– ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ విజయసాయిరెడ్డి హామీ
విశాఖపట్నం, ఏప్రిల్ 24: విశాఖ బీచ్ రోడ్డులోని నేవల్కో స్టల్ బ్యాటరీ దగ్గర పోలామంబ, భూలోకమాంబ, కొత్తమాంబ అమ్మవార్ల ఆలయ నిర్మాణానికి రాజ్యసభ సభ్యులు వి. విజయసాయి రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ నగరంలో మత్స్యకారులు తమ కులదైవంగా భావించే ఈ అమ్మవార్ల ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. సిమెంటుతో ఈ ఆలయ నిర్మాణం చేపడితే ఎక్కువ కాలం మన్నదన్న భావన వ్యక్తం చేసిన ఆయన పూర్తి స్థాయిలో గ్రానైట్, మార్బుల్ రాళ్లతో ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పారు. ఆలయ నిర్మాణానికి అయ్యే ఖర్చు పూర్తిగా తానే భరిస్తానని స్థానిక మత్స్యకారులకు ఆయన హామీ ఇచ్చారు. వేయ్యేళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా ఈ ఆలయ నిర్మాణం చేపడతానని ఆయన వెల్లడించారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ యాదవ్, వరుదు కళ్యాణి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్, సింహాచలం అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు, స్థానిక మత్స్యకార నాయకులు తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు హయాంతో పోలిస్తే ప్రస్తుతం నేరాలు తగ్గుముఖం పట్టాయి…
గత తెలుగుదేశం పార్టీ హయంతో పోలిస్తే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ కాలంలో నేరాలు చాలా తగ్గుముఖం పట్టాయని విజయసాయిరెడ్డి వెల్లడించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.
సమాజంలో ఎవరో ఒకరు తప్పు చేస్తే, సమాజంలోని అందరినీ నిందించడం సరికాదని చంద్రబాబుకి ఆయన హితవు పలికారు. తప్పు చేసే వారిని తప్పకుండా చట్టం శిక్షిస్తుందని తెలిపారు. చంద్రబాబుకు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చారని తెలుసు కానీ ఎందుకు నోటీసులు ఇచ్చారనేది తనకు పూర్తిగా తెలియదని చెప్పారు. చట్ట వ్యతిరేకంగా నోటీసులు ఇస్తే న్యాయస్థానాలలో వాటిని ఛాలెంజ్ చెయ్యవచ్చని సలహా ఇచ్చారు. నోటీసు ఇవ్వటం తప్పో ఒప్పో న్యాయస్థానాలు నిర్ణయిస్తాయని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాల సంఖ్య చూస్తే చంద్రబాబు హయాం కన్నా ఈ ప్రభుత్వ హయంలో అవి వరకు తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు.