ల కూడా బీజేపీ బాగానే తన పెర్ఫార్మెన్స్ చాటుకుంటోంది. ఇపుడున్న ట్రెండ్స్ కంటిన్యూ అయితే ఉత్తరాఖండ్. మణిపూర్ లలో కూడా బీజేపీ పాగా వేయడం ఖాయం.
మొత్తానికి చూస్తే అయిదు రాష్ట్రాల ఎన్నికలతో బాగా నష్టపోతోంది మాత్రం కాంగ్రెస్ అని చెప్పకతప్పదు. ఆ పార్టీ ఉన్న పవర్ ని పంజాబ్ లో కోల్పోతోంది. గోవాలో అధికారం దక్కితే అదే పదివేలు అన్నట్లుగా సీన్ ఉంది. టోటల్ గా ఈ రిజల్ట్స్ చెప్పేది ఏంటంటే మోడీ మొనగాడే అని.