హాయి నిద్రలో కమ్మని కలలను…
తనివి తీరా ఆస్వాదించి
ఆదమరచి నిద్రపోయే
వెన్నెల పానుపు….!!
చల్లనైన వాతావరణంలో…
వాత్సల్య పూరితమైన స్పర్శతో
వెచ్చగా చుట్టేసే
అనురాగపు దుప్పటి….!!
కష్టసుఖాల్లో
కొండంత ధైర్యాన్నిచ్చి
మదినిండా ప్రశాంతను నింపి
అనుభవ పాఠాలు నేర్పిన
మమతల పందిరి …!!
మూసిన కనురెప్పల వెనుక
తడి తడి స్మృతులను
సున్నితంగా గుర్తుచేసే
“పరిమళ జ్ఞాపకం”…!!
అమ్మ చెంగు లాంటి
మనసైన, మృదువైన
మధురమైన పానుపు
ఈ భూమండలంలోనే కాదు
ముల్లోకాల్లోనే మరొకటి ఉండదు..!!
అమ్మ చెంగును
మించిన స్వర్గం లేదు
అమ్మ పిలుపుని
మించిన దైవం లేదు…!!
నలిగల రాధికా రత్న