* మహిళా ప్రభుత్వ ఉద్యోగినులకు అండగా ఉంటాం
* మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి.. “సబల” వాట్సాప్ నెంబర్ : 6302666254 ద్వారా ఫిర్యాదుల స్వీకరణ
* ఉద్యోగినుల సమస్యల పరిష్కారానికి “సభల” ప్రాంతీయ సదస్సులు
* ప్రభుత్వ కార్యాలయాల్లో అంతర్గత ఫిర్యాదుల విభాగాలు ఏర్పాటు
* సబల ప్రాంతీయ సదస్సులో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
కడప: మహిళను బలోపేతం చేయడమే.. “సబల” లక్ష్యం అని.. ఉద్యోగ విధుల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని.. మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.
బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని సభాభవన్ లో.. రాష్ట్ర మహిళా కమిషన్, స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సంయుక్తంగా “సబల – ఆమెకు అండగా ఆంధ్రప్రదేశ్” పేరుతో.. వైఎస్ఆర్, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల పరిధిలోని ఉద్యోగినులు, ప్రతినిధులకు ప్రాంతీయ సదస్సును నిర్వహించారు.
ఈ సదస్సుకు ప్రధానాధ్యక్షులుగా.. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ హాజరు కాగా.. రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్ మయాన జకీయా ఖానమ్ లు హాజరు కాగా.. జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, వైఎస్ఆర్ జిల్లాపరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఏపి ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) ఎం. గౌతమి, ఎ.పి. సీఐడీ అడిషనల్ ఎస్సీ కె.జి.వి.సరిత, స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్మన్ ఈదా శామ్యూల్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా.. హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. ప్రభుత్వ శాఖల్లోని మహిళా ఉద్యోగుల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు రాష్ట్ర మహిళా కమిషన్, స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ సదస్సులు నిర్వహించడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా ఈనెల 16న గుంటూరు జిల్లాలో, 23న ఏలూరులో నిర్వహించడం జరిగిందన్నారు..ప్రస్తుతం రాయలసీమ జిల్లాలకు నిర్వహిస్తున్నామని.. ఏప్రిల్ 6న ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ… ఈ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఉద్యోగ విధులు నిర్వహించే కార్యాలయాల్లో, పని ప్రదేశాల్లో మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్లు తెలిస్తే.. వేధింపులకు పాల్పడేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా కమీషన్ ఆధ్వర్యంలో… ఉద్యోగ విధుల్లో లైంగిక వేధింపుల నిరోధానికి పటిష్టమైన చర్యలు తీసుకుంతోందన్నారు. మహిళలు వారి సమస్యలను ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు తాజాగా “సబల” వాట్సాప్ నెంబర్ : 6302666254 ను ఆవిష్కరించడం జరిగిందన్నారు. ఈ వాట్సాప్ రెండు వారాల్లోనే వందలకు పైగా పిర్యాదులు అందాయన్నారు.
వీటిపై తొలిదశలో శాఖాపరమైన విచారణను నిర్వహించి.. అక్కడ న్యాయం జరగని పక్షంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఐ.సి.సి. కమిటీలో సంబందిత ఫిర్యాదులను పరిష్కరించడం జరుగుతుందన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిర్యాదుల విభాగం (ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ) ఏర్పాటు చేయాలని అన్నారు. మహిళల భద్రత కోసం రక్షణ కోసం తీసుకువచ్చిన దిశ యాప్ మహిళల రక్షణకు బ్రహ్మాస్త్రంగా నిలుస్తుందన్నారు .ఈ యాప్ ద్వారా మంచి ఫలితాలు అందుతున్నాయని అన్నారు. మహిళా ఉద్యోగినుల కోసం అన్ని కార్యాలయాల్లో ప్రత్యేక టాయిలెట్ సౌకర్యం, రెస్ట్ రూములు ఏర్పాటు చేయాలన్నారు.
శాసన మండలి ఉప చైర్ పర్సన్ జఖియా ఖానం మాట్లాడుతూ.. మహిళ అంటేనే సమాజానికి ఒక స్ఫూర్తి అన్నారు. నిద్రాణంలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని మేల్కొలిపేందుకే.. రాష్ట్ర మహిళా కమీషన్ “సబల” కార్యక్రమాన్ని మనముందుకు తీసుకువచ్చిందన్నారు. సమాజంలో మహిళలకు సంబందించిన అతి సున్నితమైన సమస్యలను బహిర్గతం చేసి.. ఫిర్యాదుల రూపంలో పరిష్కరించేందుకు నడుం బిగించిన రాష్ట మహిళా కమీషన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. కార్యాలయాలు, పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించేందుకు సహకారం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సేవలు అభినందనీయం అన్నారు.
జిల్లా కలెక్టర్ విజయ్ రామరాజు మాట్లాడుతూ.. మహిళల రక్షణ, సాంఘిక నేరాలను అదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సేవలు ప్రశంసనీయం అన్నారు. అయితే.. ప్రస్తుత సమాజంలో.. అత్యంత వేగంగా విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం అయిన ఇంటర్నెట్ చిన్న పిల్లలను, యువతను అత్యంత ప్రభావితం చేస్తోందన్నారు. అధునాతన సాంకేతికత సమాజ హితం కోసం ఎంత ఉపయోగ పడగలదో.. అంతే దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. కుటుంబ పరిధిలో స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, ఇంటర్నెట్ వంటి సాంకేతికతను.. వినియోగించడంలో ఒక నియంత్రణ లేకపోతే.. పిల్లలు, యువత పక్కదారి పట్టె అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు. కుటుంబంలో సభ్యులందరి మధ్య స్నేహపూరిత వాతావరణం, ఆప్యాయతానురాగం వున్నపుడే.. సత్ప్రవర్తనతో పిల్లలు మెలుగుతారన్నారు.
కడప జెడ్పి ఛైర్మెన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర మహిళా కమిషన్, స్పందన ఈదా ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. ఆవిష్కరించిన “సబల” వాట్సాప్ మెంబర్.. రాష్ట్రంలోని మహిళలకు కొండంత ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందుస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అని.. మహిళలకు అన్ని అంశాల్లోనూ అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. మహిళలను అన్ని విషయాలలో ముందు వరుసలో నిలిపిన ప్రభుత్వం.. మహిళల స్వీయ రక్షణకు కల్పించిన చట్టాలను ప్రతి మహిళా సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) గౌతమి మాట్లాడుతూ.. మహిళలకు భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. మహిళలు వేధింపులకు గురయ్యే పరిస్థితులను నిర్భయంగా ఫిర్యాదు చేసి తగు రక్షణ పొందాలన్నారు. ముందుగా.. నీ బలం, నీ బలహీనతలను తెలుసుకోవాలి.. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ధైర్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. ప్రతి మహిళా స్వీయ రక్షణతో పాటు.. సమాజ రక్షణకు కూడా పాటుపడేలా.. మహిళలు దృడంగా తయారవ్వాలన్నారు. ప్రతి ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాయాల్లో మహిళలు వారి సమస్యలను ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు తాజాగా రాష్ట్ర మహిళా కమీషన్ రూపొందించిన “సబల” వాట్సాప్ నెంబర్ ను మరింత ప్రచారంలోకి తీసుకురావాలన్నారు.
ఎ.పి. సీఐడీ అడిషనల్ ఎస్సీ కె.జి.వి.సరిత మాట్లాడుతూ.. ఆడది అబల కాదు.. సబల ! అన్న.. మాటను “సభల” కార్యక్రమం నిజం చేస్తోందన్నారు. సమాజంలో మహిళలు తనకు తాను ధైర్యం అనే రక్షణ కవచం ఏర్పరుచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో తప్పకుండా ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. 10 మంది లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్నచోట నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ గా మహిళా ఉద్యోగిని, మహిళల సమస్యలపై వెంటనే స్పందించి, వారి సంక్షేమం కోసం పాటు పడే ఒక ఎన్జీవో, మరో ఇద్దరు సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు.
కార్యక్రమానికి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన గౌరవ ముఖ్య అతిధులు.. సబల అంశంపై ప్రసంగాలు చేశారు. అనంతరం నాలుగు జిల్లాల నుండి హాజరైన పలువురు ఫిర్యాదుదారులు.. మహిళా కమీషన్ సభ్యులకు వినతి పత్రాలు సమర్పించారు. అనంతరం గౌరవ అతిథులకు సత్కారం జరిగింది.ఈ సదస్సులో.. ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్. చంద్రశేఖర్ రెడ్డి, స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్మన్ శామ్యూల్ రెడ్డి, మహిళా కమిషన్ సభ్యురాలు లక్ష్మీ, ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీఎన్జీవో (మహిళ) చైర్మన్ వి.నిర్మలా కుమారి, మహిళా కమిషన్ కార్యదర్శి శైలజ, వివిధ సంఘాల నాయకులు ఎం.రాజ్యలక్ష్మి, నిర్మల జ్యోతి తదితరులు విశిష్ట అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.
ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధులుగా.. రాష్ట్ర ఏపీఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షులు కె. రామ సూర్యనారాయణ, ఏపి సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షులు కె. వెంకట్రామిరెడ్డి, ఏపిఎన్జీవో మహిళా విభాగం రాష్ట్ర చైర్ పర్సన్ వి. నిర్మలాకుమారి, పులివెందుల, ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహశీల్దార్, ఏపీ జేఎస్ మహిళా విభాగం చైర్ పర్సన్ ఎం. మేరీ విజయ కుమారి, ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.శివారెడ్డి, ఏపీజేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆలిండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ మెంబర్ ఎం. రాజ్యలక్ష్మి, ఏపీ జేఏసీ విమెన్ వింగ్ స్టేట్ కో చైర్మన్ కె.నాగమణి, ఏపి మహిళా కమిషన్ మెంబర్లు గజ్జల లక్ష్మి, షేక్ రుకియాబేగం, కార్యదర్శి శైలజ తదితరులు హాజరై ప్రసంగించగా.. జిల్లా ఐసిడిఎస్ పిడి పద్మజ, రాయలసీమ జిల్లాల మహిళ ఎన్జీఓ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.