Suryaa.co.in

Family

నీ కలలు కూడా తానే కనేది నాన్న..!

ఊహ తెలిసిన నాటి నుంచి
నీ భవిష్యత్తు కోసం
నువ్వు కలలు కంటావేమో..
అంతకు చాలా
ముందు నుంచే
నీ కోసం
కలలు కనేది
నాన్న..!

నీ కలలను నిజం చేసుకునే క్రమంలో నువ్వు తప్పటడుగులు వేస్తావేమో..
వాటిని సరిదిద్దేది
నాన్న..!

నీ విజయాలకు మురిసిపోయి..
నీ గురించి ఎరిగినవారందరికి
కథలుగా చెప్పుకుని సంబరపడిపోయేది
నాన్న..!

చదువుకునేటప్పుడు
నువ్వు కునికిపాట్లు పడతావేమో..
నీ చదువు కోసం నిద్రమానుకుని
జాగరాలు చేసేది
నాన్న..!

స్కూలుకు నిన్ను దింపేటప్పుడు
బండి సీటు తన రుమాలుతో తుడిచి నీకోసం
సిద్ధం చేసేది..
నీ ఉన్నతి కోసం
ఎన్నో యుద్ధాలు చేసేది నాన్న!

చదువు విలువ
చదువుకోని తనకు బాగా తెలుసు గనక
తనకు అక్షరం ముక్క రాకపోయినా
నీ అక్షరాల కోసం
అక్షరాలా వేలు..
డిగ్రీ కోసం
లక్షలు ఖర్చు చేసి
తానుగా కుచేలుడైనా
నీ ముందు కుబేరుడిలా ఫోజులు కొట్టేది
నాన్న..!

నీ ఉప్మా కోసం ఉపవాసం..
నీ సౌకర్యాల కోసం
కష్టాలతో సహవాసం..
నీ ఫీజుల కోసం
అప్పులతో సావాసం..
ఇంకెన్నో సాహసాలు చేస్తూ
పంటి బిగువున బాధలు భరిస్తూ నగుమోముతో
నీకు కనిపించే
మహానటుడు
నాన్న!

సంక్రాంతి..ఉగాది..
దసరా..దీపావళి..
పుట్టినరోజు..
ఇలా ప్రతి సందర్భంలో
తను ఓవర్ టైం చేసి
డస్సిపోతూ
నీకో కొత్త డ్రస్సు
కొనిచ్చే మహాత్యాగి
నాన్న..!

ఒకనాటికి నువ్వు
పట్టా చేతబట్టుకుని చెట్టాపట్టాలేసుకుని
వచ్చేపాటికి ఇంటిల్లిపాది
చేసుకునే సంబరాల మాటున
నాన్న నవ్వు చాటున
కంట్లో కనిపించే చెమ్మను
నువ్వు చూడగలిగితే..
ఆ కంటిని తుడవగలిగితే..
ఇక ఇదే నీ కష్టాలకు
సెలవు నాన్నా..
అంటూ నువ్విచ్చే భరోసా
ఆపై నాన్న శేషజీవితం నిజంగా కులాసా!!

జీవితపర్యంతం
ఒక్కటి యాదుంచుకో..
నీ బ్రతుకు చిత్తరువు..
నాన్న కష్టాల ఉత్తరువు..!

సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286

LEAVE A RESPONSE