Suryaa.co.in

Andhra Pradesh

సజ్జల గారూ… కాకిలెక్కలు కట్టపెట్టి నిజాలు చెప్పండి

-దమ్ముంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయండి
-స్పెషల్ ఆడిట్ చేయించి వాస్తవ వివరాలు వెల్లడించండి
• జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు, ఆర్.బి.ఐ, కేంద్ర ఆర్ధిక కార్యదర్శులు ఏపీలో శ్రీలంక లాంటి ఆర్ధిక పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు
• కానీ, టిడిపి నాయకులు మాట్లాడితే మాత్రం వైసీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు
• తెలుగుదేశం హయాంలో 27/28 శాతం మించని డెట్ జి.ఎస్.డి.పి రేషియో వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి గరిష్టంగా 35 శాతానికి మించి ఎందుకు పెరిగిందో దువ్వూరి కృష్ణ, సజ్జల చెప్పాలి
• టిడిపి ఐదేళ్లలో కేవలం 173 రోజులు మాత్రమే ఓడికి వెళితే వైసీపీ మూడేళ్లలోనే 332 రోజులు ఓడీకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది?
• ఈ ఆర్ధిక సంవత్సరంలో మొదటి మూడున్నర నెలలోనే దేశంలోనే అత్యదికంగా రూ. 27,890 కోట్లు ఆర్.బి.ఐ బాండ్ల వేలంలో రుణాలు సేకరించాల్సిన గత్యంతరం దేనికి?
• గత మూడు నెలలుగా దేశంలో కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కాగ్ నివేదికలు వెబ్ సెబ్ లో ఎందుకు పెట్టడం లేదు
• దేశంలోనే ఏపీలో ఈరోజు అత్యధిక ద్రవ్యోల్బణం 8 నుంచి 10 శాతం వరకు ఉన్నట్లు జూలై ఆర్.బి.ఐ నివేదికలో పేర్కొన్న మాట వాస్తవం కాదు
– తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్

ఎప్పటిలాగే సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకొచ్చి రాష్ట్ర అప్పులపై, ఆర్ధిక పరిస్థితిపై కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నాయంటూ విషంకక్కారు. జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు, ఆర్.బి.ఐ, కేంద్ర ఆర్ధిక కార్యదర్శులు ప్రధానికి ఇచ్చిన నివేదికల్లో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని శ్రీలంకతో పోల్చిన సంధర్బాలు మనం చూశాం. కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడితే మాత్రం ఢిల్లీలో వైసీపీ ఎంపీలు, ఏపీలో సజ్జల గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు. ఏపీలో ఆర్ధిక పరిస్తితి రోజురోజుకు పతనమై ఆర్ధిక అత్యయిక పరిస్థితి నెలకొనే దారుణమైన పరిస్థితులు ఉంటే మాట్లాడకూడదా?

మార్చి 31, 2022 నాటికి రాష్ట్ర అప్పు రూ. 6,38,836 కోట్లు, బహిరంగ మార్కెట్ రుణాలు రూ.4,13,000 కోట్లు, కార్పొరేషన్ల రుణాలు రూ.1,38,603 కోట్లు, పెండింగ్ బిల్లులు రూ.1,50,000 కోట్లు మొత్తంగా రాష్ట్ర అప్పు రూ. 7,88,836 కోట్లు ఉన్నట్లు ప్రధాన దిన పత్రికలు ప్రచురించాయి. వైసీపీ నాయకులు దుష్ట చతుష్టయం, పసుపు మీడియా అంటూ పైశాచిక ఆనందం పొందుతూ తమ అక్కసు వెళ్లగక్కినా ఈ వాస్తవాలు చెరిగిపోవు. వాస్తవాలను మసిపూసి మారేడుకాయ చేయడానికి, అబద్దాలతో ప్రజలను దువ్వడానికి ముఖ్యమంత్రి ఆర్ధిక వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణను మీడియా ముందుకు ప్రవేశపెట్టారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చాలా చక్కగా ఉంది, శ్రీలంక లాంటి ఒక దేశంతో, ఏపీ లాంటి రాష్ట్రాన్ని పోల్చడం తగదు, దేశాలకు, రాష్ట్రాలకు ఉండే ఆర్ధిక పరిస్థితులు వేరంటూ దువ్వూరి మాట్లాడారు. కానీ చిత్రంగా ఆయన మాత్రం ఏపీని దేశ ఆర్ధిక గణాంకాలతో పోల్చతూ ఏదో తాము మెరుగైన పరిస్థితిలో ఉన్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. శ్రీలంకతో పోల్చడం కరెక్టు కాదంటూ ఏపీని దేశ ఆర్ధిక పరిస్థితితో పోల్చి కేంద్రం కంటే మేం బెటర్ గా ఉన్నాం అంటూ పోల్చడం ఎంత వరకు సబబు. దువ్వూరి కృష్ణకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కేంద్ర ప్రభుత్వ గణాంకాలతో కాకుండా ఇతర రాష్ట్రాలతో మన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని పోల్చి మాట్లాడి ఉంటే బాగుండేది.

ఇతర రాష్ట్ర గణాంకాలతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని ఒకసారి చూస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తాయి. డెట్ టు జీ.ఎస్.డి.పి శాతం కేంద్రం కంటే చాలా బ్రహ్మాండంగా ఉందని చెబుతున్న దువ్వూరి కృష్ణ ఒక రాజకీయ నాయకుడిలా మాట్లాడారు. ఒక బాధ్యతాయుతమైన అధికారిగా ఉండి రాజకీయాలు మాట్లాడటం సిగ్గుచేటు. ఒక వైసీపీ నాయకుడిలా ఆయన మాట్లాడటం అత్యంత బాధ్యతా రాహిత్యం. ఒక అధికారిగా ఆయన గణాంకాలు చెబితే ఎవరికీ ఇబ్బంది లేదు….కానీ ప్రతిపక్షపార్టీ పేరు పెట్టి టిడిపి ప్రభుత్వం ఇలా చేసింది… అలా చేసింది కానీ వైసీపీ ప్రభుత్వం ఇంకా మెరుగ్గా పనిచేసిందని మాట్లాడటం హేయం. ఆయన ఈ పద్దతి మార్చుకోవాలి.
1. డెట్ జి.ఎస్.డి.పి
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో డెట్ టు జి.ఎస్.డి.పి శాతం.
సం. శాతం
2014-15 28.25
2015-16 27.28
2016-17 27.87
2017-18 27.83
2018-19 28.02
2019-20 31.70
2020-21 35.53
2021-22 32.51

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో డెట్ టు జి.ఎస్.డి.పి శాతం 27, 28 శాతంకు మించి పెరగలేదు. కానీ, వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి ఏడాది 2019-20 లో 31.7%, 2020-21 లో 35.53% 2021-22 లో సవరించిన అంచనాల ప్రకారం 32.51 శాతానికి పెరిగింది. ఇంత దారుణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గణాంకాలు ఉంటే ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం కంటే చాలా బాగా చేస్తున్నామని చెబుతారు?
2021-22 సవరించిన అంచనాల ప్రకారం మన పొరుగు రాష్ట్రాలతో ఏపీ డెట్ జి.ఎస్.డి.పి రేషియో పోల్చి చూస్తే….
రాష్ట్రం డెట్ టు జి.ఎస్.డి.పి (%)
చత్తీస్ ఘడ్ లో 26.2
తమిళనాడు 27.4
తెలంగాణ 24.7
కర్ణాటకలో 26.6
ఒరిస్సాలో 18.8
ఏపీ 32.51
పై లెక్కలను బట్టి ఏపీ డెట్ టు జి.ఎస్.డి.పి రేషియో ఇతర రాష్ట్రాల కంటే దారుణంగా 32.51 శాతం ఎందుకుందో, వైసీపీ ప్రభుత్వ ఆర్ధిక క్రమశిక్షణ ఏంటో వారే చెప్పాలి. కోవిడ్ వల్ల ఎక్కువ అప్పులు చేశామని చెబుతున్న వీళ్లు ఇతర రాష్ట్రాలకు కోవిడ్ లేదని చెప్పగలరా? ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కోవిడ్ వచ్చిందా? కోవిడ్ ను వైసీపీ ప్రభుత్వం ఒక వంకగా మాత్రమే చూపిస్తోంది.

2026-27 నాటికి డెట్ టు జి.ఎస్.డి.పి రేషియో వివిధ రాష్ట్రాలలో ఏ విధంగా ఉంటాయో ఆర్.బి.ఐ జూలైలో ఒక నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం ఏపీలో 33.9%, ఒరిస్సా 19.7%, కర్ణాటక లో 22.6%, తెలంగాణలో 29.8% చత్తీస్ ఘడ్ లో 29.7%, తమిళనాడులో 31% గా ఉంటాయని చెప్పారు. మన పొరుగు రాష్ట్రాలలో డెట్ టు జి.ఎస్.డి.పి భవిష్యత్తులో కూడా ఏపీ కంటే తక్కువగానే ఉండబోతుందని ఆర్.బి.ఐ అంచనా. రాబోయే ఆరేళ్లల్లో కూడా ఏపీ డెట్ టు జి.ఎస్.డి.పి రేషియో తగ్గే పరిస్థితి లేదని చెప్పడం వైసీపీ ప్రభుత్వంకు సిగ్గుచేటు కాదా? డెట్ టు జి.ఎస్.డి.పి విషయంలో ఇతర రాష్ట్రాలతో పోల్చినా, తెలుగుదేశం హయాంతో పోల్చినా డెట్ టు జి.ఎస్.డి.పి రేషియో వైసీపీ ప్రభుత్వంలో చాలా దారుణంగా ఎక్కువగా ఉంది. దీనికి సజ్జల, దువ్వూరి ఏం సమాధానం చెబుతారు?

2. అత్యధిక అప్పులు
అప్పులు చేయడంలో కూడా ఏపీ చాలా క్రమశిక్షణతో వ్యవహరిస్తోందని వైసీపీ పెద్దలు మాట్లాడుతున్నారు. ఇది పచ్చి అబద్దం. వైసీపీ ప్రభుత్వం ప్రతీ మంగళవారం ఆర్.బి.ఐ బాండ్ల వేలంలో అప్పులు టంచనుగా తెచ్చుకుంటోంది. ఈనెల 19 వ తేదిన సైతం 8.03 శాతం అత్యధిక వడ్డీతో రూ. 2 వేల కోట్లు అప్పు తెచ్చారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూలై 19 వ తేది వరకు రూ. 27,890 కోట్లు అప్పు తెచ్చి (దీనికి రూ.8వేలకోట్ల లిక్కర్ బాండ్లు అదనం) దేశంలోనే అత్యధిక అప్పు తెచ్చిన రాష్ట్రంగా ఏపీ రికార్డు కొట్టింది. అప్పుల్లో ఏపీ కంటే ఒక్క మహారాష్ట్ర మాత్రమే ఒక రెండు వేల కోట్లు అదనంగా అప్పు తీసుకుంది. మహారాష్ట్ర ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తంగా రూ. 30 వేల కోట్లు అప్పు తెచ్చింది. కానీ, మహారాష్ట్ర ఆర్ధిక వనరులతో పోల్చితే వారు తీసుకున్న అప్పు చాలా తక్కువే అని చెప్పాలి. మన రాష్ట్రం కంటే మహారాష్ట్ర ఆదాయం రెండింతలు అన్న విషయం కూడా గమనించాలి.

ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ రాష్ట్రాలు ఆర్ బిఐ ద్వారా పొందిన రుణాలు
ఆంధ్రప్రదేశ్ రూ.27,890 కోట్లు
హర్యానా రూ. 13 వేల కోట్లు,
తెలంగాణ రూ. 12 వేల కోట్లు
రాజస్థాన్ రూ. 12 వేల కోట్లు,
పశ్చిమ బెంగాల్ రూ. 12 వేల కోట్లు
తమిళనాడు రూ. 11 వేల కోట్లు,
పంజాబ్ రూ. 9,600 కోట్లు,
గుజరాత్ రూ. 7 వేల కోట్లు
ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏ రాష్ట్రం చేయనంతగా ఈ ఆర్ధిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఎందుకు చేయాల్సి వచ్చిందో వైసీపీ నాయకులు చెప్పాలి. ఈ ఏడాది ఆర్.బి.ఐ లో 14 సార్లు అప్పులకోసం బాండ్ల వేలం జరిగితే 9 సార్లు అత్యధిక వడ్డీ చెల్లించి మరీ అప్పులు తెచ్చారు. ఇది నిజమో కాదో దువ్వూరి, సజ్జల చెప్పాలి. ఇదేనా ఆర్థిక క్రమశిక్షణ అంటే?

2019-20లో బుగ్గన మొదటి బడ్జట్ ప్రసంగం పేజి 5 పారా 9 లో విభజన సమాయానికి ఏపీ అప్పు 1,30,654 కోట్లని 2019 లో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ. 2,58,928 కోట్లకు చేరినట్లు చెప్పారు. అంటే ఐదేళ్లలో సుమారుగా టిడిపి ప్రభుత్వం రూ. 128000 కోట్లు మాత్రమే అప్పు చేసినట్లు బుగ్గనే సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పారు. అంటే టిడిపి ఏడాదికి సగటున రూ.25 వేల కోట్లు మాత్రమే అప్పు చేసింది. ఆర్థికమంత్రి చెప్పిన ఈ గణాంకాలు తప్పనే ధైర్యం సకలశాఖామంత్రి సజ్జలకు ఉందా?

3. ఓవర్ డ్రాప్టు:
తెలుగుదేశం ప్రభుత్వ ఐదేళ్లలో 2014-15 లో 6 రోజులు, 2015-16 లో 8 రోజులు, 2016-17 లో 9 రోజులు, 2017-18 లో 43 రోజులు, 2018-19 లో 107 రోజులు ఓడికి వెళ్లి మొత్తంగా ఐదేళ్లలో కేవలం 173 రోజులు మాత్రమే ఓవర్ డ్రాఫ్ట్ పై ఆధారపడాల్సిన పరిస్థితి. సగటున ఇది ఏడాది 35 రోజులు మాత్రమే. కానీ, వైసీపీ ప్రభుత్వం 2019-20 లో 57 రోజులు, 2020-21 లో 103 రోజులు, 2021-22 లో 146రోజులు, 2022-23లో మేనెల వరకు 26రోజులు ఓడికి వెళ్లి మొత్తంగా మూడేళ్లలో 332 రోజులు ఓడికి వెళ్లారు. ఇది ఏడాదికి సరాసరి 111 రోజులు. తెలుగుదేశం కంటే మూడు రెట్లు అధికంగా ఓవర్ డ్రాప్టుకు ఎందుకు వెళ్లాల్సివచ్చిందో కూడా సజ్జల, దువ్వూరి సమాధానం చెప్పాలి. దేశంలోనే అత్యదికంగా చేబదుళ్లు తీసుకున్న ప్రభుత్వం వైసీపీనే. 2022-23 ప్రస్థుత ఆర్ధిక సంవత్సరం ఒక్క మే నెలలో 20 రోజులు ఓడికి వెళ్లారు. 31 రోజులు చేబదుళ్లు తీసుకున్నారు. 31 రోజులు ప్రత్యేక డ్రాయింగ్ సౌకర్యం (Special drawing facility) తీసుకున్నారు. ఇతర రాష్ట్రాలకు అవసరం పడని ఇంతటి పరిస్థితులు వైసీపీ ప్రభుత్వంకు మాత్రమే ఎందుకు వచ్చాయో కూడా చెప్పాలి.

4. జిఎస్ డిపి (స్థూల ఉత్పత్తి) పెరుగుదల:
2014-15లో 5,20,030 కోట్లుగా ఉన్న రాష్ట్ర జిఎస్ డిపి చంద్రబాబునాయుడి గారి పరిపాలనా దక్షతవల్ల, ఆయన తీసుకువచ్చిన పెట్టుబడులు, సంస్కరణల వల్ల 2018-19నాటికి రూ.9,33,402కోట్లకు చేరుకుంది. ప్రతిసంవత్సరం 15నుంచి 16శాతం పెరుగుదలను నమోదు చేస్తూ ఆ స్థాయికి మన రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తి చేరుకుంది. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక స్థూల ఉత్పత్తి పెరుగుదల శాతం దారుణంగా పడిపోయింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేవలం 1.4శాతం పెరుగుదల నమోదుచేసి రాష్ట్ర జిఎస్ డిపి రూ. 9,86,611 కోట్లకు మాత్రమే చేరుకుంది.
జిఎస్ డిపి పెరుగుదల వివరాలు (రూ.కోట్లలో):
2014-15 5,20,030
2015-16 6,03,376 (16శాతం పెరుగుదల)
2016-17 6,99,307 (16శాతం పెరుగుదల)
2017-18 8,03,873 (15శాతం పెరుగుదల)
2018-19 9,33,402 (16శాతం పెరుగుదల)
2019-20 9,72,782 (4.2శాతం పెరుగుదల)
2020-21 9,86,611 (1.4శాతం పెరుగుదల)

5.ద్రవ్యలోటు మరియు రెవిన్యూలోటు:
2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉన్న ద్రవ్యలోటు, 2019-22 మధ్య వైసిపి ప్రభుత్వ హయాంలో ఉన్న ద్రవ్యలోటు వివరాలు (కోట్లలో):
2014-15 లో రూ. 20, 745
2015-16 లో రూ. 22, 059
2016-17 లో రూ. 30, 908
2017-18 లో రూ. 32, 380
2018-19 లో రూ. 35, 467

2019-20 లో రూ. 39, 687
2020-21 లో రూ. 55, 167
2021-22 లో రూ.51, 112 (ఫిబ్రవరి వరకు).
పై వివరాలు గమనించినట్లయితే 2018-19లో రూ.35,467 కోట్లుగా ఉన్న రాష్ట్ర ద్రవ్యలోటు 2021-22 (ఫిబ్రవరి నాటికి) రూ.51వేల కోట్లకు చేరుకుంది. కానీ, ఆశ్చర్యకరంగా మార్చి, 2022కి గాను కాగ్ కు సమర్పించిన లెక్కల్లో రాష్ట్రప్రభుత్వం ఫిబ్రవరి వరకు ఉన్న రూ.51వేల కోట్ల ద్రవ్యలోటును అమాంతంగా రూ.25వేల కోట్లకు తగ్గించి చూపడం వలన నేడు ద్రవ్యలోటు 2.1శాతంగా ఉన్నట్లు కాకిలెక్కలు చెబుతున్నారు. కేవలం నెలరోజుల్లో రూ.26వేల కోట్లమేర లోటు తగ్గడం ఏవిధంగా సాధ్యం?

2014లో రూ.16వేల కోట్ల రెవిన్యూ లోటుతో ప్రారంభమైన నవ్యాంధ్ర ప్రస్థానం చంద్రబాబు ప్రభుత్వం యొక్క ఆర్థిక క్రమశిక్షణవల్ల 2018-19 సమయానికి రెవిన్యూ లోటును రూ.13,899కోట్లకు తగ్గించగలిగారు. కానీ, దురదృష్టవశాత్తు జగన్ సర్కారు 2020-21కి రెవిన్యూ లోటును తిరిగి రూ.35,540 కోట్లకు చేర్చి… 2021-22 ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నాటికి రెవిన్యూ లోటును రూ.38,169 కోట్లకు చేరవేసింది. దీనినిబట్టి టిడిపి ప్రభుత్వం కంటే మూడేళ్లలోనే మూడురెట్లు రెవిన్యూలోటు పెంచిన ఘనత వైసిపి ప్రభుత్వానికి దక్కుతుంది.

6.కాగ్ నివేదికలు మాయం
కాగ్ నివేదికలను సైతం మాయం చేసిన చరిత్ర వైసీపీది. 2022-23 కి సంబంధించి మార్చి, ఏప్రిల్, మే నెలలలో ఒక్క కాగ్ రిపోర్టు కూడా వెబ్ సైట్ లో పెట్టలేదు. దేశంలోని 29 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, అస్సాం తప్పా మిగిలిన 27 రాష్ట్రాలన్నీ కాగ్ నివేదికలు వెబ్ సైట్ లో ఉన్నాయి. ఎందుకు ఏపీ కాగ్ నివేదికలు వెబ్ సైట్ లో అందుబాటులో లేవో సజ్జల చెప్పాలి. దొంగలెక్కలు పద్దులు తేల్చలేకపోతున్నారా? ఫిబ్రవరి 2022 లో రాష్ట్ర ద్రవ్యలోటు 51112 కోట్లు, అది మార్చి నెలకి రూ.25 వేల కోట్లకు ఎలా పడిపోయింది? ఇదేలా సాధ్యమో చెప్పాలి. ఫిబ్రవరి 2022 లో రూ. 38 వేల కోట్లుగా ఉన్న రెవెన్యూ లోటు మార్చి నాటికి రూ. 8 వేల కోట్లకు తగ్గిపోయింది. ఈ రకంగా కాగ్ కు కూడా తప్పుడు లెక్కలు ఇచ్చి దాదాపు మూడు నెలలు కాగ్ రిపోర్టులు వెబ్ సైట్ లో లేకపోవడానికి ఎవరు కారకులు? తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం వైసీపీ మానుకోవాలి. ఫిబ్రవరికి మార్చికి ద్రవ్యలోటు రూ.26 వేల కోట్లకు, రెవెన్యూ లోటు రూ. 30వేలకోట్లు ఎలా తగ్గిపోయిందో, ఎందుకు ఇంత వ్యత్యాసం వచ్చిందో దువ్వూరి కృష్ణ చెప్పాలి.

2014-15 లో రూ. 16 వేల కోట్ల రెవెన్యూ లోటుతో తెలుగుదేశం ప్రభుత్వం ప్రయాణం మొదలు పెడితే..ఆర్ధిక క్రమశిక్షణతో 2018-19 కి దానిని రూ. 13,899 కోట్లకు తగ్గించడం జరిగింది. కానీ వైసీపీ ప్రభుత్వం దానిని 2019-20 లో రూ. 26,441కి, 2020-21 లో రూ. 35,540 కోట్లకు తీసుకెళ్లారు. 2022-23 లెక్కలు ఇంకా తేలలేదు. దీని ఎంతకు తీసుకెళతారో తెలయదు. ద్రవ్యలోటు, రెవెన్యూలోటును రెండింతలు పెంచడం ఆర్ధిక క్రమశిక్షణ అంటారా?

7.పెరిగిన పన్నుల ఆదాయం
నిన్న ముఖ్యమంత్రి కార్యదర్శి దువ్వూరు కృష్ణ పన్నుల ఆదాయం పడిపోయిందని చెప్పడం పచ్చి అబద్ధం. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుంచి మార్చి 31,2022 నాటికి పన్నుల ద్వారా రూ.3,78,718 కోట్లు (కేంద్ర పన్నుల వాటాతో కలిపి) ఆదాయం వచ్చింది. 2019-20 లో రూ. 1,11,034 కోట్లు, 2020-21 లో రూ. 1,17,136 కోట్లు, 2021-22 లో రూ. 1,50,548 కోట్లు పన్నుల రూపంలో ప్రజలనుంచి వసూలు చేశారు. మద్యం నుంచి ఆర్టీసీ ఛార్జీల వరకు ప్రతీ ఒక్కదానిపై జగన్ రెడ్డి పన్నుల మోతమోగించి జలగలా లాగేశారు. ఆదాయం తగ్గిందని వైసీపీ చెబుతున్న మాట అవాస్తవం. వచ్చిన ఆదాయం, తీసుకున్న అప్పులు కలిపి మొత్తంగా దాదాపు రూ.10 లక్షల కోట్లు వైసీపీ ప్రభుత్వం చేతికొచ్చింది. ఈ రూ. 10 లక్షల కోట్లకు అదనంగా ఈ ఏడాది ఆర్.బి.ఐ వేలంలో రూ.28 వేల కోట్లు, లిక్కర్ బాండ్ల రూపంలో మరో 8 వేల కోట్లు అప్పులు తీసుకున్నారు. జగన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి రూ. 10 లక్షల 36 వేల కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరితే ఈ మొత్తం దేనికి ఖర్చు చేశారు? సజ్జల చెప్పినట్లు లక్షా 60 వేల కోట్లు ప్రజలకు బటన్ నొక్కి ప్రజలకు ఇస్తే మిగిలిన రూ. 8 లక్షల 40 వేల కోట్లకు లెక్కలు చెప్పే దమ్ము వైసీపీ ప్రభుత్వంకు ఉందా? ఉద్యోగుల జీతాలు రూ. లక్షా 80 వేల కోట్లు కూడా మినహాయిస్తే కూడా ఆరున్నర లక్షల కోట్లకు పైగా ఏం చేశారో చెప్పాలి. పోలవరం ప్రాజెక్టు కట్టారా? రాజధాని అమరావతి నిర్మాణం చేపట్టారా? పెద్దఎత్తున అవినీతికి పాల్పడి సొంత ఖజానాకు మళ్లించుకోవడం వల్లే అప్పు కొండలా పెరిగిపోయింది.

మొన్నటికి మొన్న పోలవరం ప్రాజెక్టు ఎందుకు ముందుకు కలదడంలేదని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర అడిగిన ప్రశ్నకు మంత్రి ఇచ్చిన సమాధానం…. The delay in the implementation of the project is identified by the committee is because of low spending capacity అని చెప్పారు. Low spending capacity అంటే ఏంటో సజ్జల తెలుసుకోవాలి. కేవలం వైసిపి సర్కారు నిధులు ఖర్చు చేయకపోవడం వలనే పోలవరం ప్రాజెక్ట్ ముందుకు కదలడం లేదని కేంద్ర సర్కారు స్పష్టంగా చెప్పింది. ఖజానాకు చేరుస్తున్న లక్షలకోట్ల నిధులు ఎటువైపు దారిమళ్లుతున్నట్లు? వైసీపీ అవినీతికి వచ్చిన మొత్తం ఆదాయం ఆవిరైపోయింది కాబట్టే పోలవరం ప్రాజెక్టుపై ఖర్చు చేయలేదు.

8.అధిక ద్రవ్యోల్బణం
శ్రీలంకలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉంది కాబట్టే నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటి అక్కడ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమై ప్రజలు ఆందోళనబాట పట్టారు. ఆర్బిఐ జూలైలో ఇచ్చిన నివేదిక పేజి నం.84 లో ఏఏ రాష్ట్రాలలో ఎక్కడెక్కడ ఎంతెంత ద్రవ్యోల్బణం ఉందో చాలా స్పష్టంగా తెలిపారు. ఇందులో ఏపీలో దేశంలోనే అత్యధికంగా 8 నుంచి 10 శాతం ద్రవ్యోల్బణం ఉన్నట్లు రిపోర్టులో చెప్పారు. మిగతా రాష్ట్రాలకు లేని ద్రవ్యోల్బణం ఏపీకి మాత్రమే ఎందుకు ఉంది? ఇది వైసీపీ ప్రభుత్వం చేతగానితనం కాదా? మిగిలిన రాష్ట్రాలలో 6 నుంచి 8 శాతం మాత్రమే ఉన్న ద్రవ్యోల్బణం మన రాష్ట్రంలో 10శాతానికి ఎందుకు చేరుకుంది?

9. రుణ గ్యారెంటీలు
అప్పులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చే గ్యారెంటీలలో కూడా భారతదేశంలోనే ఏపీ అత్యధికంగా ఇచ్చిన రాష్ట్రంగా ఉంది. జి.ఎస్.డి.పి లో దాదాపు 9 శాతం వరకు గ్యారెంటీలు ఇచ్చారని జూన్ లో విడుదల చేసిన ఆర్.బి.ఐ రిపోర్టులో చాలా స్పష్టంగా చెప్పారు. పశ్చిమ బెంగాల్ 0.6, పంజాబ్ 5.3, కేరళ 3.9, బీహార్ 3.4, ఉత్తర ప్రదేశ్ 8 శాతం మాత్రమే రుణాలకు గ్యారంటీలు ఇవ్వగా.. ఏపీ మాత్రం జిఎస్ డిపిలో అత్యధికంగా 9 శాతం రుణాలకు గ్యారంటీలు ఇచ్చింది. దొడ్డిదారిన అప్పులు తెచ్చుకునేందుకు కార్పరేషన్లు ఏర్పాటు చేసి ఇంతపెద్ద ఎత్తున గ్యారెంటీలు ఇస్తారా?

10. విద్యుత్ డిస్కమ్ లు:
డిస్కమ్ ల ఆర్థిక పరిస్థితుల గురించి, పనితీరు గురించి పాఠాలు చెబుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రప్రభుత్వం ప్రతిసంవత్సరం విడుదల చేసే జాతీయ స్థాయి డిస్కమ్ ల ర్యాంకింగ్స్ ను ఒకసారి పరిశీలించాలి. చంద్రబాబు హయాంలో 2018 సంవత్సరానికి విడుదలచేసిన డిస్కమ్ ర్యాంకింగ్స్ లో రాష్ట్రంలోని ఈపిడిసిఎల్ జాతీయ స్థాయిలో ఎ గ్రేడ్ సాధించగా, ఎస్ పిడిసిఎల్ బి ప్లస్ గ్రేడ్ ను సాధించడం జరిగింది. అదే జగన్ రెడ్డి సర్కారు వచ్చాక 2020 సంవత్సరానికి గాను విడుదల చేసిన జాతీయస్థాయి డిస్కమ్ ర్యాంకింగ్స్ లో గతంలో ఏ గ్రేడ్ సాధించిన ఈపిడిసిఎల్ సి గ్రేడ్ కు, గతంలో బి ప్లస్ గ్రేడ్ సాధించిన ఎస్ పిడిసిఎల్ బి గ్రేడ్ కు పడిపోయాయి. డిస్కమ్ ల యొక్క పనితీరు, వాటియొక్క ఆర్థిక పరమైన అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రతిసంవత్సరం కేంద్రప్రభుత్వం గ్రేడింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనినిబట్టి స్పష్టంగా జగన్ సర్కార్ లోపభూషయిష్ట విధానాల వల్ల విద్యుత్ డిస్కమ్ లు ఏరకంగా పతనమయ్యాయో అర్థమవుతుంది.

పిఎసికి పత్రాలు సమర్పించి స్పెషల్ ఆడిట్ చేయించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదలచేసి బహిరంగ చర్చకు వచ్చే దమ్ముందా?
ఎవరి హయాంలో ఎంత అప్పుచేసింది, దేనికి ఖర్చుచేసింది గణాంకాలతో సహా చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ తరపున మేం సిద్ధంగా ఉన్నాం. మీరు దువ్వూరి కృష్ణ గారిని తెచ్చుకుంటారా, లేక బుగ్గన గారిని తెచ్చుకుంటారో కలిసి రండి. మా పార్టీ తరపున యనమల, పయ్యావుల కేశవ్, ఇతర సహచరులం కలిసి వస్తాం. దమ్ముంటే గత మూడేళ్ల కాలంలో ఏ సంవత్సరం ఎంత అప్పు తెచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలి. కాకి లెక్కలు చెప్పడం కాదు. టీడీపీ హయాంలో రూ.1.11 లక్షల కోట్లకు సంబంధించి లెక్కలు మిస్ అయ్యాయని దుష్ప్రచారం చేస్తున్నారు. దీనిపై పీఏసీ సమావేశాన్ని ఏర్పాటుచేసి రెగ్యులరైజ్ చేయాలని కేంద్రమంత్రి సమాధానంలో స్పష్టంగా పేర్కొన్నారు.

ప్రస్తుత ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేకపోయింది? పిఎసికి ఎందుకు వివరాలు అందజేయలేదు? వ్యవస్థలన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి కదా? పత్రాలన్నీ పిఎసికి అందించి ఒకవేళ ఏమైనా అవకతవకలు జరిగిఉంటే బయటపెట్టే అవకాశం అధికారంలో ఉన్న మీకు ఉంది. ఆ పని ఎందుకు చేయలేదు? పీఏసీ సమావేశాన్ని ఏర్పాటుచేసేందుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీ దొంగలెక్కలన్నీ బయటపడతాయనా? 2014 నుంచి ఇప్పటివరకు ప్రతి డాక్యుమెంట్ ను పయ్యావుల కేశవ్ గారి ముందు ఉంచే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా?

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అందుకే ఇతర రాష్ట్రాలతో, దేశాలతో పోల్చాల్సి వస్తోంది. శ్రీలంకలో ప్రతి వ్యక్తిపై లక్ష అప్పు ఉంటే.. ఏపీలో మాత్రం లక్షా 70వేల రూపాయలు ఉంది. గతమూడేళ్లుగా అభూతకల్పనలు, అవాస్తవాలతో ప్రతిపక్షంపై ఎదురుదాడిచేస్తూ పబ్బం గడుపుకోవడం అలవాటుగా మారిన సజ్జల లాంటివారి వ్యాఖ్యల వెనుక ఉన్న వాస్తవాలను విజ్జులైన రాష్ట్ర ప్రజలు గమనించాల్సిందిగా విజ్జప్తి చేస్తున్నాం.

LEAVE A RESPONSE