– జగనన్న కంటే జడ్జిలే ఎక్కువా ఏంటి?
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘‘ వాలంటీర్లు లబ్దిదారులను ఎలా నిర్ణయిస్తారు? ఈ వ్యవస్థకు చట్టబద్ధత ఉందా? వారేమైనా ప్రభుత్వ ఉద్యోగులా? వారికి సర్వీసు రూల్సేమైనా ఉన్నాయా? లబ్ధిదారుల ఎంపికలో వాలంటీర్ల జోక్యం ఎందుకు? పంచాయితీరాజ్, ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నప్పుడు వాలంటీర్లు ఎందుకు ఎంపిక చేస్తున్నారు? ప్రభుత్వ పథకాలు ఎంపిక చేసేందుకు వారికున్న అధికారం ఏమిటి?’’- ఇవీ.. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, ఒక కేసులో ప్రభుత్వ న్యాయవాదికి సంధించిన తాజా ప్రశ్నలు.
అయితే.. ఈ ప్రశ్నలు సంధించిన న్యాయమూర్తి చాలా సీనియర్. ఆయనకు సమాజం, అందులోని వ్యక్తులు, వివిధ వ్యవస్థలపై ఆధారపడి బతికే వారిపై చాలా చిత్తశుద్ధి ఉంది. నిజానికి ఆయన ఇచ్చిన తీర్పుల వల్లే, చాలామంది బాధితులకు న్యాయం కూడా జరిగింది. ప్రజాజీవనాన్ని నిశితంగా గమనించి అతికొద్దిమంది న్యాయమూర్తుల్లో ఆయనొకరు. అధికార సోషల్‌మీడియా చేసిన ట్రోల్స్‌కు ఆయనా ఒక బాధితుడే. అది వేరే విషయం!
అయినా సరే… జగనన్న తీసుకుంటున్న నిర్ణయాలను ఆక్షేపించడమే కాకుండా, ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించటం ఏమీ బాగోలేదన్నది జగనన్న అభిమానుల ఆవేదన. 151మంది ఎమ్మెల్యేల బలమున్న జగనన్న సర్కారు తీసుకునే నిర్ణయాలను.. అన్ని వ్యవస్థల మాదిరిగా న్యాయవ్యవస్థ కూడా జీహుజూరంటూ ఆమోదించాలే తప్ప.. ప్రశ్నించటం, ఆక్షేపించడం, నోటీసులిచ్చి కోర్టుకు రమ్మని ఆదేశించడం కుదరదన్నది జగనన్న వీరాభిమానుల మనోగతం. జగనన్న ఒక నిర్ణయం తీసుకున్నారంటే , అది శిలాశాసనం. దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న జగనన్న, ఏ నిర్ణయం ఊరక తీసుకోరు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అది లోక కల్యాణం కోసమే. దానికో లెక్కుంటుంది. దానిని ప్రశ్నించటం మహా పాపం!
అసలు వాలంటీర్లంటే ఎవరు? ఎమ్మెల్యేలకంటే ఎక్కువ. ఎమ్మెల్యేలదేముంది? ఈరోజు ఈ పార్టీలో ఉంటారు. గాలి బాగా లేకపోతే రేపు ఇంకో పార్టీకి వెళతారు. కానీ వాలంటీర్లు అలాకాదు. వారికి కేటాయించిన ఇళ్లలో ఏం జరుగుతోంది? వాళ్లెవరు? ఏ కులం వారు? ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఏ పార్టీకి మద్దతుదారులు? వాళ్లకు సర్కారు స్కీములు ఇస్తే వైసీపీకి లాభమా? నష్టమా? ఎగస్పార్టీ వాడయితే ఎన్ని స్కీములకు కతె్తర వేయాలి? వారిని ఎలా దారికి తెచ్చుకోవాలి? ఇది కదా.. వారికి అప్పగించిన బాధ్యతలు! అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఆ ఆణిముత్యాలంతా వైసీపీ నిఘా దళాలు. సర్కారు వేగులంటే జీతం కోసం పనిచేస్తారు. లక్షాతొంభై మొమాటాలుంటాయి. కొలువుగాళ్లు కాబట్టి రూల్సు, రూళ ్లకర్రలుంటాయి. కానీ వాలంటీర్లంటే, వారి గుండెల్లో జగనన్న గుడి కట్టుకుని ఉంటారు. కాబట్టి ఆటోమేటిగ్గా కమిట్మెంట్ ఎక్కువ ఉంటుంది.
సో.. న్యాయమూర్తిగారు మూలాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అందుకే తెలియక.. అలా జగనన్న సృష్టించిన సమాంతర వ్యవస్థను ప్రశ్నించి ఉంటారు. సరే… వాలంటీర్ల గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే, గతంలో విజయసాయన్న మైకులో చెప్పిన వాస్తవాలు గమనిస్తే సరి. అన్నీ అటోమేటిగ్గా తెలిసిపోతాయి. అన్నట్లు విజయసాయన్న వాలంటీర్ల గురించి ఏమన్నారో ఓసారి వెనక్కిపోదాం.
అది వాలంటీర్ల కోసం ఏర్పాటు చేసిన సమావేశం. వేదికపైన వైసీపీలో ‘నెంబర్ టూ’ విజయసాయిరెడ్డి మైకందుకున్నారు. ‘‘ మనం వాలంటీర్లను నియమించుకున్నాం. గవర్నమెంటులోకి తీసుకున్నాం. దాంట్లో నేను కచ్చితంగా చెప్పగలను. నాదగ్గర ఫిగర్స్ ఉన్నాయి కాబట్టి , 90 శాతం మంది మన కార్యకర్తలకే ఆ
వాలంటీర్ ఉద్యోగం రావడం జరిగింది. గ్రామ సెక్రటేరియేట్ ఉద్యోగాల విషయానికొస్తే, మనకున్న పొలిటికల్ కంపల్షన్స్ వల్ల కాదు. లీగల్ కంపల్షన్ల వల్ల ఎవరికైతే క్వాలిఫికేన్లు ఉండి, మంచి మార్కులు వచ్చాయో వారిని మాత్రమే సెలెక్ట్ చేయాల్సిన పరిస్థితి. దానిలో కూడా మన పార్టీ కార్యకర్తలే చాలమంది ఎంపిక య్యారు’’ అని వైసీపీ కార్తకర్తల పెదవులపై చిరునవ్వులు పూయించే ప్రయత్నం చేశారు. ఆ ఆనందోత్సాహ సమావేశ దృశ్య-శ్రవణాలన్నీ అన్ని చానెళ్లు ప్రసారం చేశాయి కాబట్టి, అందులో సీక్రెట్ యవ్వారమేమీ లేదు.
కాబట్టి వాలంటీర్ల ఘనత, వైకాపా కార్యకర్తలను మాత్రమే జగనన్న సర్కారు ఎందుకు ఎంపిక చేసుకుందని.. ప్రభుత్వం నుంచి వచ్చే అఫిడవిట్ వరకూ ఎదురుచూడకుండా, న్యాయమూర్తి గారు ఆ వీడియోలు, పేపర్ క్లిప్పింగులు చూస్తే కేసును మరింత వీజీగా అర్ధం చేసుకోవచ్చు. దీన్నిబట్టి.. లోకకల్యాణం కోసమే జగనన్న తన పార్టీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించి, అన్ని వ్యవస్థలపై ‘చేయి చేసుకుంటున్నార’ని గ్రహిస్తే మంచిది.
అయినా పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపిఎస్ ఆఫీసర్లు, సీఎస్ అంతలావు అధికారులే జగనన్న సర్కారు చెప్పింది వింటున్నారు. చెప్పింది చెప్పినట్లు చేస్తున్నారు. పెట్టమన్న చోట సంతకం పెడుతున్నారు. వారి మాదిరిగానే మౌనంగా ఉండి ఏదో రోజులు దొర్లించకుండా, ఈ న్యాయస్థానాలేమిటి.. చట్టం, రూల్సు అంటూ ఎందుకు ప్రశ్నిస్తున్నాయి? ఆ రూల్సెందుకు పాటించలేదు? ఆ నిబంధనను ఎందుకు ఉల్లంఘించారని ప్రశ్నిస్తే.. జనం మాకు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించింది ఎందుకు? మాకు ఎమ్మెల్యేల బలం ఉంది కాబట్టి మేం చెప్పిందే ఫైనల్. అట్లంటుది మనతోని!
రాష్ట్రంలో జగనన్నే జడ్జి. ఆయనిచ్చిందే తీర్పు. అదే శిలాశాసనం. జడ్జిలు వస్తుంటారు. పోతుంటారు. లేకపోతే మేమే ఫిర్యాదు చేసి పంపేసే ప్రయత్నం చేస్తాం. జస్టిస్ ఎన్వీ రమణకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయలేదా? సరే.. ఆయన చీఫ్ జస్టిస్ అయిన తర్వాత ఆయనతో బెజవాడ స్టార్ హోటర్‌లో భేటీ వేశారనుకోండి. అదివేరే విషయం. అయినా జగనన్న లోకల్. అసలు అంతలావు జగనన్న తీసుకున్న నిర్ణయాలనే ప్రశ్నించడానికి కోర్టులది గుండెనా? చెరువా? అన్నది జగనన్న అభిమానుల ప్రశ్న. న్యాయాభిమానులూ… మీకు అర్ధమవుతోందా?