-మీ కుటుంబం సంపద పెంచుకుని ప్రజల చేతికి చిప్ప మిగిల్చారు
-కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులపై చర్చిద్దామంటే ముఖం ఎందుకు చాటేస్తున్నరు?
-కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్?
-మతపరమైన రిజర్వేషన్లు, ఉద్యోగాలకు బీజేపీ వ్యతిరేకమని ఉద్ఘాటన
-గ్రూప్-1 పరీక్షలో ఉర్దూను చేర్చి ఎంఐఎంకు పోస్టులన్నీ అమ్మేసుకున్నారని వ్యాఖ్య
-పాదయాత్ర ముగింపు సభతో చరిత్ర సృష్టిస్తారని వెల్లడి
-26వ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో పలువురు నేతలు బీజేపీలో చేరిక
తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చిందని ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు ఈ అంశంపై చర్చిద్దామంటే ఎందుకు మొఖం చాటేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. కేంద్రంపై ఏడుపు మానుకుని… టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఏం ఒరగపెట్టిందో చెప్పాలని సూచించారు. ప్రజలు కట్టిన పన్నులతో సంపద పెంచుకుని రుణాలిచ్చే స్థాయికి చేరుకున్న కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని మాత్రం అప్పులు పాల్జేసి ప్రజల చేతికి చిప్ప మిగిల్చిందని మండిపడ్డారు.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 26వ రోజు పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కుమార్ ఈరోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జడ్చర్ల మండలం కోడుగల్, ముక్తపల్లి గేట్ వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా కోడుగల్ వద్ద జడ్చర్ల బండి సంజయ్, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ మనోహర్ రెడ్డి, జడ్చర్ల పార్టీ నేత బాలా త్రిపుర సుందరి సమక్షంలో ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…
వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కలలు కంటున్నాయి. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. కాంగ్రెస్ కు 31 అసెంబ్లీ, 4 ఎంపీ సీట్లు ఇవ్వాలని ఒఫ్పందం కుదిరింది. కానీ పైకి మాత్రం రెండు పార్టీలు డ్రామా చేస్తున్నయ్. రెండు పార్టీలు కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం ఖాయం.
రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హతే టీఆర్ఎస్ కు లేదు. సీఎం కేసీఆర్ కండ కావరంతో బలుపెక్కి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తిరగరాస్తానని అన్నడు. ఒంటెద్దు పోకడలతో మతపరమైన రిజర్వేషన్లు కేసీఆర్ ఇస్తున్నడు. ఇది రాజ్యాంగంలో ఉందా? లేదు కదా…
ఉర్దూలో గ్రూప్-1 పరీక్ష రాసేందుకు అనుమతించడాన్ని మేం ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకిస్తం. దీనిద్వారా ఉద్యోగాలు పొందిన వ్యక్తులను బీజేపీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల నుండి తొలగిస్తాం… మళ్లీ ఆయా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇస్తాం… ఎందుకంటే మేం మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకం.
టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంకు దాసోహమైంది. గ్రూప్ -1 పోస్టులను ఎంఐఎంకు దారాధత్తం చేశారు. కోట్ల రూపాయలు దండుకునేందుకు రెండు పార్టీలు కుట్ర చేస్తున్నయ్. వారి ఆటలు సాగనీయబోం.
కేంద్రాన్ని అడగబోమని చెప్పడం సిగ్గు చేటు. ఒక్కో వ్యక్తిపై లక్ష అప్పు చేశారు. ఈరోజు ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రజలు చెల్లిస్తున్న పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం ఏం చేస్తున్నట్లు? రాష్ట్రాన్ని అప్పులు చేసి ప్రజల చేతికి చిప్ప మిగిల్చారు.
కేంద్రం తెలంగాణకు ఎన్ని నిధులిచ్చిందో పూర్తి వివరాలు వెల్లడించాం. చర్చకు సిద్ధమని సవాల్ విసిరాం. కానీ ముఖం చాటేసింది టీఆర్ఎస్సే. ప్రజలు మర్చిపోయారని తెలిసి మళ్లీ కొత్త డ్రామా స్టార్ట్ చేశారు. కేంద్రంపై ఏడవడం కాదు… ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏం ఒరగబెట్టిందో…ఎందుకు అప్పులు చేస్తోందో చెప్పండి.
తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబం బాగు పడ్డది. రుణాలిచ్చే స్థాయికి చేరుకుంది. కానీ రాష్ట్రాన్ని అప్పులపాల్జేసి ప్రజల చేతికి చిప్ప ఇచ్చారు.
ప్రజా సంగ్రామ యాత్ర-2 ముగింపు సభతో బీజేపీ తెలంగాణలో ఒక చరిత్ర స్రుష్టించబోతున్నం. రాష్ట్రంలో మార్పుకు ఈ సభ సంకేతం కాబోతోంది. కనీవినీ ఎరుగని రీతిలో పాదయాత్రను విజయవంతం చేసి సంచలనం సృష్టించబోతున్న.