– టీడీపీ అధికార ప్రతినిధి గౌతు శిరీష
జగన్మోహన్ రెడ్డి పాలనంతా అబద్ధాలమయమే. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జరగని సంక్షేమ పథకాలను జరిగినట్టు చూపిస్తూ రోజుకో వర్గాన్ని మోసం చేస్తున్నారు. సంక్షేమ పథకాలను కత్తెర పథకాలుగా మార్చారు. జగన్మోహన్ రెడ్డి అసమర్థ చర్యలతో దళితులు సంక్షేమానికి దూరమవుతున్నారు. ప్రభుత్వ ప్రకటనకు కోట్ల రూపాయిలు వెచ్చిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమానికి మాత్రం పైసా ఖర్చు చేయడంలేదు.
ఎన్టీఆర్ హయాంలో ఒక్క బల్బు ఉన్న గుడిసెకు ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టగా ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి 50 యూనిట్లకు పెంచారు. దాన్ని చంద్రబాబు గారు 150 యూనిట్లకు పెంచి ఎస్సీ, ఎస్టీలకు కానుక ఇచ్చారు. మోసపూరిత విధానాలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఇన్నాళ్లూ కుల ధృవీకరణ పత్రం చూపిస్తే చాలు..రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అమలయ్యేది. జగన్ రెడ్డి ఆ పథకానికి తూట్లు పొడిచేందుకు కొత్త నియమ, నిబంధనలు తెచ్చారు. కొత్త విద్యుత్ రాయితీ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోనే నివాసం ఉండాలి. ఎస్సీ, ఎస్టీలు ఇళ్లు అద్దెకు ఇవ్వకూడదు.
ఎస్సీ, ఎస్టీలు ఒకటికి మించి కరెంటు మీటర్లు కలిగి ఉండకూడదు
నేటి కాలంలో అందరూ కలిసిమెలిసే ఉంటున్నారు. ఎస్సీ , ఎస్టీ కాలనీలు ఎక్కడున్నాయి? కొత్త నిబంధన వల్ల ఉచిత విద్యుత్ పథకానికి బలహీన వర్గాలను దూరం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు ఒక్క ఇల్లే ఉండాలా? జగన్ రెడ్డి గారికి మాత్రం హైదరాబాద్, బెంగుళూరు, తాడేపల్లి, పులివెందులలో ప్యాలెస్ లు ఉండాలి. దళిత సోదరులకు మాత్రం ఒక్క ఇల్లే ఉండాలా? ఇంతకంటే మోసం ఉంటుందా? ఎస్సీ, ఎస్టీ సోదరులు జనజీవన స్రవంతిలో ఎదగకూడదా? వారు ఒకటికి మించి కరెంటు మీటరు పెట్టుకోకూడదా? వైసీపీ ప్రభుత్వ మోసాలు కళ్లకు కడుతున్నాయి. ఉద్యోగం చేసి ఆదాయపన్ను చెల్లిస్తే విద్యుత్ ఇవ్వరా?
ఒంటరి మహిళలకు ఇచ్చే పించను కట్ చేశారు
పనికిమాలిన వాటికి బడ్జెట్ కేటాయించి, అవసరమైన వాటికి తూట్లు పొడుస్తున్నారు. కరెంటు బిల్లు వెయ్యి దాటితే రేషన్ తీసేస్తున్నారు. కరెంటు బిల్లు పెంచి సంక్షేమ పథకాలు కట్ చేస్తారా? ఇలాంటి మోసపు పాలన గతంలో ఎప్పుడూ చూడలేదు. చంద్రబాబు గారిపై విష ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రి చేస్తున్న మోసాలను ప్రశ్నిస్తే మాపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెడుతున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే రాజద్రోహం కిందకు ఎలా వస్తుంది? విపక్షంలో ఉండగా మద్యపాన నిషేదం చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చేశారు. మూడేళ్లయింది అధికారంలోకి వచ్చి…సీపీఎస్ ఏమైంది? 3 వేల పించన్ వాయిదాల పద్దతిలో ఇస్తానని ఆరోజు చెప్పలేదే?
ఒక్క చాన్స్ ఇమ్మని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అప్పటికే టీడీపీ విజయవంతంగా అమలు చేసిన పథకాలను కక్షపూరితంగా నిలిపేశారు. ప్రభుత్వ పెన్షన్ తో బతుకుతున్న ఒంటరి మహిళలను మోసం చేశారు. కష్టాల్లో ఉన్న వారికి 30 ఏళ్ల నుంచి పించను ఇవ్వకుండా 50 ఏళ్లకు ఇస్తామని పెంచడం దుర్మార్గం కాదా? ఆదరణ పథకం తీసేసి బీసీలను ముంచారు. మూడేళ్లుగా బీసీలను ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతోంది. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే అయ్యన్న పాత్రుడు లాంటి సీనియర్లను ఎలా ఇబ్బంది పెడుతున్నారో చూస్తున్నాం. చెత్త మీద పన్ను వేసిన వాళ్లు దేనికైనా తెగిస్తారు. సొంత ఇళ్లలో ఉండేవారు కూడా అద్దె కట్టాలని రూల్ తెచ్చినా ఆశ్చర్యం లేదు. ప్రజలు ఆలోచన చేయాలి.
సాక్షిలో వస్తున్న తప్పుడు కథనాలను నమ్మొద్దు. 7 లక్షల పెన్షన్లు తీసేశారు. 10 లక్షలమందికి అమ్మఒడి దూరం చేస్తున్నారు. 15 లక్షలమంది రైతులకు రైతు భరోసా నుంచి తొలగించారు. సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తూ ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. మనకు రూ. 100 ఇచ్చి రూ. 1000 దోచేస్తున్న జగన్మోహన్ రెడ్డి పాలనకు ప్రజలు చరమగీతం పలకాలి.