– డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి మూడేళ్ల నిర్వహణా వైఫల్యమే కారణం
-మహానాడు సక్సెస్ కావడంతో…కక్షతో సోషల్ మీడియా పోస్టుల పేరుతో మళ్లీ కేసులు
-ఆత్మకూరు ఉప ఎన్నికపై వైసిపి సంస్కారం లేకుండా మాట్లాడింది
– సంప్రదాయాలు పాటించి ఆత్మకూరు ఉప పోరుకు దూరం
– పార్టీ నేతలతో జూమ్ కాన్ఫరెన్స్ లో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు
అమరావతి:-రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలతో పోలవరం ప్రాజెక్టును బలి చేసిందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ ప్రభుత్వం రివర్స్ టెండర్ల విధానంపై గొప్పగా చెప్పిందని…చివరికి ఆ విధానం వల్ల ప్రాజెక్ట్ రివర్స్ అయ్యిందని విమర్శించారు. పనులు చేస్తున్న ఏజెన్సీని మార్చవద్దని కేంద్రం చెప్పిన సూచనలను రాష్ట్రం పాటించకపోవడం వల్లనే అనర్థం జరిగిందని చంద్రబాబు అన్నారు. పోలవరంలో కీలకమైన డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి నూరు శాతం ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం మారిన తరువాత సరిగా ప్రాజెక్టు నిర్వాహణ చేపట్టకపోవడం, ఏజెన్సీలను మార్చడం వల్లనే నష్టం జరిగిందని అన్నారు. 2020లోనే ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పిన జగన్ ప్రభుత్వం…2022 వచ్చినా ప్రాజెక్టు ఎందుకు పూర్తి చెయ్యలేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేమని నేడు ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. టిడిపి మండల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇంచార్జ్ లతో చంద్రబాబు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బాదుడే బాదుడు, సభ్యత్వ నమోదు, పార్టీ కమిటీల ఏర్పాటు వంటి అంశాలపై రివ్యూ చేశారు.
మహానాడు గ్రాండ్ సక్సస్ అయ్యిందని…దీంతో ప్రభుత్వం మళ్లీ కుట్రలు, కక్ష సాధింపులు మొదలు పెట్టిందని చంద్రబాబు అన్నారు. సోషల్ మీడియాలో పోస్టుల పేరుతో ప్రభుత్వం వేధిపుంలు మొదలుపెట్టిందని అన్నారు. మహానాడు సక్సెస్ పై రాష్ట్ర వ్యాప్త చర్చ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం కుట్ర పూరితంగా కేసులతో భయపెట్టే ప్రయత్నం చేస్తుందని అన్నారు.
సంస్కారం లేని వైసిపికి టిడిపి విధానాలు ఏం తెలుసు?
ఆత్మకూరు ఉప ఎన్నికల విషయంలో అధికార పార్టీ వ్యవహరించిన తీరుపై చంద్రబాబు మండి పడ్డారు. చట్ట సభ సభ్యుడు చనిపోతే….వాళ్ల కుటుంబ సభ్యులకే తిరిగి ఉప ఎన్నికల్లో సీటు ఇస్తే పోటీ పెట్టకూడదు అనే విధానం టిడిపి పాటిస్తుందని అన్నారు. ఈ విధానం తోనే గౌతమ్ రెడ్డి మృతి కారణంగా వచ్చిన ఉప ఎన్నికలో టిడిపి పోటీ పెట్ట లేదని అన్నారు. మొదటి నుంచి టిడిపి ఈ విధానాన్ని అనుసరిస్తుందని చంద్రబాబు అన్నారు. అయితే దీని పైనా వైసిపి నీచంగా రాజకీయ విమర్శలు, సవాళ్లు చెయ్యడానికి చంద్రబాబు తప్పుపట్టారు.
సంస్కారం లేకుండా వైసిపి నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బద్వేల్ లో ఎందుకు పోటీ పెట్టలేదో…ఆత్మకూరులో కూడా అందుకే పోటీ పెట్టలేదని చంద్రబాబు అన్నారు. రాజకీయాల్లో కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు పాటించాలి అని చంద్రబాబు అన్నారు. జగన్ పాలన చెయ్యలేకపోతున్నారని…..ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుందని చంద్రబాబు అన్నారు. ఒక్క నెలలో 9500 కోట్లు అప్పులుగా తెచ్చారంటే…రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవాలని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు ప్రజలు, ఉద్యోగులపై దాడులు చెయ్యడం పరిపాటిగా మారిందని చంద్రబాబు అన్నారు. వైసిపి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా… ఏఈ సూర్యకిరణ్ పై దాడి చెయ్యడానికి చంద్రబాబు ఖండిచారు. అధికార పార్టీనేతల ఆకృత్యాలకు అంతం లేకుండా పోతుందని అన్నారు. స్వయంగా ప్రజా ప్రతినిధులు, వైసిపి మూకలు అధికారులపై దాడులు చేస్తుంటే…సిఎం మౌనం దేనికి సంకేతం అని చంద్రబాబు ప్రశ్నించారు.