డాక్టర్లకే పాఠాలు చెప్పే డాక్టర్. కర్నాటక సంగీతాన్ని ఆపోసన పట్టిన ఘనాపాఠీలకే గుగ్గురువు. బాడీ బిల్డర్. వెయిట్ లిఫ్టర్. ఇలా ఒక్కొక్క రంగంలో నిష్ణాతులయిన వాళ్లు కానవస్తూనే వుంటారు. అయితే వీటన్నింటినీ పుణికి పుచ్చుకుని అందరిచేతా ఔరా అనిపించుకుంటూ నిండు నూరేళ్ళ జీవితాన్ని గడుపిన అరుదయిన వ్యక్తే డాక్టర్ శ్రీపాద పినాకపాణి. బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగుగడ్డ గర్వించదగిన పదహారణాల తెలుగుబిడ్డ.
బాల్యం:
సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు, ప్రముఖ వైద్యులు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, సంగీత కళానిధి శ్రీపాద పినాకపాణి 1913 ఆగస్టు 3న శ్రీకాకుళం జిల్లా ప్రియాగ్రహారంలో జన్మించిరి. శ్రీపాద పినాకపాణి బాల్యమంతా రాజమండ్రిలో గడచింది. 1957 నుంచి కర్నూలులో నివాసం ఉంటున్నారు. వైద్యాన్నివృత్తిగా, సంగీతాన్ని ప్రవృత్తిగా ఎంచుకుని రెండు రంగాల్లో విశిష్ట సేవలందించారు.
ప్రభుత్వ వైద్యుడిగా:
ప్రభుత్వ వైద్యుడిగా 30 ఏళ్లపాటు పనిచేసిన ఆయన కర్నూలు బోధనాసుపత్రి పర్యవేక్షకులుగా సేవలందించారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చే పేద రోగులకు ఉచితంగా వైద్యం చేసిన పినాకపాణి సంగీత విద్వాంసుడిగా కీర్తి సంపాదించారు.
నేటి యువతకు ఆదర్శం:
కొందరికే పరిమతమైన వైద్యవిద్యలో ఆయన ఎండీ చేశారు. మంచి శారీరక దృఢత్వం గల వ్యక్తి. ఇందుకు ఆయన ప్రత్యేక కసరత్తులు చేసి కండలుతిరిగిన దేహంతో యువకులకు ఆయన స్ఫూర్తి. చదువుకుంటూనే సంగీత కచేరీలు చేశారు. చదువులోనే గట్టెక్కలేక ఇబ్బందులు పడుతున్న నేటి తరానికి ఆ రోజుల్లోనే విద్యలో రాణించి… తన సంగీతాభిలాషవైపు అడుగులు వేసిన ఆయన నేటి యువతకు ఆదర్శం.
పేదల వైద్యుడిగా:
కర్నూలు సర్వజన వైద్యశాలలో వైద్యుడిగా, పర్యవేక్షకులుగా ఆయన సేవలు అందించారు. పేదల వైద్యుడిగా పేరుగాంచారు. ఎవరైనా పేదలు చికిత్సకోసం ఇంటికి వస్తే… వద్దు మీరు ప్రభుత్వ ఆసుపత్రికి రమ్మని చెప్పి ఉచిత సేవలు అందించే గొప్ప మనస్కుడు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులను ఇంటికి రమ్మని అధిక రుసుం వసూలు చేసే వైద్యులకు ఆయన మార్గం అనుసరణీయం
శిష్యప్రముఖులు:
డా.నోరి దత్తాత్రేయుడు వైద్యరంగంలో శ్రీ పాద వారి ప్రముశ శిష్యులలో ఒకరు కాగా, నూకల చిన సత్యనారాయణ, నేదునూరికృష్ణమూర్తి, శ్రీరంగం గోపాల రత్నం, మల్లాది సూరిబాబు, నేతి శ్రీరామశర్మ సంగీతంలో వారిశిష్యులు.
గురువులకే గురువు:
డా. శ్రీపాద పినాకపాణి….
సంగీత ప్రపంచంలో ఆయన గురించి తెలియని వారుండరు. నూరేళ్ళ సంగీతయానం ఆయనది. వృత్తి రీత్యా వైద్యుడయినా సంగీతజ్ఞుడినని చెప్పుకోవడానికే ఇష్టపడే అరుదైన వ్యక్తిత్వం ఆయనది. ఆయన కేవలం గాయకుడే కాదు; కేవలం వైణికుడే కాదు. సంగీత శాస్త్రాన్ని క్షుణ్ణంగా ఆపోశన చేసిన
వాగ్గేయకారుడు. సంగీతమూ, విజ్ఞానమూ పదిమందితో పంచుకున్నప్పుడే అది పదికాలాలపాటూ నిలుస్తుందని నమ్మిన ఆయన ఎంతో మంది శిష్యుల్ని ఆణి ముత్యాలుగా మలిచారు.
సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి, ఓలేటి వేంకటేశ్వర్లు, నూకల చినసత్యనారాయణ, శ్రీరంగం గోపాలరత్నం, మల్లాది బ్రదర్స్, ప్రసిద్ద సినీ గాయని ఎస్. జానకి, ఇలా ఎందరో మహామహులు ఆయన వద్ద సంగీతం నేర్చుకున్నారు. వారందరూ శ్రీపాద వారి గురించి అనే ఒకే మాట – ఆయన గురువులకే గురువని.
విద్యాగురువులు:
డాక్టర్ శ్రీపాద పినాకపాణి
టి వాసుదేవన్, ఆర్ రంగరమానుజ ఐయ్యంగార్ పినాకపాణి గారి విద్యాగురువులు. కొన్ని నెలలు “వయొలిన్” విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడిగారి స్కూల్లో గడిపేరు. పినాకపాణి గారికి అరియక్కుడి రమానుజఐయ్యంగార్, వీణా ధనమ్మళ్ మీద యెంతో గురి, అభిమానం. ఆయన చిన్నతనంలో ఊళో ఏ కచ్చేరి జరిగినా, అయన గురువు, లక్ష్మణ రావుగారు తీసుకెళుతూ ఉండేవారు. స్రద్ధగా వినే పినాకపాణి గారికి సంగీత వికాసానికి ఇది దోహదం చేసింది.
కళ, కళ కోసమే:
“కళ, కళ కోసమే” (“ఆర్ట్ ఈస్ ఫర్ ఆర్ట్ సేక్”) అని వీరి భావన. “సంగీతం కూడా దేవుడిని ఆరాధించే మార్గం”, అని ఓ సందర్భంలో అన్నారు.
#త్రికరణశుద్ధిగా సంగీత సాధనలో జీవితం సాగించిన పినాకపాణి గారు, సంగీత శాస్త్ర విద్యావ్యాప్తికి విశిష్ట కృషి చేసారు. రాగ-భావ యుక్తమైన సంగీత స్వరాలు రూపొందించడమేకాక, తన సంగీత ప్రావీణ్యంతో, మధుర కంఠంతో ఆలాపించి జన హృదయాలలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు.
తండ్రి గారి ప్రోత్సాహ ప్రోద్భలంతో…
పినాకపాణి గారి సోదరి చిన్నతనంలో మైసూర్ బి ఎస్ లక్ష్మణ రావు గారి వద్ధ సంగీతం నేర్చుకుంటూ ఉండేది. ఆమె సాధన చేసేటప్పుడు, తప్పులు పట్టుకుని సరిదిద్దే వారు పినాకపాణి గారు. తండ్రి, రావు గారి ప్రోత్సాహ ప్రోద్భలంతో పదకొండవ యేట సంగీతం నేర్చుకోవడం మొదలు పెట్టేరు పినాకపాణి. పినాకపాణి గారు స్వరకల్పనతో నేర్చుకున్న తొలి కృతి – “గజానన సదా యనుచు” (థోడి).
అంకెలని కూడా మేలకర్త రాగ అంకెలతో (నంబర్స్) అనుసంధానం చేస్తూ ఉండేవారు. తన టెలిఫోన్ నంబరు – రత్నాంగీల నడుమ, రెండు చారుకేశులు అని, కారు నెంబరు 3654 – చక్రవాల శంకరాభరణం అని చమత్కరించారు.
రాగ సాధన:
సంగీతం వింటూనే నొటోషన్స్ రాయగల నైపుణ్యం వీరి కుంది.. పదవీ విరమణానంతరం, త్యాగరాజాది వాగ్గేయకారుల రచనలు, గీతాలు, స్వరజతులు, స్వరపల్లవులు, తాన పద వర్ణములు, కృతులు, పల్లవులు, జావళీలు మొదలైన సంగీత రచనలు ఏరికూర్చి, పుస్తకరచనకు శ్రీ కారం చుట్టారు..సంగీత సౌరభం పేరుతో తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రచురించిన నాలుగు సంపుటాలలో వీరు స్వర పరచిన అన్నమాచార్య కృతులు 108, త్యాగరాజాది వాగ్గేయ కారుల కృతులు 607, ముత్తు స్వామి దీక్షితుల కృతులు 173, పదములు 44, జావళీలు 40, తానవర్ణములు, 56, తిల్లనాలు, 10 మొత్తం 1088 సంగీత గుళికలు ఉన్నాయి..పాణినీయం, ప్రపత్తి, స్వరరామమ్, అభ్యాసమ్, నా సంగీత యాత్ర పుస్తకాలు రచించారు.
రాగం కూడా గురువు నేర్పించాలి:
“వినగా, వినగా, వినికిడి తో రాగాలు పాడగలిగిన అనుభవం వస్తుంది. అందుకనే సంగీతం యదావిధిగా నేర్చుకున్న విద్యార్ధులకు కూడా రాగం పాడే శక్తి రావడంలేదు. ప్రసిద్ధ రాగాలను వ్రాసిచ్చి, వాటిని కంఠోపాఠంగా వచ్చే వరకు చెప్పి, పాడించాలి. విద్వాంసులు పాడే రాగాలాపనలను నిరంతరం వింటూ ఉండడం అన్నిటికంటే యెక్కువ అవసరం. స్వరకల్పన పాడుతూ పాడించినట్లే రాగం కూడా గురువు నేర్పించాలి” అని పినాకపాణి గారు తన సంగీత జ్ఞాన అనుభవంతో ఉదాహరించారు.
స్వయం కృషి:
స్వయంకృషి మీద పినాకపాణి గారికి ప్రగాడ విశ్వాసం. యెందరో మేధావుల సంకీర్తనలు విని, విశ్లేషించి, మెళకువలు నేర్చుకుంటూ ఉండేవారు. మంచి అవగాహన యేర్పరచుకుని తనదైన శైలి (స్టైల్) ని నెలకొల్పేరు. సంగీతకారుల్లో ఈ లక్షణం అరుదైనా పినాకపాణి గారిలో విలక్షణంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది వీరి ప్రత్యేకత. రాగంలో ఇమిడీకృతమై, అంతర్భాగమై ఉన్న వివరాలను నిశితంగా విశ్లేషించి శిష్యులకు నేర్పేవారు.
సంగీతానికి రాగమే జీవనము:
డాక్టర్ శ్రీపాద పినాకపాణి నిరంతర పరిశ్రమతో, సంక్లిష్టమైన, విషయాలను సమన్వయించి నిశితంగా పరిశీలించి, విశ్లేషించి రాగ యుక్తంగా శిష్యులకు నేర్పేవారు. గమకానికి యెంతో ప్రాదాన్యం ఇచ్చారు. సంగీతానికి రాగమే జీవనము, వర్ణము, కృతి పదము, జావళీ ఏ రచన గానం చేసినా, ఒక రాగస్వరూపమును స్వరగమకాది భూషణములతో అలంకరించి మనోహరంగా చిత్రించడమే వీరి ధ్యేయం.
గురు,శిష్య, ప్రశిష్య అనుసంధాన హేతువు…..
అప్పటికే రాణిస్తున్న నేదునూరి కృష్ణమూర్తి గారు, ఇంకా యెంతో నేర్చుకోవాలన్న జిజ్ఞాసతో పినాకపాణి గారిని ఆశ్రయించి వారి వద్ద గమక మెళకువలు నేర్చుకోవాలన్న కుతూహలం వ్యక్తం చేసి నప్పుడు సంతోషంగా అంగికరించి హృదయం లోతుల్లోంచి వెల్లు వెట్టిన సంగీతం నేర్పించారు. పినాకపాణి గారు. కనపరిచిన వాత్సల్యం, చూపిన శ్రద్ధ గురు, శిష్య, ప్రశిష్య అనుసంధాన హేతువులైయాయి.
నిత్య నూతనత్వం ఉంటే….
“తెలుగు విద్వాంసులు చేసే పాటకచ్చేరీలలో హాలు నాల్గవ వంతు జనం ఉండరు. తమిళ విద్వాంసులు పాడే సభలకు రసిక జనంతో హాలు నిండిపోతుంది. యెందుకో అందరూ ఆలోచించాలి” అని తన పుస్తక పీఠికలో పేర్కొన్నారు పినాకపాణి గారు. పాటలలో నాణ్యత, రుచి, కల్పనాచాతుర్యం, నిత్య నూతనత్వం ఉంటే, జనాకర్షణ తప్పక ఉంటుంది అని వారి అభిప్రాయం వ్యక్తం చేసారు.
2013 మార్చి 11 (వయస్సు 99)న మరణించారు.
గడించిన చిర కీర్తి, అందుకున్న సన్మానాలు, మన్ననలు:
శాస్త్రీయ సంగీత విద్వాంసుల సమక్షంలో “ఓ హో” అనిపించుకున్న మహనీయుడు పినాకపాణి గారు పలు మన్నలను, పురస్కారాలను అందుకున్నారు.
– సంగీత కళానిధి గౌరవం (1983)
– సంగీత నాటక ఎకాడమి అవార్డు (1977)
– భారత ప్రభుత్వం నుండి పద్మ భూషణ్ పురస్కారం (1984)
– తెలుగు విశ్వవిద్యాలయం లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారం (2005)
– గుప్తా అవార్డు (1993)
డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారు
ఎందరో సంగీత శిఖామణులను తెలుగు వారికి అందచేసారు.
Collected by
Dr.A.Srinivasa Reddy
9912731022
Zphs Munugodu Amaravathi mandal Guntur district.