Suryaa.co.in

Andhra Pradesh

రైల్వేస్టేషన్లలో మహిళల భద్రత, రక్షణపై చర్యలేంటి..?

– రైల్వే జీఎం, జీఆర్పీ ఎస్పీలకు ‘మహిళా కమిషన్’ లేఖలు
– బాధ్యుల వ్యక్తిగత హాజరుతో వివరణకు ఆదేశాలు
– గురజాల, రేపల్లె ఘటనలపై జాతీయ మహిళా కమిషన్ కు సిఫార్సు లేఖ

అమరావతి:రైల్వేస్టేషన్ ల ఆవరణలు, రైళ్లల్లో ప్రయాణించే మహిళల భద్రత, రక్షణకు సంబంధించి చర్యలపై రాష్ర్ట మహిళా కమిషన్ ఆయా శాఖలను వివరణ కోరింది. ఇటీవల గురజాల రైల్వేహాల్టు, రేపల్లె రైల్వేస్టేషన్లలో చోటుచేసుకున్న అత్యాచార ఘటనల నేపథ్యంలో బుధవారం రాష్ట్ర మహిళా కమిషన్ నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంకు, గవర్నమెంట్ రైల్వే పోలీస్ ఎస్పీలకు లేఖలు వెళ్లాయి. స్టేషన్ల ఆవరణల్లో ఫ్లాట్ ఫామ్ లపై మహిళలు, బాలికలకు ప్రత్యేకంగా వేచి ఉండు విశ్రాంతి గదులు, లైటింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు, తాగునీరు, వాష్ రూమ్ ల వంటి ఇతర సౌకర్యాలపై రైల్వేశాఖ ఇప్పటికే ఎలాంటి చర్యలు తీసుకుందనే విషయాన్ని తెలపాలని.. భవిష్యత్తు ప్రణాళిక ఏవిధంగా ఉండబోతుందని కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ లేఖలో ప్రశ్నించారు.

అదేవిధంగా రైల్వేశాఖ పోలీసు ఆధ్వర్యంలో సిబ్బంది కేటాయింపు, స్టేషను పరిధిలో గస్తీ, అనుమానితుల తనిఖీలు, ఫ్లాట్ ఫాంలపై ఫిర్యాదుల బాక్సుల ఏర్పాట్లకు సంబంధించి వివరణ కోరుతూ గుంతకల్లు రైల్వే డివిజన్ ఎస్పీకి లేఖను పంపారు. ఇప్పటికే రెండుచోట్ల జరిగిన అత్యాచార ఘటనలపై కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రైల్వే ఎస్పీతో ఫోన్ లో మాట్లాడిన సంగతి తెలిసిందే.. ఆయాశాఖల నుంచి బాధ్యులను మహిళా కమిషన్ కు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా లేఖల్లో ఆదేశించారు. అదేవిధంగా గురజాల రైల్వేహాల్ట్, రేపల్లె రైల్వే స్టేషన్ లలో జరిగిన ఘటనలను జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ర్ట కమిషన్ ఒక లేఖను రాసింది. ఇలాంటి ఘటనలపై కేంద్ర రైల్వేశాఖను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తాను రాసిన లేఖలో జాతీయ మహిళా కమిషన్ ను కోరారు.

LEAVE A RESPONSE