-130 కు పైగా వినతులు స్వీకరించిన విజయసాయి రెడ్డి
– అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పలు వినతులు పరిష్కారం
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తరువాత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సిజిహెచ్ఎస్ (సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీసెస్) అదనపు డైరెక్టర్ కార్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయలేదని, ఫలితంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు తమ ట్రీట్ మెంట్ బిల్లులు, రిఫరల్ ఆసుపత్రులకు సంబంధించిన పనుల కోసం హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుందని, ఒక్క విశాఖపట్నంలోనే 25వేల కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలు నివసిస్తున్నాయని, సుమారు లక్ష మంది లబ్ధిదారులు ఉన్నారని సీతమ్మధార కు చెందిన బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ వి ఆర్ కే శర్మ వినతి పత్రం అందించారు. అడిషనల్ డైరెక్టర్ కార్యాలయం విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని కోరారు.
శుక్రవారం సీతమ్మధారలోని ఎంపీ విజయసాయి రెడ్డి కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వినతులు, పిర్యాదులు అందజేశారు. నమ్మివానిపేటకు చెందిన నమ్మి గంగులు, పీతల లోకేష్ లు తాము జివిఎంసి లో గత 10 సంవత్సరాలుగా వేయింగ్ మెషిన్ లో కాంట్రాక్టర్ వద్ద పనిచేసామని, కాంట్రాక్ట్ కాలపరిమితి ముగియడంతో ఉద్యోగం నుంచి తొలగించారని, సుమారు 15 మంది ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నామని ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా తమకు ఉద్యోగం కల్పించాలని కోరారు.
ఎంవిపి కాలనీలో హిడెన్ స్ప్రౌట్స్ పేరుతో మానసిక వికలాంగుల ఆశ్రమం నిర్వాహకులు, ఆశ్రమానికి స్థలం కేటాయించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. సీతమ్మధార, బాల వికాస్ ఫౌండేషన్ ఫౌండర్ నరవ ప్రకాష్ రావు, ఉడా చిల్డ్రన్ థియేటర్ లో చిన్న పిల్లలకు సంబందించి కార్యక్రమాలు కోవిడ్ కారణంగా నిలిపివేయడం జరిగిందని, తిరిగి వాటిని పునరుద్దరించాలని, పిల్లలకు ఆహ్లాదాన్ని, విజ్ఞానాన్ని అందించే కార్యక్రమాలు నిర్వహించాలని వినతిపత్రం అందించారు.
జీవీఎంసీ పరిధిలో ఆరిలోవ, శ్రీహరిపురంలలోని ఎఫ్ఆర్ యు (ఫస్ట్ రిఫరల్ యూనిట్) లలో పనిచేస్తున్న సుమారు 26 మంది వైద్యసిబ్బందికి గత నాలుగు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని, తామంతా రెడ్ క్రాస్, సీడ్స్ సంస్థల ఆద్వర్యంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నామని, బకాయి పడ్డ జీతాలు వెంటనే చెల్లించే ఏర్పాటు చేయడంతో పాటు తమను ఏపీ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ పరిధిలోకి చేర్చాలని కోరుతూ ఆరిలోవ ఎఫ్ ఆర్ యు వైద్య ఉద్యోగి మణి వినతి పత్రం అందించారు.
కోవిడ్-19 వైరస్ ఉధృతంగా ఉన్న సమయంలో సుమారు 40 మంది స్టాఫ్ నర్సులు వేర్వేరు ప్రాంతాల్లో కాంట్రాక్ట్ పద్దతిన ప్రభుత్వం నియమించిందని, కాంట్రాక్ట్ ముగియడంతో తామంతా నిరుద్యోగులుగా ఉండిపోయామని, కొందరు వేరే ఉద్యోగాలలో స్థిరపడ్డారని, మరికొంత మంది ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారని పేర్కొంటూ తమకు ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ నగరానికి చెందిన నాగలక్ష్మి, మరికొంత మంది నిరుద్యోగ యువతులు కోరారు. ఈ నెల 23, 24 లలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా లో పాల్గొనాలని విజయసాయి రెడ్డి వారిని సూచించారు.
విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో డాక్ లేబర్ బోర్డు డిపార్ట్ మెంట్ క్యాంటీన్ లో 15 సంవత్సరాలు పైబడి కాంట్రాక్ట్ పద్ధతిలో 28 మంది పనిచేసామని, 2010 వారందరినీ పోర్ట్ ట్రస్ట్ తొలగించిందని దీంతో తామంతా కేంద్ర ప్రభుత్వ అసిస్టెంట్ లేబర్ కమీషనర్ ద్వారా ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కం లేబర్ కోర్టును
ఆశ్రయించామని తాడిచెట్లపాలెం కి చెందిన పి సోమేశ్వరరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2019 లో కోర్టు నుంచి తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని, 4 నెలల్లో ఉద్యోగాల్లో పునర్మియమించాలని ఆదేశించినప్పటికీ పోర్టు అధికారుల నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదని చెప్పారు. తమను తిరిగి ఉద్యోగంలోకి తీసుకునే విధంగా సహకరించాలని కోరుతూ వినతి పత్రంలో కోరారు.
47 వ వార్డు పరిధిలో రాంజి ఎస్టే లో 1వతరగతినుండి 5వ తరగతి ప్రాథమిక పాఠశాల నిర్మించి ఉన్నది 6వతరగతి నుండి 10వ తరగతి చదువుకోవటానికి నేషనల్ హైవే రెండు రోడ్డు దాటి వెళ్ళాల్సి రావడంతో కొండప్రాంతములో ఉన్న బాపూజ నగర్, అంబేద్కర్ ఎస్టే, సురేష్ రామ్ నగర్, చంద్రగిరినగర్, జగ్గజీవనగర్, అరుంధతినగర్, రాంజిఎస్టే, సీపర్ కొలని, పెద్దకొత్తూరు కప్పరాడ, జైప్రకాష్ నగర్, తిక్కవానపాలెం కొలని, సంజీవయ్య కొలనికి చెందిన స్కూల్ పిల్లలు ప్రమాదాలకు గురవుతున్నారు.
కావున రాంజిఎస్టే, స్కూల్ లో 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు పొడిగించాలని కోరుతూ 47 వ వార్డు కార్పోరేటర్ కంటిపాము కామేశ్వరి వినతిపత్రం సమర్పించారు. కేఆర్ఎం కాలనీకి చెందిన పి వెంకటేశ్వరరావు, తన స్థలంలో (ప్రైవేట్ ప్రాపర్టీ) లో జీవీఎంసీ అధికారులు రోడ్డు వేయడం జరిగిందని, సర్వే జరిపించి తన స్థలం తనకు ఇప్పించాలని కోరారు.
చిన్న ముసిరివాడ కు చెందిన విజయలక్ష్మి తన కుమార్తెకు ఇచ్చిన ఇంటి పట్టాలో తండ్రి పేరు తప్పుగా పడిందని, పట్లాలో పేరు సరి చేయాలని కోరుతూ వినతిపత్రం అందించారు. నర్సీపట్నం కి చెందిన పోలిరెడ్డి శ్రీను, పాండ్రంకి కి చెందిన ఎం శంకర్ రావు తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగం కోసం ఈ నెల 23, 24న ఆంధ్ర యూనివర్శిటీలో నిర్వహించనున్న జాబ్ మేళాలో పాల్గొనాలని ఎంపీ విజయసాయి రెడ్డి సూచించారు.
తాడిచెట్లపాలెం కి చెందిన దివ్యాంగుడు వాసుదేవరావు తనకు ఉద్యోగం ఇప్పించాలని వినతిపత్రం సమర్పించారు. అగనంపూడి కి చెందిన పార్వతి, తన స్థలం అదే గ్రామానికి చెందిన కొందరు బలవంతంగా ఆక్రమించుకున్నారని, తన స్థలం తనకు తిరిగి ఇప్పించాలిని కోరుతూ వినతి పత్రం అందించారు. గాజువాక శ్రీనగర్ లో నివాసం ఉంటున్న వెంకటరావు, తనకు 80 శాతం అంగవైకల్యం ఉందని, , వికలాంగుల పెన్షన్ ఇప్పించాలని కోరారు.
పెన్సన్లు ఇప్పించాలని, ఉద్యోగాలు ఇప్పించాలని, పలు రకాల వ్యక్తిగత వినతులతో పలువురు ప్రజా దర్బార్ లో వినతులు సమర్పించారు. ప్రజాదర్బార్ కు వచ్చిన దివ్యాంగులు, ఆరోగ్యం సహకరించని వారికి ప్రాధాన్యత కల్పిస్తూ వారి వద్ద నుండి మెదటిగా వినతులు స్వీకరించారు. పలు వినతులపై సంబంధిత అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి సమస్యలు పరిష్కరించారు.