Suryaa.co.in

Andhra Pradesh

టిడిపికి అధికారం ఇప్పుడు చారిత్రిక అవసరం

– రాష్ట్రం మిగిలి ఉండాలంటే…టిడిపి అధికారంలోకి రావాలి
-సామాన్యులను చిదిమేసి…సామాజిక న్యాయం అంటారా?
-బాదుడే బాదుడుపై పార్టీ సమీక్ష లో టిడిపి అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు
– 2019లో తప్పు జరిగిందని ప్రజలే బాధపడుతున్నారన్న నేతలు

అమరావతి:-ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావడం చారిత్రిక అవసరం అని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రానికి భవిష్యత్ ఉండాలి అంటే వచ్చే ఎన్నికల్లో వైసిపి ఓటమి చెందాల్సిందే అని ఆయన అన్నారు. తన విధానాలతో అన్ని వర్గాల ప్రజలను తీవ్రంగా నష్టపరిచిన వైసిపి పాలన అంతం కావాలని….దాని కోసం టిడిపి శ్రేణులు నడుంబిగించాలని చంద్రబాబు సూచించారు.

టిడిపి గెలుపు అనేది కేవలం పార్టీ కోసమే కాదని….రాష్ట్రం కోసమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పెంచిన కరెంట్ చార్జీలు, పన్నులు, నిత్యావసర ధరల భారంపై టిడిపి తలపెట్టిన బాదుడే బాదుడు కార్యక్రమం పై చంద్రబాబు రివ్యూ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయిలో జరుగుతున్న బాదుడే బాదుడు పై మండలాధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జులతో చంద్రబాబు వీడియో సమావేశం ద్వారా సమీక్ష జరిపారు.

బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా సిఎం జగన్ నిర్ణయాలతో జరుగుతున్న నష్టం, భారంపై విస్తృతంగా ప్రచారం చేయాలని చంద్రబాబు సూచించారు.
తాను కూడా ఈ కార్యక్రమం పలు చోట్ల పాల్గొంటానని తెలిపారు. మిగులు విద్యుత్ గా ఉండే రాష్ట్రంలో ఈ స్థాయి కరెంట్ కష్టాలకు జగన్ విధానాలే కారణం అనే విషయాన్ని ప్రజలకు సవివరంగా చెప్పాలన్నారు. పరిశ్రమలకు పవర్ హాలిడే ద్వారా లక్షల మంది ఉపాధి కోల్పోతారని చంద్రబాబు అన్నారు. మూడేళ్లలో 7 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి 16 వేల కోట్లు ప్రజల జేబుల నుంచి లాక్కుంటున్నారని…ఇవన్నీ ప్రజలకు వివరించాలని చంద్రబాబు నేతలకు సూచించారు.

ఇక చెత్త పన్నులు, ప్రపర్టీ ట్యాక్స్ ద్వారా ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నారని చంద్రబాబు అన్నారు. రిజిస్ట్రేషన్ వాల్యూలో 15 శాతం ప్రాపర్టీ టాక్స్ రూపంలో వసూలుతో ప్రజల జేబులు గుల్ల అవుతాయని చంద్రబాబు అన్నారు. శ్రీలంక ప్రకటించినట్లు…ఎపి కూడా దీవాళా తీసినట్లు సిఎం జగన్ ప్రకటిస్తారేమో అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలను చిదిమేసి…ఇప్పుడు సామాజిక న్యాయం అంటారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆయా వర్గాల ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చెయ్యకుండా రెండు పదువులు ఇచ్చి సామాజిక న్యాయం అని వైసిపి చెప్పుకోవడాన్ని టిడిపి అధినేత చంద్రబాబు తప్పు పట్టారు.

2019 లో తప్పు జరిగిందనే భావనలో ప్రజలు:-
వీడియో కాన్ఫరెన్స్ లో బాదుడే బాదుడు కార్యక్రమం జరుగుతున్న తీరుపై కొందరునేతలు తమ అనుభవాలు పంచుకున్నారు. పన్నుల భారం, ప్రభుత్వ వైఫల్యాలపై జనం వద్దకు వెళుతుంటే వారి నుంచి తమకు అద్భుత స్పందన వస్తుందని నేతలు వివరించారు. ప్రభుత్వ వ్యతిరేకత ప్రతిచోటా, అన్ని వర్గాలలో కనిపిస్తుందని నేతలు వివరించారు.

2019 ఎన్నికల్లో తప్పు జరిగింది అనే భావన ప్రజల్లో ఉందని….అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు తెలుగుదేశం అవసరాన్ని గుర్తించారని పార్టీనేతలు తెలిపారు. బాధలతో విసిగిపోయిన ప్రజలు ఇప్పుడు ప్రభుత్వంపై తీవ్రమైన కసితో ఉన్నారని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE