అమ్మకి నువ్వే అన్నీ!

అమ్మకి నమస్సులతో..

అన్నం పరబ్రహ్మ స్వరూపం..
మరి ఆ అన్నం పెట్టే అమ్మ
అంతకు మించిన దైవరూపం!

నీ ప్రపంచం
ఎంత పెద్దదైనా కాని
అమ్మకి నువ్వే ప్రపంచం..
అమ్మ కూడా ఒకనాడు
నీలాగే పుట్టింటి మహారాణి..
చదువుల శ్రీవాణి..
అమ్మానాన్నల
ముద్దుల పూబోణి…
తన స్నేహితులు.. చదువులు..ఆటలు..పాటలు
అబ్బో..
ఆమెదీ ఓ పెద్ద ప్రపంచం..!
ఈలోగా ఆమెకీ
ఓ చక్కని ఉద్యోగం…
పెద్ద జీతం..
కుదురుకునే లోగానే పెళ్లి..
కొత్త చోటు..
సరికొత్త వాతావరణం..
అప్పుడు పెనిమిటే లోకం…
అంత కొత్త ప్రపంచంలో
బాగా తెలిసిన మనిషి..
తన మనీషి..
అతగాడి చుట్టూనే
తన కలలు..
అంతలోనే
కడుపులో పడ్డ నువ్వు
కనిపించకుండానే
మురిపించే నీ నవ్వు..
అంతే..
అమ్మ ప్రపంచం మారిపోయింది..
అప్పటి వరకు
నాన్నే తన సర్వం..
చేస్తున్న ఉద్యోగమే గర్వం..
ఇక మొదలయినట్టే
నీ పర్వం!

ఇక నువ్వే అమ్మ లోకం..
నీ బొబ్బ..నీ బువ్వ..
నీ లాల.. నీ జోల..
పొద్దున్న లేస్తే నీ గొలే…
పనిలో ఉన్నా..
గనిలో ఉన్నా..
కార్ఖానాలో ఉన్నా..
నీ మీదే దృష్టి..
కొంచెం పెద్ధయితే
నీ చదువు..
ఆపై నీ పెళ్లి..నీ పిల్లలు
మరోసారి సేవకు సిద్ధం..
తన ముదిమిని మరచి
శేషజీవితం కూడా
నీ సేవకై అంకితం..
ఇన్ని చేసిన అమ్మ రుణం
నువ్వు తీర్చుకునేదెలా..
ఆమ్మని బరువనుకోక
నీ దేవతని పూజించు..
నీ ఆప్యాయత ఆమెకి
శతాయుష్షు..
ఒక్కటి గుర్తుపెట్టుకో..
తాను మరణించాక కూడా
ప్రేమించేది అమ్మే..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply