– ఉపఎన్నికల్లో మేకపాటి కుటుంబం కాకుండా వేరే అభ్యర్ధిని నిలబెడితే టీడీపీ సత్తా చూపుతాం
– ప్రజాప్రతినిధులు చనిపోయిన స్థానాల్లోని ఉప ఎన్నికలపై వైసీపీ విధానం ఏమిటో జగన్ రెడ్డి స్పష్టం చేయాలి
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు మరణించిన స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకూడదనే ఉత్తమ సంప్రదాయాన్ని పాటిస్తోంది. ఇప్పుడు ఆత్మకూరు ఉప ఎన్నికల విషయంలో కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. మరణించిన సభ్యుని కుటుంబీకులే ఉపఎన్నికల్లో పోటీ చేస్తే పోటీ నిలబెట్టకుండా ఎన్నికలకు దూరంగా ఉండే సంప్రదాయానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది.
1999లో నల్గొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే ధీరావత్ రాగ్యానాయక్ చనిపోతే, 2002లో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఆయన భార్య ధీరావత్ భారతి నాయక్ అభ్యర్ధిగా నిలబడినప్పుడు టీడీపీ అధికారంలో ఉండి కూడా పోటీ చేయలేదు. అదే విధంగా నంద్యాల లోక్ సభ ఉపఎన్నికల్లోనూ పోటీ చేయకుండా.. తెలుగు వ్యక్తి పి.వి.నరసింహరావు ప్రధానిగా ఎన్నికయ్యేలా చేశాం. 2009లో వై.ఎస్.రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఆ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో వై.ఎస్.విజయ పోటీ చేసినపుడు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్ధిని నిలబెట్టలేదు.
2021 తిరుపతి వైసీపీ ఎంపీ దుర్గాప్రసాద్ చనిపోతే.. జగన్ రెడ్డి ఆ కుటుంబంలోని వ్యక్తికి కాకుండా ఇతరులకు సీటు ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశాం. ఇప్పుడు ఆత్మకూరు ఉపఎన్నికల అభ్యర్ధిగా మేకపాటి గౌతంరెడ్డి కుటుంబానికి చెందిన వ్యక్తులే ఉన్నారు. అందువలన మా సాంప్రదాయాన్ని పాటిస్తూ.. పోటీకి దూరంగా ఉన్నాం. మేకపాటి కుటుంబానికి కాకుండా వేరే వారికి సీటు కేటాయిస్తే.. తెలుగుదేశం పార్టీ తప్పక పోటీలో నిలబడుతుంది. సత్తా చాటుతుంది. పోటీపై సవాళ్లు చేస్తున్న జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ చిత్తశుద్ధి ఉంటే మరణించిన శాసనసభ్యుల స్థానాల్లో పోటీపై టీడీపీ విధానం ఏమిటో స్పష్టంగా చెప్పాం.
వైసీపీ కూడా తమ విధానం ఏమిటో స్పష్టం చేయాలి. జగన్ రెడ్డి అసమర్ధ, అవినీతి పాలనపై ప్రజలు చిర్రెత్తిపోయి ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, వైసీపీని విసిరి బంగాళాఖాతంలో పారేద్దామా అన్నట్లు ఎదురు చూస్తున్నారు. జగన్ రెడ్డి అండ్ బ్లూ బ్యాచ్ దిక్కుమాలిన సవాళ్లు చేయడం మాని.. ప్రజా సమస్యలపై దృష్టిసారించండి.