Suryaa.co.in

Crime News Entertainment National

పోలీసుల అదుపులో శ్రద్ధా కపూర్ సోదరుడు

బాలీవుడ్ నటుడు శక్తికపూర్ కుమారుడు సిద్ధార్థ కపూర్ ఓ రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోయాడు. డ్రగ్స్ సేవించిన అతడ్ని బెంగళూరు పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని ఎంజీ రోడ్డులో రేవ్ పార్టీ జరుగుతున్న హోటల్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. సుమారు 35 మంది నుంచి నమూనాలు తీసుకుని ల్యాబ్ కు పంపించారు. అందులో సిద్ధార్థ కపూర్ సహా ఆరుగురు డ్రగ్స్ సేవించినట్టు పరీక్షల్లో తేలింది. డ్రగ్స్ సేవించి పార్టీకి వచ్చారా..? లేక హోటల్లో పార్టీకి వచ్చిన తర్వాత డ్రగ్స్ సేవించారా? ఎక్కడి నుంచి వీరికి డ్రగ్స్ సరఫరా అయ్యాయి? తదితర కోణాల్లో పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు.

“సిద్ధార్థ కపూర్ డ్రగ్స్ సేవించినట్టు పరీక్షలో పాజిటివ్ వచ్చింది. అతడ్ని ఉల్సూర్ పోలీసు స్టేషన్ కు తరలించాం’’ అని బెంగళూరు ఈస్ట్ డివిజన్ డీసీపీ భీమశంకర ఎస్ గులేద్ తెలిపారు.

నటి శ్రద్ధా కపూర్ సోదరుడే సిద్ధార్థ కపూర్. 2020లో వచ్చిన వెబ్ సిరీస్ భౌకాల్ లో సిద్ధార్థ కపూర్ చింటూ దేదా పాత్రలో నటించడం తెలిసిందే. షూటవుట్ ఎట్ వడాల, అగ్లీ, హసీనా పర్కార్ తదితర సినిమాల్లోనూ నటించాడు. ధోల్, చుప్ చుప్ కే తదితర కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. డ్రగ్స్ సేవించి అనుమానాస్పద రీతిలో మరణించిన నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో శ్రద్ధాకపూర్ ను విచారించడం తెలిసిందే.

LEAVE A RESPONSE