-వరికి మరింత మద్దతు..క్వింటాల్ కు మరో వంద పెంపు
-పంటలకు కనీస మద్దతు ధరలను భారీగా పెంచిన కేంద్ర కేబినెట్
-తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్
రైతుల ఆదాయాలు పెంచేలా కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలను భారీగా పెంచడం సంతోషదాయకం. వరి మద్దతు విషయంలో కేంద్ర కేబినెట్ మరింత ఉదారంగా వ్యవహరించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నాటికి పోల్చుకుంటే మరింతగా కనీస మద్దతు ధరలను భారీగా పెంచిన కేంద్ర కేబినెట్ నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తున్నా. గతంలో క్వింటాలు వరికి మద్దతు ధర రూ.1940. ఇప్పుడు దాన్ని మరో వంద రూపాయలు పెంచి, రూ.2040కి చేర్చారు. దీంతో రాష్ట్రంలోని వరి రైతులకు లబ్ధి చేకూరుతుంది.
ఏ గ్రేడ్ వరికి మద్దతు రూ.2060 వరకు ఇస్తామని కేంద్ర కేబినెట్ నిర్ణయించడం రాష్ట్ర రైతాంగానికి మరింత ఆనందం కలిగించనుంది. జొన్న పంట మద్దతు ధర క్వింటాల్ కు రూ.232 పెరిగి రూ.2970కి చేరగా.. సజ్జలు రూ.2350, రాగి రూ.3578, మొక్క జొన్న రూ.1962, కందులు రూ. 300 పెరిగి రూ.6600, పెసలు క్వింటాల్ కు రూ. 400 పెరిగి రూ.7755, మినుములు రూ.6600, వేరుశనగ రూ.5850, ప్రొద్దుతిరుగుడు రూ.6400, సోయాబీన్ రూ.4300, నువ్వులు రూ.7830, పత్తి రూ.6080, పత్తి (పొడవు రకం) రూ.6380, నైగర్ సీడ్ మద్దతు ధర రూ.7287కి చేరడం ముదావహం.
కనీసమద్దతు అందించే బాధ్యత రాష్ట్రానిదే..
రైతుల జీవితాల్లో వెలుగు నింపేందుకు మరిన్ని చర్యలు తీసుకునేందుకు కేంద్రం సదా సిద్ధంగా ఉంది. కేంద్రం ఇచ్చిన మద్దతు ధరలను రైతులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఇందుకు అవసరమైన అన్ని సహాయకచర్యలు అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. కనీసమద్దతు ధర ప్రతి రైతుకు అందేలా , వ్యవసాయం దండుగ కాదని నిరూపించేలా రాష్ట్రం చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు రాష్ట్రంలో ఖరీఫ్, రబీ సీజన్ లో ఎరువుల అవసరాలను తీర్చడానికి దేశంలో తగినన్ని యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయి. రైతులకు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతోనే ఎరువులను అందుబాటులో ఉంచేలా కేంద్రం సబ్సిడీని పెంచింది.
కార్యాలయ కార్యదర్శి