మా ఇంటి స్త్రీమూర్తులు, చక్కటి తడి – పొడి… వేప – తుమ్మ, కట్టెలు వాడుకుంటూ, “అత్తెసరు – వార్పూ” పేర్లతో బియ్యాన్ని రుచిగా వండుతూ, కత్తిపీటతో కూరలు తరుక్కుని, బొగ్గుల కుంపట్లమీద పాలు కాచుకుని, వంటిల్లంతా దట్టమైన పొగ దిట్టంగా వ్యాపిస్తే, కళ్ళు నలుపుకుంటూ ఎర్రబారిన కళ్ళతో, మధ్య మధ్యలో మేఘాల్లోంచి వచ్చే నారదుడి లాగ, బయటికి వచ్చి, కొంతసేపు సేదదీరి, మళ్ళీ డూటీ ఎక్కేవారు.
“తడి కట్టెల పొగ.. కళ్ళ ఆరోగ్యానికి మంచిదే” అని ఎవరో- ఎప్పుడో వాళ్ళని నమ్మించారులా వుంది ! నమ్మకపోయినా, పాపం, అంతకంటే…దారేదీ ?
ఇంట్లోవున్న పది మందికీ తిండి కావాలిగా ?
తర్వాత, కొన్నాళ్ళకి ఎవరో సాంప్రదాయేతర ఇంధన వనరుల ఆవిష్కర్త, తన మేధస్సునుపయోగించి, రంపం పొట్టు కుంపట్లు కనిపెట్టి, దేశం మీదకి వదిలాడు. దాంతో రంపం మిల్లులు వాళ్ళకి అదనం ఆదాయం అందుకుంది.
ముందురోజే సాయంత్రం నాలాంటి ఔత్సాహికులు రెండుకాళ్ళూ అడ్డంపెట్టి, మధ్యలో ఒక బండ పెట్టి, రెండు కుంపట్ల నిండా రంపంపొట్టుని దిట్టంగా కూరిపడేస్తే, మర్నాడు వేన్నీళ్ళకీ, వంటకీ కులస్త్రీలకు సౌకర్యవంతంగా వుండి, ‘ఆధునికంగా’ వంట ఐపోయేది.
పైగా సాయంత్రం దాకా కాఫీలు వేడి చేసుకుందుకు, నెయ్యి కరగ బెట్టుకుందుకు కూడా బేఫికర్ !
ఇంక వత్తుల కిరసనాలు స్టవ్ లు, పంపుకొట్టే ప్రెషరు స్టవ్ లు వచ్చాక, శ్రమ తగ్గినందుకు, ఇంటి ఇల్లాళ్ళు అప్పుడప్పుడు నవ్వేవారు కూడాను !
ఇల్లంతా ధూపం వేసినట్టు, కిరసనాలు వాసన వ్యాపించినా, పట్టించుకోడం మానేశాం.
గట్టిగా పంపు కొడితే, పేలిపోయే కిరసనాలు ప్రెషరు స్టవ్వులూ కొంతకాలం రాజ్యం ఏలాయి.
అది మొరాయిస్తే, దానికి ఇంజెక్షను చేసినట్టు… ఒక పిన్నుతో పొడవడం !
అప్పట్లో కొంచెం డబ్బున్నవాళ్ళు, రాగి బోయిలర్లు కొనుక్కుని, దాంట్లోకి ఇంధన వుండలు వేసి, వేన్నీళ్ళు కాచుకుని, కింద కుళాయి కూడా పెట్టించుకుని, ఫాషన్ గా వేన్నీళ్ళు తోడుకుని, స్టైలుగా స్నానాలకి వెళ్ళేవారు.
శీతాకాలం వచ్చేదాకా, చలి బాగా ముదిరే దాకా, మాయింటి మగమహారాజులం, ఇద్దరు – ముగ్గురం కలిసి, తువ్వాళ్ళు బిగించి, రెండు – మూడు వరల నూతినీళ్ళు వాటంగా తోడిపోసుకునే వాళ్ళం.
అప్పుడప్పుడు..కాలవలో ఈతలు కూడా కొట్టేవాళ్ళం.
అప్పట్లో అదే మా ఆరోగ్య రహస్యం, సౌందర్య రహస్యం !
ఆడవాళ్ళకి సంసారపక్షంగా, తడిక అడ్డం పెట్టిన స్నానాలగదులు ప్రత్యేకంగా మంజూరయ్యేవి. డబ్బులెక్కువగా వుంటే, బాత్రూములకి, మరుగుదొడ్లకి తలుపులు కూడా పెట్టించుకునేవారు !
(అనవసరపు ఖర్చులు !)
“పాలదాలి” అనే ఆవు పిడకలతో పాలుకాచుకునే ప్రత్యేక ఏర్పాటు వుండేది. చిక్కటి పాలు, ఒక కుండలో పోసి, దానిమీద పడేస్తే, పాలు మరిగీ మరిగీ, ఎర్రటి తొరక కట్టి, పాలకోవా అయిపోకుండా తీసి, చల్లార్చి,
తోడు పెట్టిన పెరుగు – మజ్జిగా…మర్నాడు చద్దన్నంలో కొత్త ఊరగాయలతో ఒక పట్టు పడితే వుండేదీ….
నాసామి రంగడే కాక, అందరి సామిరంగలూ దిగొచ్చేవారు ! మీరు నమ్మాలి !
అది మజ్జిగా ?…కాదు…అమృతానికి కజిను !
అలాంటి ఆర్గానిక్ మజ్జిగలు, పాలు, నెయ్యి తాగి,
తిని, దొడ్లో కాసిన కూరలు – ఆకుకూరల రుచి మరిగి,
తుమ్మడం – దగ్గడం మానేసి చాలాకాలం అయింది !
యిప్పటికీ ఆనాటి మజ్జిగల్ని తల్చుకుని రొట్టలేస్తున్నాం !
ఇప్పటివాళ్ళు, కొనుక్కొచ్చిన బ్రాండెడ్ ‘జిగురు’ పెరుగు
చెంచాతో వేసుకుని, మునివేళ్ళతో కలుపుకున్నట్టు నటించి, అసయ్యంగా నోరు తెరవకుండా, ఫ్యాషన్ గా
సినిమా హీరోయిన్ లాగ మూడువేళ్ళతో తిని, పెదాలతో చప్పరిస్తున్నారు !
అందుకే కామోసు, మా కిరాణా కొట్టు సత్యం అంటాడు,
“ఈళ్ళు కొనే సరుకుల్లో తిండానికి తక్కువ, ఫ్యాషన్లకి,
అలంకారాలకి ఎక్కువ వుంటాయి” అని !
(ఇంతకంటే ఎక్కువగా వాళ్ళ గురించి రాస్తే, మనకోసం, ఎవరికో…”సుపారీ” ఇచ్చినా ఇచ్చేస్తారు, కాబట్టి…గప్ – చుప్ !)
1969 ప్రాంతంలో అనుకుంటాను…
పాపం వాళ్ళెవరో…భుజంమీద గ్యాస్ బండ మోసుకొచ్చి, స్టవ్వు, రెగ్యులేటర్లు కూడా తెచ్చి,
ఇంటింటికీ తిరిగి, “కట్టెలు – బొగ్గులు – కిరసనాలు –
రంపంపొట్టులతో బాధపడుతున్న మీకోసం…
అత్యాధునిక ఇంధనం వచ్చేసింది, శబ్దం – మసి – పొగ లేని, సుఖము – సురక్షితము అయిన దీన్ని,
‘గ్యాస్ పొయ్యి’ అంటారు…ఆలసించిన ఆశాభంగం, తరుణము మించిన దొరకదు…250 మాత్రమే!”
అని మొత్తుకున్నారు !
“కొత్తొక వింత – పాతొక రోత” అనేది వాడుకలో వున్న
సామెత అయితే, మధ్యతరగతి వాళ్ళం మాత్రం,
“కొత్తది అపాయం – పాతదే ఉపాయం” అని నమ్మేవాళ్ళం.
ఆ గ్యాస్ స్టవ్ ఎలా వెలిగించాలో, చప్పుడు, పొగ,
మసి లేకుండా గిన్నెలు అరిగి పోకుండా ఎలా వాడుకోవచ్చో నిరూపించినా, మన మొహాల్లో ప్రశ్నార్దకాలు అలాగే ఉండిపోయాయి.
“గ్యాస్ ఇల్లంతా వ్యాపించేసి, ఒళ్ళు కాలి,
చాలమంది పోయార్ట, నీళ్ళు పోసినా ఆరదుట
అర్ధరాత్రి, గ్యాస్ బండ బాంబులాగ “ఢాం” అంటుందిట”
లాంటివి చాలా వినివున్నాం.
“దాని ఖరీదు..పదా – పాతికా… ఏకంగా 250 ట !
డబ్బా బొగ్గులు రూపాయికి, బస్తా రంపంపొట్టు రెండు రూపాయలకి, లీటరు కిరసనాలు అర్ధరూపాయికీ వస్తుంటే, ఈ దిక్కుమాలిన గ్యాస్ కోసం ఏకంగా 250 గుమ్మరించాల్ట !” అనుకుని, ఎప్పుడో అర్ధరాత్రి పూట,
“ఢామ్మని” పేలిపోయే బాంబుల గ్యాస్ మాకొద్దు”
అని వాళ్ళని తరిమేశాం.
పాపం, వాళ్ళు…పాలసీ అమ్మలేని ఇన్సూరెన్స్ ఏజెంటులాగ మొహం పెట్టుకుని, గ్యాస్ బండని భుజమ్మీదకి ఎత్తుకున్నారు !
మా ఇంట్లో అద్దెకున్నవాళ్ళిద్దరూ మాత్రం 250 ఇచ్చేసి,
గ్యాస్ కనెక్షన్లు తీసేసుకుని, మర్నాటినుంచే సుఖపడిపోడం మొదలెట్టేశారు.
సరే…ఇంటివాళ్ళ పట్ల అద్దెకుండే వాళ్ళకుండే సహజ మోహమాటాలు ఉపయోగించుకుని, అప్పుడప్పుడు
మా గిన్నెలు మసిబారకుండా, వాళ్ళ గ్యాస్ పొయ్యిలమీదే మా పాలు కాగిపోయి,
నెయ్యి కరిగిపోయేది.
1980 ప్రాంతంలో అని జ్ఞాపకం…
గ్యాస్ కనెక్షన్లు నల్లబజారులోకి వెళ్ళిపోయి,
మనం కొంచెం గ్యాస్ పొయ్యి కొనే లెవెల్ కి ఎదిగాక,
బుక్ చేసుకుందామని వెడితే, ఆ డీలర్లు,
మనకేసి చూడకుండా, “లేవు, వచ్చే ఏడాద్దాకా బుకింగుల్లేవు” అని పొమ్మన్నట్టు చేతులాడించేవాళ్ళు.
తరవాతెప్పుడో…గ్యాస్ కనెక్షన్లు బుక్ చేస్తున్నారంటే,
రాత్రే మనతరఫున క్యూ లో పడుక్కున్నందుకు,
రిక్షా కార్మికుడికి 100 రూ. కొట్టి, పొద్దున్న ఫ్రెష్ గా
రడీ అయ్యి, క్యూలో నిలబడి, పవన్ కళ్యాణ్ సినిమా టిక్కెట్టుకోసం కొట్టుకున్నట్టు, కొట్టుకుని, చచ్ఛీ – చెడీ, ఎలాగో బుక్ చేసుకుంటే, కనెక్షను ఎప్పుడు వచ్చేదీ ‘తరవాత చెబుతాం’ అనేశాడు.
తరవాత కొన్ని నెలలకి, ‘మీకు గ్యాస్ కనెక్షను వచ్చింది”
అని, ‘ఇంగ్లాండు’ కవర్లో సమాచారం పంపిస్తే,
దాన్ని కాస్తా…మా పోస్టుమాన్, “డోర్ లాక్డ్” అని రాసి,
వెనక్కి తోసేశాడు !
అలా వెనక్కి తోసేసిన ఒక్కొక్క ‘ఇంగ్లాండ్’ కవర్ కీ,
గ్యాస్ డీలర్ లు, పోస్ట్ మాన్ లకి 200 ఇచ్చేవార్ట !
మనకి రావలసిన గ్యాస్ కనెక్షన్లని డీలర్లు,
నల్లబజారులో అమ్ముకుని, తెల్లటి బట్టలు కుట్టించుకునేవార్ట !
గ్యాస్ డీలర్షిప్పులకి, పెట్రోలు బంకులకి,
M.P లకి కోటా వుండేదంటే…దాని రేంజి అదన్నమాట !
ఆఫీస్ నుంచి భోజనానికి వచ్చి, సైకిల్ వెనక్కి తిప్పి,
పోస్ట్ ఆఫీసుకి వెళ్ళి, దెబ్బలాడి, కవరు లాక్కుని,
ఇంటికొచ్చి, అమెరికా వాడి H1B వీసా తెచ్చుకున్నంత సంబరపడిపోయాను.
గ్యాస్ పొయ్యికి అలవాటుపడ్డాక, రాను రాను,
మధ్య తరగతి గ్యాసు గత ప్రాణులకు,
నరకం అంటే ఏంటో తెలిసేది.
ఉన్నది ఒకటే సిలిండరు,
ఎప్పుడు ఐపోతుందో తెలీదు !
ఫోను చేసి, గ్యాస్ బుక్ చేసుకుందామంటే,
రాత్రి షాపు మూసేసే దాకా, ‘ఎంగేజ్ టోను’ వినబడుతూనేవుండేది !
పోనీ కష్టపడి, షాపు దాకా వెళ్ళి, బుక్ చేద్దామంటే,
అక్కడి సేల్స్ గర్ల్స్, విసుగ్గా చూసి, మనం చందాకోసం వెళ్ళినట్టు మొహం పెట్టేవారు.
ఇంట్లో గ్యాస్ అయిపోతే, వెంఠనే యిద్దరు సాయంపట్టి,
కొత్త బండ బిగించలేకపోతే…’మనం మగాళ్ళమే కాదు’
అన్నంత ఫీలింగు వచ్చేది !
పైగా, చుట్టాలు, పండగలు వచ్చినప్పుడే గ్యాస్ ఫట్టు !
అప్పణ్ణుంచే అనుకుంటా చాలామందికి “గ్యాస్ ట్రబులు”
పట్టుకుంది !
అందుకని రెండు బండలున్న బండ రాముళ్ళని
బతిమాలుకుని, ఒక సహకార సమాఖ్యని ఏర్పాటు చేసుకుని, బతికిపోయేవాళ్ళం !
మొన్న మొన్న, గ్యాస్ బుకింగుని ఆన్ లైన్ చేయించిన
సంస్కరణ వాదికి, ఈ ఏడాదైనా..”పద్మశ్రీ” ఇవ్వాలిగా ?
ఇప్పుడు “ప్రత్యామ్నాయ ఇంధన వనరుల” పేరిట,
కరెంటు స్టవ్వులూ, సోలార్ స్టవ్వులూ, మైక్రోవేవ్ లు,
ఓవెన్ లు, ప్రెషర్ కుక్కర్లు, ఇన్స్టాపాట్ లు వచ్చేసి,
“ఓస్.. వంటంటే… ఇంతేనా…?” అంటున్నారు…
నేటి వనితలు ! అదృష్టవంతులు !
స్నానాలకి అయితే, సమస్యే లేదు !
బాత్రూం ఒక్కింటికి ఒక గీజరు పెట్టించుకుని,
స్నానాలు అయిపోయినా, సాయంత్రం దాకా గీజర్లు ఆపడం మర్చిపోతున్న ఈ రోజుల్లో…
కట్టెలు – బొగ్గులు – కిరాసనాలు – రంపంపొట్టు, బాయిలర్ వుండలు తల్చుకుంటే…”ఆ రోజుల్లో ఎలా బతికాము ?” అని అనుమానం రావడం సహజం !
పెట్రోలు అఖ్ఖర్లేకుండా, బ్యాటరీలతో కార్లు, మోటారు సైకిళ్ళు నడిచే రోజులు, డ్రైవర్లు లేకుండా కార్లు వెళ్ళే రోజులు వచ్చేస్తున్నాయిగా… ఎదురు చూద్దాం !
“మార్పు శాశ్వతం”
(CHANGE IS CONSTANT)
– వారణాసి సుధాకర్.