– నారీ-భేరీకి డబ్బులు తీసుకుని మేకప్ చేసుకుని కూర్చొవడం లేదు
– నేను బాలకృష్ణ కంటే పెద్ద హీరోనే
– నన్ను కుక్క పిల్లలా ఆడుకున్నారు
– టీడీపీ నేత, సినీ నటి దివ్యవాణి
మీడియాతో మాట్లాడిన దివ్యవాణి ఇంకా ఏమన్నారంటే..
అమరావతి :నా బాధను మీడియాతో పంచుకోవడమే నేను చేసిన తప్పా? అచ్చెన్నాయుడు లాగా పార్టీ లేదు బొక్కా లేదు అని అన్నానా.?నేనేదో అన్నానని నన్ను తప్పు పట్టిన వాళ్లు.. పార్టీ లేదు బొక్కా లేదన్న అచ్చెన్నని ఏం శిక్షించారు? సాధినేని యామిని లాగా నేనేం విమర్శలు చేయలేదే.?
నాలాగా పార్టీలో ఇబ్బందులు పడేవారు చాలా మంది ఉన్నా.. కానీ వాళ్లకు పదవులు అవసరం కాబట్టి డాగ్స్ లా ఉంటున్నారు.
నారీ-భేరీకి డబ్బులు తీసుకుని మేకప్ చేసుకుని కూర్చొవడం లేదు. చంద్రబాబు నన్ను విసుక్కున్నా నేనేం బాధపడడం లేదు. చంద్రబాబు నా తండ్రి లాంటి వారు. నేను బాలకృష్ణ కంటే పెద్ద హీరోనే. చంద్రబాబు సతీమణిని విమర్శిస్తే.. ఆయనకంటే ముందు నేనే కౌంటర్ ఇచ్చాను. గౌరవం లేని చోట ఉండలేను. రాజీనామా లేఖను పార్టీకి పంపుతున్నా.
నేనేం తేడాగా మాట్లాడలేదే..? మతమార్పిడుల విషయంలో చంద్రబాబు చేసిన కామెంట్లు క్రైస్తవులు ఆగ్రహనికి గురయ్యారు. క్రైస్తవులు పడే బాధలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లలేకపోయాను. నేను ఇచ్చిన సమాచారంతో వేరే వారితో ప్రెస్ మీట్ పెట్టించారు.. నేను చాలా బాధ పడ్డాను.
నెమ్మదిగా టీడీపీలో నా డౌన్ ఫాల్ మొదలైంది.ప్రెస్ మీట్లు పెట్టడానికి నలుగురు దగ్గరకు తిప్పుతున్నారు. టీడీ జనార్జన్ అనే వ్యక్తిని ప్రశ్నించినందుకు నన్ను ఇబ్బందులు పెట్టారు. నన్ను కుక్క పిల్లలా ఆడుకున్నారు. కరివేపాకులా వాడుకుని వదిలేస్తారని నాకు చాలా మంది చెప్పినా వినలేదు.మహానాడు వేదిక మీద కూర్చొవడానికి వీల్లేదు.. మాట్లాడే అవకాశం లేదు.చంద్రబాబును ఉద్దేశించి నేను కామెంట్లు చేయడం లేదు. ఈ ప్రభుత్వం మీద నేను విమర్శలు చేసినా.. నన్ను ఏనాడూ ఇబ్బంది పెట్టలేదు.
అప్పుడు కవిత.. ఇప్పుడు దివ్యవాణి
టీడీపీకి సినీనటులు అచ్చివచ్చినట్లు లేదు. ముఖ్యంగా మాజీ హీరోయిన్లు పార్టీలోకి వచ్చి వెళుతున్నారు.జయప్రద, శారద, రోజా గతంలో టీడీపీలో ఒక వెలుగు వెలిగి, తర్వాత నిష్ర్కమించినవారే.
గతంలో వైజాగ్‌లో మహానాడు జరిగిన సందర్భంలో వేదికమీదకు వెళుతున్న సినీనటి కవితను సెక్యూరిటీ అడ్డుకొని, వెనక్కిపంపేశారు. దానితో ఆమె అక్కడే భోరున విలపించి టీడీపీని శాపనార్ధాలు పెట్టి మరీ వెళ్లిపోయారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆమెకు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పదవి ఇచ్చారు.
ఇప్పుడు మళ్లీ అదే టీడీపీలో, మరో మాజీ హీరోయిన్ దివ్యవాణికీ అలాంటి చేదు అనుభవమే ఎదురయింది. ఇటీవలి ఒంగోలు మహానాడులో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆమె అలిగారు. అసలు తనకు పార్టీలో గుర్తింపు లేదని అధికార ప్రతినిధిగా ఉన్న దివ్యవాణి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇస్తున్న గౌరవాన్ని భరించలేక పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.