ఏపీలో అధికార పార్టీ వైఎస్సార్సీపీ ఓ కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా ప్రస్తుత పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు పార్టీ రాజ్యాంగానికి ఓ కీలక సవరణ కూడా చేయనున్నారు. శుక్రవారం నుంచి మొదలు కానున్న పార్టీ ప్లీనరీ వేదికగా వైసీపీ ఈ నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఏపీ హోం మంత్రి తానేటి వనిత కూడా గురువారం కీలక ప్రకటనలు చేశారు.
వైఎస్సార్సీపీని జగనే ప్రారంభించినా… పార్టీ అధ్యక్షుడిగా ఆయనే కొనసాగుతున్నా.. ప్రతి ప్లీనరీలో జగన్‌నే పార్టీ అధినేతగా ఎన్నుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇకపై ఇలా ప్రతి ప్లీనరీలో జగన్‌ను పార్టీ అధినేతగా ఎన్నుకునే ప్రక్రియను పక్కనపెట్టేయనున్నట్లు సజ్జల తెలిపారు.
శుక్రవారం నుంచి మొదలుకానున్న పార్టీ ప్లీనరీలో జగన్‌ను పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు పార్టీ రాజ్యాంగానికి ఓ సవరణ కూడా చేయనున్నట్లు సజ్జల తెలిపారు. పార్టీ ప్లీనరీ ముగిసే రోజైన శనివారం దీనిపై కీలక ప్రకటన వెలువడనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదే విషయంపై గురువారం ఉదయం హోం మంత్రి తానేటి వనిత కూడా ఓ ప్రకటన చేశారు.