-జీపుతో తొక్కించడమే కాకుండా తిరిగి కేసులు పెట్టి బెదిరించాలనుకోవడం దుర్మార్గం
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
టీడీపీ మహిళా నేత, చిత్తూరు మాజీ మేయర్ కఠారి హేమలతపై పోలీసుల దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. వైసీపీ ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తే పోలీసులను అడ్డుపెట్టుకుని ఎంతకైనా తెగిస్తున్నారు. హేమలత ఏం నేరం చేసిందని పోలీసులు అంత దుర్మార్గంగా ఆమెపై జీపుతో తొక్కించారు? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, నిరంకుశ పాలనను ఎదురిస్తే వైసీపీ నేతలు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదనడానికి ఈ ఘటనే నిదర్శనం.
తన అత్తమామల హత్య కేసులో సాక్ష్యులను బెదిరించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని హేమలత చెప్పడం పోలీసులకు నేరంగా కనిపించిందా? వైసీపీ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి పోలీసులు ఇంతలా దిగజారడం సిగ్గుచేటు. పోలీస్ వ్యవస్థకే అవమానం. దేశంలో ఎక్కడా లేని విధంగా కొందరు పోలీసులు అధికారపార్టీకి తొత్తులుగా మారారు. బాధితులకు అండగా నిలవాల్సిందిపోయి వారిపైనే ఎదురు కేసులు పెట్టడమేంటి?
జీపుతో తొక్కించడమే కాకుండా విధులకు ఆటంకం కలిగించారని హేమలతతో పాటు ఆమె అనుచరులపై ఎదురు కేసు పెట్టడం దేనికి సంకేతం? పోలీసులు ఉన్నది ప్రజల రక్షించడానికా? వైసీపీ నేతల అక్రమాలకు గొడుగు పట్టడానికా? పోలీసుల భుజాలపై తుపాకులు పెట్టి టీడీపీ కార్యకర్తలను అంతమొందించాలనుకోవడం దుర్మార్గం. వైసీపీ కుట్రలో పోలీసులు పావులు కావొద్దని హెచ్చరిస్తున్నాం. ఈఘటనపై పోలీసుశాఖ స్పందించాలి. హేమలతకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది.